ఇది అమ్మ గురించి కాదు. మనతో చెప్పీ చెప్పకుండా అమ్మ చేస్తున్న ఒక పనిని గురించిన ముచ్చట.

 

చెప్పీ చెప్పకుండా ఎందుకంటున్నానంటే అమ్మ తను చేసే ప్రతి పనిని గురించి చెప్పదు. మనలో చాలామంది వలెనే. చిత్రకారుడు బొమ్మ మొదలు పెట్టినప్పుడు కాన్వాసుపై గీచే గీతలు, కుంచె విదిలింపులూ మనకు ఏమిటోగా కనిపిస్తాయి . బొమ్మ పూర్తయినప్పుడు చూస్తూనే దాని అందం సాక్ష్కారిస్తుంది.

 

అప్పుడప్పుడు అమ్మ హరిదాసుగారిని, కృష్ణవేణమ్మగారిని జిల్లెళ్ళమూడిలోనే ఉండిపోమ్మనప్పుడు ఆ దంపతులుకు జిల్లెళ్ళమూడిలో తామూ ఉండిపోతున్నట్టు మాత్రమే తెలుసునుగాని, అక్కడ రానున్న పరిణామాలు వారి ఊహ కు అంది ఉండవు. అమ్మ ఆ ఊళ్ళో గడప గడపకూ తిరిగి ఆలయ నిర్మాణానికీ , ఆర్తులాదుకోవటానికి పిడికడేసి గింజలను సేకరించినప్పుడు ఆ గింజల నుంచి ఒక మహా సంస్థ ఉద్భావించబోతున్నాదని గ్రామస్థులు అనుకోని ఉండరు.

 

ఎందరో సోదరీ సోదరులు "అందరిల్లు" నిర్మాణానికి రాళ్ళను మోసినప్పుడూ శేషయ్యగారు గాడి పొయ్యి మీద మొదటిసారి పెద్ద గుండిగలను ఎక్కించినప్పుడు జిల్లెళ్ళమూడి లో ఒక విలక్షణమైన సమిష్టి విధానం రూపొందుతున్నట్టు వారిలో ఒక్కరు గమనించి ఉండరు.

 

ఏళ్ళ తరబడి ఓపికగా అమ్మకు చెరువు నుంచి పీపాలో నీళ్ళు తెచ్చిన యెర్ర ఎద్దు లేదిప్పుడు . దాని పని అది చేసుకు వెళ్ళిపోయింది. అమ్మ కు అదంటే తగని జాలి.

 

అమ్మను నమ్ముకున్న కొందరు పుణ్య మూర్తులూ కాలం జేశారు. వాళ్ళ జ్ఞాపకాలే ఇప్పుడు మిగిలి ఉన్నాయి .

 

Author: 
డాక్టర్ పొత్తూరి వేంకటేశ్వరరావు
Source: 
అంతా ఆమె దయే- ప్రచురణ - 26 మార్చి - 2010