1983 ఆగస్టు 30వ తేది ఉదయం గం. 7-15 సమయం అమ్మ గదిలో-‘ అమ్మ- నేనూ’ ఉన్నాము.

 

అమ్మ చాలా అనారోగ్యంగానూ బలహీనంగానూ ఉంది.

 

డాక్టర్ ఇనజకుమారి వచ్చింది.

 

వజ్రోత్సవం... అయిన దగ్గరనుండీ అమ్మకు విరోచనాలు వళ్ళంతా కురుపులు ----హైబ్లడ్ ప్రెజర్., ఉధృతంగా ఉన్న బ్లడ్ షుగర్.

 

క్రొత్తగా చెవిలో కురుపు. అది విపరీతమయిన బాధ పెడుతున్నది.-అని అమ్మే చెబుతున్నది.

 

ఎన్ని మందులిచ్చినా, ఎందరో వేరే డాక్టర్లు మందులు మార్చిన ప్రయోజనం ఏమి కనిపించలేదు. డాక్టర్ సత్యనారాయణమూర్తి కూడా హోమియో చికిత్స చేస్తున్నారు. ఏం ఉపయోగం? బ్లడ్ షుగర్ కంట్రోల్ కాలేదు. దాని కారణంగా అనేకమయిన ఇతర బాధలు, ఒకటి విడిస్తే మరొకటి!

 

అన్నీ అమ్మ సహనానికి పరీక్షలే. ఏ క్షణానా అమ్మ లో విసుగ్గానీ విరక్తికానీ కనిపించదు. ఎంత బాధనయినా నవ్వుతూ అనుభవించడమే అమ్మకు తెలుసును.- అదే మనకు మరింత బాధను కలిగిస్తుంది. పైగా- అమ్మకు ఆ బాధలతో సరదా కాలక్షేపం.

 

అసలు, ఏ బాధలేని రోజు - నేను అమ్మ దగ్గరకు జేరి 21 సంవత్సరాలయింది.- ఈ దీర్ఘకాలంలో నాకు కనిపించలేదు. ఉంటే, ఆనాడు అమ్మ ఎట్లా ఉంటుందో! ఏమీ తోచక బాధ పడుతుందేమో!

 

అమ్మకు ‘నయం చేయడం చేతకాని’ డాక్టర్ ఇనజకుమారి అన్నది, "అమ్మా- నీ వ్యాధులు మాకు అర్థం కావటం లేదు. నీవిట్లా ఎన్నాళ్ళు బాధపడతావు? ఎక్కడకయినా పెద్ద డాక్టర్ల వద్దకు బొంబాయి గానీ ఢిల్లీ గాని వెడదాం......" అని.

 

ఆ సలహాను అమ్మ చెవిని పెట్టలేదు. నేను క్కూడా కల్పించుకొని " అమ్మా - డాక్టర్ గారు చెప్పిన మాట బాగున్నది, ఎవరినయినా పెద్ద డాక్టర్లను చూస్తే-త్వరగా నయమౌతుందేమో?” అన్నాను.

 

“అసలే డబ్బు లేక సంస్థ బాధపడుతున్నది. ఈ పరిస్థితిలో నా కోసం వేలు ఖర్చు పెట్టటం ఎందుకూ? ప్రస్తుతం అన్నపూర్ణలయంలో కూర కూడా చేయడం లేదు. ఈ పైకం పెట్టి కూరలు కొని చేయించండి, పిల్లందరూ హాయిగా భోజనం చేస్తారు. నాకు ఈ బాధలు ఎట్లాగో అలవాటు అయినవే కదా! వీటికోసం మీకెందుకు బాధ?" అని అమ్మ మా ఆలోచనను ఖండించింది.

అమ్మకు తన కోసంగా, తన ఆరోగ్యంకోసంగా తన సుఖం కోసంగా ఒక్క రూపాయి కూడా వ్యయం కావడం ఇష్టం లేదు. ప్రతి పైసా కూడా పిల్లల కోసమే ఖర్చు కావాలని అమ్మ అబిలాష. తన తపన అంతా పిల్లల తృప్తి కోసమే.

 

పైగా "మీరు తింటే నేను తిన్నట్లే" నంటుంది. "మీకు పెట్టుకోక పోతే నేను చిక్కి పోతాను" అంటుంది. మనం ఎంతగా తలలు బ్రద్దలు కొట్టుకొన్నా - ఆ వాక్యాల్లోని అంతరార్థం మనకు అవగతం కాదు.

 

ఒకనాడు అమ్మకు కడుపులో మంట వచ్చింది. వసుంధరక్కయ్య మజ్జిగ ఇచ్చింది. మంట తగ్గింది. మళ్ళీ ఒకనాడు అమ్మకు మంట వచ్చింది. ఆనాడు వసుంధరక్కయ్య మజ్జిగ ఇవ్వబోయింది. కానీ అమ్మ మజ్జిగ తాగలేదు.

 

"కాసేపు ఓర్చుకుంటే ఈ మంట తానంతట అదే తగ్గుతుంది. ఆ మజ్జిగ దాచండి. ఏ రాత్రివేళ ఎవరు వస్తారో, ఈ మజ్జిగ వాళ్ళకు ఉపయోగపడుతుంది" అని సలహా చెప్పింది.

 

ఆ రాత్రి నిజంగానే ఎవరో యాత్రికులు రావడమూ, ఆ దాచిన మజ్జిగ వారికి ఉపయోగపడటమూ జరిగింది. ఇది అమ్మ దూర దృష్టి కో దివ్య దృష్టికో నిదర్శనం కావచ్చును. కానీ,మనం యిప్పుడు ఆ మహాత్య్మాల్ని గురించి ప్రస్తావించుకోవడం లేదు. ఉన్న పిల్లల కోసం కాదు, రాబోయే పిల్లలకోసం వారి ఆకలినీ, అవసరాన్నీ, ముందుగానే ఊహించి - తన మంటనూ, ఆకలిని ప్రక్కకు నెట్టి వేస్తుంది అమ్మ. ఇది ఏ తల్లి అయినా తన రక్త మాంసాలని పంచుకుని పుట్టిన బిడ్డలకోసమే చేయగల్గుతుంది. మరి, అమ్మ ఎవరికోసమయిన చాలా సహజంగా చేస్తుంది. అందువల్లనే అమ్మ విశ్వజనని, విశ్వవందిత అయింది!!!

 

మనం ఎన్నిరకాలుగా ఆలోచించినా, అమ్మకు మాత్రం ఒకటే ఆలోచన. అది మన ఆకలి గురించీ. మనం ముక్తీ, మోక్షం ..... అని ఎన్ని మాటలంటున్నా -- అమ్మ "మీ భోజనమే నాకు ముఖ్యం" అంటుంది.

 

మనకు పెట్టుకోవడంలో అమ్మ కు ఎంతో సంతృప్తి, సంతోషమూ.

 

"నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా కడుపునిండా తినగలిగిన వాడు దొరకడం ఎంత అదృష్టం !" అంటుంది అమ్మ.

 

"మనం పెట్టినా తినేవాడు దొరకాలి కదా" అని కూడా అంటుంది.

 

ఆగష్టు 27 వ తేదీన అలహాబాదు నుండి శ్రీ వల్లూరి పార్థ సారథి గారు, గుంటూరు నుండి వల్లూరి రామమూర్తి గారు వచ్చారు. అమ్మ సన్నిధి లో కూర్చుని ఆ సాన్నిధ్య ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. అమ్మ కాఫీ తెప్పించి యిచ్చింది.

 

వారు ఆ కాఫీ త్రాగుతూ " మా అదృష్టం" అని ఒకరూ, " మా భాగ్యం " అని మరొకరు ఆనందిస్తుంటే- అమ్మ అన్నది "ఆ అదృష్టం భాగ్యం మీవి కావు నాన్న- నావి " అని అమ్మ పసిడి నోట వెలువడిన ఆ మాటకు వాళ్ళు అబ్బుర పడి పోయారు. అర్థం కాకపోయినా ఆనందపడి పోయారు. మనం అన్నం తినడమూ, మనం కాఫీ త్రాగడమూ మన అదృష్టమూ, అమ్మ అమృత హస్తం మీదుగా అందుకోనగలగడం మన భాగ్యం అవుతాయి కానీ యిందులో అమ్మకు అదృష్టం గానీ- భాగ్యంగానీ ఏముందీ?

 

1977 నవంబరు 5 వ తేదీన విశాఖపట్నం నుంచి శ్రీ రామకృష్ణ శెట్టి గారు వచ్చారు. వారికి అమ్మ ఎంతో ఆప్యాయంగా అన్నం పెట్టిందీ, క్రొత్త గుడ్డలు పెట్టింది.

 

ఆయన "అమ్మా!- చిన్నతనం నుంచీ నాకు అన్నీ ప్రసాదించావు, నాకు ఏ వెలితీ లేదు. నాకీ క్రొత్త గుడ్డలు ఎందుకమ్మా?" అని అడిగాడు.

 

వెంటనే అమ్మ అన్నది" నీకు వెలితీ ఉందని కాదు నాన్నా, నాకే వెలితి ఉంది. దాన్నీ పూడ్చుకోడానికే యివన్నీ....."

 

మనం అమ్మను ఏ దైవం పేరుతో పిలుస్తున్నా, కొలుస్తున్నా- అమ్మ మాత్రం " నేను అమ్మను, మీరు బిడ్డలు" అంటుంది.

 

నేను ఏ అవతారాన్నీ కాదు; అమ్మను మాత్రమే. అందువల్లనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నాకు తెలియవు. తల్లి ధర్మం మాతమే తెలుసును" అని నిర్మొహమాటంగా స్పష్ట పరుస్తుంది.

 

ఇదీ అమ్మ తత్వం, ఎంత సేపు మన ఆకలి తీరూస్తూ, మన బాధాలను తొలిగిస్తూ, మనకోసం నిరంతరం ఆలోచిస్తూ ఆవేదన చెందుతూ " నేనేం చేసినా నా కోసమే, నా తృప్తి కోసమే" అంటుంది. అందువల్లనే మనం చెప్పకుండానే మన ఆకలిని కనుగొంటుంది - మనం అడక్కుండానే మనకు అన్నం పెడుతుంది. మన అవసరం, మన మేలూ మన కంటే అమ్మకీ బాగా తెలుసును.

 

కనుకనే "అడగందే అమ్మయినా పెట్టదు" అన్న సామెతను మార్చివేసి "అడక్కుండా పెట్టేదే అమ్మ" అనే క్రొత్త నిర్వచనాన్ని లోకానికి అమ్మ అనుగ్రహించింది.

 

అడక్కుండా పెట్టే అమ్మకు ఉపకరణమే ‘ అన్నపూర్ణాలయం’.

 

ఇంతవరకు షుమారు ఒక కోటి మందికి పైగా అన్నం పెట్టిన ‘ అన్నపూర్ణాలయం’ యీ సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన అత్యంత వైభవోపేతంగా రజతోత్సవం జరుపుకొని అమ్మ దివ్యత్వమూ, మానవతా సమ్మిళితమైన ద్వివర్ణ పతాకాన్ని విహాయన వీధుల్లో ఎగురవేసింది.

 

Author: 
కీII శేII శ్రీ కొండముది రామకృష్ణ
Source: 
మాతృశ్రీ మాస పత్రిక - సంపుటి 18 - సంచిక 4&5- జూలై, ఆగస్టు 1983