నేను రెండవసారి అమ్మను దర్శించిన ఘట్టంతో, గ్రహించిన విషయాలనూ విశేషాన్నీ ఈ క్రింద వివరిస్తాను.

 

నేను పొన్నూరులో నివసిస్తున్న రోజులవి. నాకు 14 సంవత్సరాలు. నేను రమణ అనే నా స్నేహితుడు పొన్నూరు నుండి జిల్లెళ్ళమూడి నడచి వెళ్ళాలని అనుకున్నాము. రేపు జిల్లెళ్ళమూడి వెళ్తామనగా నా స్నేహితుడు జానకిరామశర్మ ఇంట్లో కొబ్బరికాయలు కోయమంటే చాల ఎత్తైన చెట్టు మొదటిసారిగా ఎక్కి కోశాను. అప్పుడు వాళ్ళు నాకు రెండు కాయలు యిచ్చారు. ఆ రెండు కాయలు మరొక చిన్న పూల మాల తీసుకోని నేను రమణ ఇద్దరం కలసి ఉదయం 5-15 నిముషాలకి పొన్నూరులో బయలుదేరి మఱ్ఱిపూడి గుళ్ళ మీదుగా పూండ్ల నుండి జిల్లెళ్ళమూడికి చేరాము.

 

నేను పెద్దపూజలో అమ్మని చూడటం అదే మొదటిసారి. అప్పుడు వందలాది జనం భజన చేస్తున్నారు. చీమలమఱ్ఱి లలితాంబగారు నామం చెబుతున్నారు. అమ్మకి పెద్ద గజమాలలు వేసి గొంతువరకు గులాబీ మాలలుతో పూజ చేస్తున్నారు. కిరీటం పెట్టారు. అమ్మకు అనేక రకాల ముద్రలు వస్తున్నాయి. నివేదనకి అనేక పళ్ళు స్వీట్లు హాట్లు సిద్దంగా ఉన్నాయి. అంత పెద్ద మాలలను, నివేదనకు అన్ని పదార్థములను నేను నా స్నేహితుడు చూసి నామోషి వేసి అమ్మ కూర్చి వెనుక నుండి నెమ్మదిగా వెళ్లి పాత మందిరం దూలానికి ఉన్న మేకుకి సంచిని తగిలించి తిరిగి వచ్చి జనంలో కూర్చున్నాము.

 

ఆ సందర్భంలో అమ్మ కళ్ళు మూసుకొనే ఉంది. ముద్రలు వేస్తూనే ఉంది. కొంత సేపు అయిన తర్వాత అమ్మను ప్రక్కన నిల్చున్న వారు పిలిచారు. అప్పుడు అమ్మ కళ్ళు తెరించింది. ప్రతి ఒక్కరికి తీర్థం వేసి బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తూంది. దానితో బాటు అరటిపండు కొరికి ఇస్తుంది. నేను రమణ అమ్మ దగ్గరికి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకొని వచ్చాము. పాత మందిరంలో భోజనం చేశాము.

 

సాయంత్రం 4 గంటలకి ప్రక్కనే ఉన్న చిన్న పాకలో అమ్మ ఉంటే నేను వెళ్లి కూర్చున్నాను. అమ్మ వాళ్ళతో వీళ్ళతో ఏదో మాట్లాడి, మా వంక చూస్తూ 'నాన్నా! మీరు నాకేమైనా తెచ్చారా? ప్రభావతితో ఎవరో చెప్పారు' అని అడిగింది. ఆ రోజు అక్కడ ప్రభావతి లేదు. తన సర్వజ్ఞాత్వాన్ని బయట పెట్టకుండా ఎవరి మీదో పెట్టి అడుగుతుందని విన్నాను. అదీగాక మేము సంచీ మందిరం లో పెట్టినప్పుడు అమ్మ కళ్ళు మూసుకొని కూర్చున్నది. మా సంచీలో కూడా అమ్మ నేత్రాలు ఉన్నవా ఏమిటి? అనుకున్నాము. 'తెచ్చాము అమ్మా!' అన్నాను. 'అట్లా అయితే తీసుకొని రండి.' అన్నది అమ్మ. నేను వెళ్ళి రమణకి చెప్పి సంచి తీసుకొని వస్తే మాల వాడిపోయి ఉండటం వలన అవతల పారేశాము. అది మే నెల ఎండ బాగా ఉంది. కొబ్బరికాయలు కొట్టి అమ్మకు ఇచ్చాము. ఎంతో ఇష్టంగా కొరికి తింటూ " అబ్బ యెంత తియ్యాగా ఉంది." అన్నారు అమ్మ. పెద్ద పూజలో పెటిన స్వీట్లు,హాట్లు కూడా అట్లా తిన లేదు. అట్లాంటిది కొబ్బరి ఎంతో ఇష్టంగా తిన్నారు అమ్మ. ఉన్నట్లు ఉంది ఇంకా ఏమైనా తెచ్చారా అన్నారు. నేను వాడిన చిన్న మాల అవతల పారేశాము అంటే చిన్న ఏమిటి? పెద్ద ఏమిటి? ఇందాకా వేయద్దూ? అన్నారు. లేచి నిల్చుని నాలుగు రోజులు ఉండండి అన్నది. నేను వేరే చొక్కా, లాగు తెచ్చుకోలేదు. అందుకని వెంటనే వెళ్ళాలని అన్నాను.. నేనేం చెప్పాను, 4 రోజులు ఉండేటట్లు రమ్మనలా? అన్నది.

 

ఇంతక మునుపు విన్నవి చూడటం అనుభవించటం జరిగినింది ఈ పర్యటనలో. అవి ఏమిటో ఈ క్రింద వివరిస్తాను.

 

1. క్షణ మాత్రం లో ఆధ్యాత్మిక స్థితులు రావటం ముద్రలు వేయటం కాదు రావాలి అంటారు అమ్మ. ముద్ర అంటే అధికారం అంటారు అమ్మ . అదేవిధంగా అమ్మకు ముద్రలు వచ్చినవి . ఏ లక్ష్యం కోసం ముద్రలు వేస్తారో ఆ లక్ష్యమే తానైయిన అమ్మకు ముద్రలు వచ్చినవి. మనకు ఉచ్చ్వాస నిశ్వాసాలు యెంత సహజమో అమ్మకి ఇవన్నీ అంత సహజం/span>

 

2. అమ్మ యొక్క సర్వజ్ఞత్వం కళ్ళు మూసుకుని అమ్మకి మేము తెచ్చిన కొబ్బరికాయలు పారేసిన మాల విషయం కూడా తెలియటం అంటే మన పరిసరాలు ఎఱుకలేని తపస్సుతో కూడుకున్న మన నిద్రలాంటి స్థితి కాదు, సమాధి ముద్రలు అంటే అవగతం అయింది. అమ్మ నిత్య జాగృతామూర్తి. అదే వేదాంత పరిభాషలో తురీయం.

 

3. అన్నింటిని మించిన మాతృ వాత్సల్యం నన్ను, నాతో వచ్చిన వానిని ఉండమనటం. అదీకాక మనం తెచ్చిన వస్తువులు కాక హృదయం చూసెడి దివ్యత్వం. కుచేలుని అటుకులు కృష్ణుడు తిన్నాడని, మణుగులకి మణుగులు బంగారం ముద్దలకి రత్నాలకి తూగని వాడు తులసీ దళానికి తూగాడని విన్నాను. కాని అమ్మ చెంత స్థితిని కన్నాము అనుభవించాము. అందరిపై అమ్మకి ఉన్న అవ్యాజమైన ప్రేమకి ఆశ్చర్యం ఆనందం వేసింది.

 

మరొక ముఖ్య విషయం దివ్యమూర్తిగా ఆరాధనలు అందుకోవటం కాక మరు క్షణంలో అందరితో తాదాత్య్మం చెందడి మధుర సరళ వైఖరి. నాతో వచ్చిన రమణని దగ్గర కూర్చోపెట్టుకొని, నాన్నా లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా ! నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు? అంటే మీ మాటలు వినటానికి అన్నాడు. బయట కూడా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా? అన్నది అమ్మ. మాట్లాడే వాళ్ళు వున్నారు కాని మీ లాగా మాట్లాడే వాళ్ళు లేరు. అన్నాడు రమణ. అమ్మతో బాటు అందరు గొల్లుమని నవ్వారు.. ఇది మామూలు సంఘటనగా కనబడినా, సాక్షాత్ దివ్యమూర్తి సర్వులతో ఐక్యత చెంది అందరిని దరి చేర్చమనేది నిరహం కారంతో కూడుకున్న ఆత్మేక్యతని తెలియ జేస్తుంది. ముఖ్యంగా ఇందువలనే మనమంతా విశ్వజనని ఒడిలోకి చేరి సేద తీర్చుకున్నాము.

 

1.ఆధ్యాత్మిక స్థితులు అవలీలుగా వచ్చెడి దివ్యత్వం .

 

2.సర్వజ్ఞత్వం.

 

3.వీటన్నింటిని మించిన అలౌకిక అహేతుక ప్రేమ స్వభావం .

 

4.ఎంతటి దివ్యత్వమో అంతటి సామాన్యమైన సరళ మధుర స్వభావం . ఈ విధంగా ఇంతకు ముందు విన్నవి కన్నవి కనటం అనుభవించటం జరిగింది. ఏమి చెబుతుందని కాదు మహోన్నత స్థితిని గురించి ఏమి విన్నామో చదివామో అవి చూస్తాం, అనుభవిస్తాం అనేది రెండవ దర్శనం లో తెలిసింది .

 

Author: 
శ్రీ పీయూష
Source: 
విశ్వజనని మాసపత్రిక సంపుటి 1 సంచిక 2- సెప్టెంబర్ 2001