మేము 1980 లో ఏలూరు లో ఉన్నాం. జిల్లెళ్ళమూడి వెళ్ళటానికి దంపతులిద్దరం తయారయ్యాం. మధ్యాహ్నం 1 గంటకు పవరుపేటలో రైలు ఎక్కాలి. మా మనవరాలు సుందరి కనిపెట్టింది. నేను కూడా వస్తానంది. వయస్సు 5 సం.లు. అక్కడికి తీరా వెళ్ళాక; 'తల్లి కోసం' ఏమి పేచి పెడుతుందోనని తీసుకెళ్ళకూడదని నిశ్చయించుకున్నాము. అక్కడకు వెళ్ళాక, నాకు 'అమ్మ' కావాలంటే ఇబ్బంది కదా! అందువల్లే ప్రయాణం మానుకున్నాం.

 

నేను తప్పకుండా వస్తానని పేచి పెట్టింది. మేమే ప్రయాణం మానేశామని మనవరాలికి చెప్పేశాం. అలాగనేసరికి "నేను అమ్మను చూడాలని .... పదండి" అని చాలా అల్లరి చేసింది. మంచం మీద ఉన్న తలగడలు క్రిందికి విసిరేసింది. కాళ్ళతో ఫ్రిజ్ ని తోసింది. చాలా గొడవ చేసింది. ఆ పట్టుదల అల్లరి అసలు తట్టుకోలేక పోయాం. జిల్లెళ్ళమూడి వెళ్ళాక—‘తల్లి కోసం’ పేచి పెట్టనని హామీ తీసుకొన్నాం. అసలు పేచి స్వభావం ఉన్నదే. తొందరగా బట్టలు సర్దుకొని రిక్షాలో పవరుపేట స్టేషన్ కి బయలు దేరాం.

 

మేము స్టేషన్ కి రావడం ఆలస్యమైంది. రైలు టైం దాటి పోయింది. కాని అదృష్టవశాత్తు రైలు ఆ రోజు ఆలస్యంగా నడుస్తోంది. అందువలన రైలు అందుకోగలిగాము. దారిలో ఇవి-అవి కొనమని పిల్ల పేచి పెట్టలేదు. మొత్తం మీద బాపట్ల వచ్చేటప్పటికి రాత్రి 9 గం. లు అయింది. అంతవరకు మనవరాలు ఏమీ తినలేదు. మాట నిలబెట్టుకుంది. బాపట్లలో ఆశ్రమం తాలూకు వ్యాను ఎక్కాము. వ్యాను లో నిద్రపోయింది. ఒక గంటలో జిల్లెళ్ళమూడి చేరాము. ఇక వ్యాను దిగాలి. 10 గం లు అయింది. అందరు పడుకొని ఉన్నారు. మెల్లిగా లేపాము. వెంటనే లేచింది. ఏడవలేదు. పేచి పెట్ట లేదు. జిల్లెళ్ళమూడి వచ్చామని చెప్పాము. దర్జాగా నడుస్తూ " అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటారు" అంది. తన కోసం అమ్మ ఎడురుచూస్తారట! ఎంత విశ్వాసం! నాకు ఆశ్చర్యమేసింది. సగం నిద్రలో లేపామని ఏడవలేదు. మా లగేజి అందరింటికి చేరవేసి తిన్నగా మేడమీద కు వెళ్ళాను. వసుంధర అక్కయ్య కనబడింది. 'అమ్మ స్నానం చేస్తోంది.' అని చెప్పింది. నాకు ప్రాణం లేచి వచ్చింది. స్నానం అయ్యాక అమ్మ దర్శనం తప్పకుండా దొరుకుతుందని నాకు నమ్మకం కలిగింది. అంతలో రామకృష్ణన్నయ్య మాకు వసతి చూపించాడు. అమ్మ స్నానం చేసిన వెచ్చని నీళ్ళతోనే మేము కూడా తొందరగా స్నానం చేశాము. మనవరాలు కూడా స్నానం చేసింది. అమ్మ స్నానం చేసి గదిలోకి రాగానే మమ్మల్ని లోపలి రమ్మన్నారు. నేను మనవారాలి విషయం అంతా అమ్మకు వివరంగా చెప్పాను. సుందరి పేచి వల్లనే ఆదుర్దాగా బయలుదేరి వచ్చామని చెప్పాను. మిమ్మల్ని తప్పక చూడాలని ఉందని చెప్పి చాలా పేచి పెట్టిందని ; అందుకే ఇంత రాత్రి వేళ వచ్చామని చెప్పాను.

 

అమ్మ ఎంత సంబరపడ్డారో చెప్పలేను. చిన్న పిల్లల ప్రేమను కూడా సరిగ్గా అంచనా వేసే శక్తి అమ్మకే వుంది. అసలు ‘సుందరి’ అన్న పేరు మనవరాలికి అమ్మ పెట్టినదే.

 

గది చీకటిగా ఉంది. చిన్న transformer bulb మాత్రమే వెలుగుతోంది. అమ్మ ఎక్కువ లైట్ చూడలేని కంటి బాధతో ఉన్నారు. అయితే పాప తన్ను చూడటానికి వచ్చిందని ట్యూబ్ లైట్ వెయ్యమన్నారు. అక్కడ ఉన్న వారందరితోనూ ‘నన్ను చూడటానికి సుందరి వచ్చిందని’ ఎంతో ఆనందంతో చెప్పారు.. అలా సుందరి అమ్మ దర్శనం చేసుకొంది. సుందరి పూజ అందుకొని అమ్మ ఆశీర్వదించారు. చంటి పిల్లలకు కూడా అమ్మ అంటే ప్రత్యేక ఆకర్షణ. వారూ అమ్మను అర్థం చేసుకుంటారు. మనలాగా విపులంగా చెప్పలేరు. కాని లోపలలోపల ఆవేదన పడతారు. పెద్దవాళ్ళం వాళ్ళను అర్థం చేసుకోలేము. కాని మనకన్నా ఎక్కువ తపన పడతారు. మనకు బోలెడన్నీ ఇతర వ్యాపకాలు. వాళ్ళ దృష్టి ఒక దాని మీదే ఉంటుంది. వారిలో అపారమైన నిజాయితీ ఉంటుంది. అది పెద్దలకు తక్కువని ఒప్పుకోవాలి. ఆ నిజాయితీని ఆకర్షించి, విలువ కట్టే శక్తి అమ్మ దగ్గరే ఉంది. వారిది నిత్య బాల్యం కదా!

 

Author: 
శ్రీ సాధు
Source: 
విశ్వజనని మాసపత్రిక – ఏప్రిల్ 2005 సంపుటి - 4 సంచిక - 9