అమ్మ మంచి సంస్క్రతీ- సంస్కారములతో పాటు ప్రాభవము -వైభవము గల ఇంట జన్మించుటయే గాక పెరగటం కూడా జరిగింది. ఆమెకు సువిశాల ‘ప్రకృతి’యే పాఠశాల. చిన్ననాటి నుండి సేవా సహకారాన్ని అందించటం ఆమెకు అలవాటు. స్వపరభేద మెరుగని అమ్మ మానవుని మనుగడకు అన్యోన్యత -సహజీవనము- సామరస్యము అవసరమని ఆనాడే వచించింది. విప్లవభావం- ఉన్నతతత్త్వం శైవశము నుండి ఆమెలో స్పందించాయి. అంటరానితనాన్ని బాల్యములోనే ఖండించింది.

 

పతియే దైవమన్నది. ఆ నమ్మకాన్ని - ఆ మాటలను మన్నించుటకు భర్త అడుగుజాడలలో నడుచుటకు సిద్ధపడింది. తన పదునాల్గవ ఏట వివాహిత అయింది. అప్పుడే గృహస్థాశ్రమాన్ని చిన్నచూపు చూడవలదంటూ , అన్ని ఆశ్రమాలకు ఒకటే విలువ ఉన్నదన్నది, అత్మోన్నతికి పెళ్లి అడ్డుకాదన్నది. పెళ్ళిలో పెద్దపులి లేదని తేల్చింది.

 

నిరాడంబరతను వరించి కోరి బీదరికంతో చెలిమి చేసింది. అందులోనే జీవించింది. నాది అనుకోవటం కాని . నావారు అనుకోవటం కానీ అమ్మకు ఎప్పుడు లేవు. సకల సృష్టి తనదనే. సర్వులూ తన బిడ్డలనే. గృహిణిగా ఆమె బరువు బాధ్యతలు హృదయాలను కరగించేవి. కన్నీటిని చిందించేవి. అమ్మ సనాతన సంస్కృతిని సహజ ధర్మాలను మన్నిస్తుంది. కాని, ఛాందస సిద్ధాంతాలను తిరస్కరించటమే కాక సరిదిద్దుతుంది. ఒకప్పుడు బయటకు వచ్చి నలుగురితో మాట్లాడడానికి సంకోచించే అమ్మ, ధీరవనిత కనుకనే తన విశిష్ట సిద్ధాంతాలను, విన్నూత భావాలను పుష్కలంగా వెదజల్లగల్గుతున్నది. అమ్మ నడిచే బాటలో అడుగడుగునా ఓర్పు- త్యాగము మనకు కనిపిస్తాయి. ప్రేమ కంటే ధర్మం గొప్పది. అంటుంది. అమ్మ అందుకనే నాన్నగారికి తోడై నిలిచిందేమో!

 

బాధయే భగవంతుడనుకొని బాధలను మౌనంగా భరిస్తుంది. కొన్ని సందర్భాలలో తన మనస్సులోని బాధ పైకి చెప్పకుండా ఆమె పడే మూగ వేదన చూస్తే ఎదుటివారి గుండెలు పగులుతాయి. నిరంతర పరిశ్రమయే ఆమెకు తెలుసును కాని, క్షణకాలమైనా విశ్రాంతి ఎరుగదు. 1954 నుండి అమ్మను చూచేందుకు ప్రారంభమైన జనం నేడు అసంఖ్యాకంగా రావటం చూస్తున్నాము గదా! వచ్చిన వారి ఆలనా- పాలనా చూస్తూ, వారితో గంటల తరబడి మాట్లాడేది. అవసరమైతే ఇప్పుడునూ. మరి.......... ఆ నిర్మల మాతృత్వానికి స్పందించని హృదయమేది? ఆమె ఏటు చూసిన మాతృత్వం ప్రసరిస్తుంది. వంటలోను - వడ్డనలోను ఆమెకు అసాధారణ ప్రతిభ- నిపుణత ఉన్నదనీ , ఆ రుచిని ఎన్నడు మరవలేమనీ చాలామంది చెపుతారు.. అందరిని పేరుపేరునా పలకరించి కడుపునిండా ఆహారం పెట్టేది. బిడ్డలకు బలవంతం చేసి ఎక్కువ తినిపించే అలవాటు కూడా ఉంది. సుష్టుగా భోజనం చేసేవారంటే ఆమెకు ఎనలేని ప్రీతీ. ఎవరైనా ఒక ముద్ద తక్కువ తింటే ఆమె పడే ఆరాటం ఇంతా అంతా కాదు.. వచ్చినవారిని ఆదరించటం ఎవరికేమీ కావాలో కనుగొని వారికందించటం ఆమెకు తృప్తి. ఇట్టి ఆప్యాయత చూపించే అమ్మ అంటే, ఇంత అనురాగం కురుపించే అమ్మ అంటే ఎవరికి ఇష్టముండదు?

 

కొన్ని ఘట్టాలలో ఒక్క కన్నీటి బొట్టు విడవకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. విన్న మనం చూసిన మనం విస్తుపోతాం. ఇటువంటి స్త్రీ మనకు ఆదర్శమూ - ఆరాధ్యమూ కదూ! అందుకే నోరారా- మనసారా "అమ్మా" అని పిలుస్తాన్నాము. "అమ్మ" అనే పదానికి అర్థం ఆచరణలో చూపుతున్నది. ఇంతకంటే విశేషం ఏమిటే?

 

Author: 
శ్రీ గరుడాద్రి
Source: 
మాతృశ్రీ మాసపత్రిక సంపుటి 8 సంచిక 5 | ఆగస్టు - 1973