అమ్మకు పుస్తకం ఇచ్చి ఏదైనా వ్రాయి అని అడిగితే అమ్మ దానిలో పెద్ద సున్న చుట్టి అందులో "అం ఆ " అని వ్రాసేది. దాని అర్థం ఏమిటంటే,ఈ వివరణ ఇచ్చేది.

‘అం ఆ’

‘అ’ అడ్డు లేనిది

‘అం’ అంతులేనిది

'అం ఆ' 'అ'న్నిటికి 'అం'దరికి ‘ఆ’ ఆధారమయినది

అణురూపంగా అంతా తానుగా ఉన్న అమ్మ, తన అణురూపానికి రూప కల్పనా చేసుకొని 1922 సం. లో రంగాంబ గర్భ ప్రవేశం చేసి 9 నెలలు ఆ గర్భంలో వుండి, తనను మోసిన తన తల్లికి ఎన్నో అనుభూతులు అనుభవాల్ని ఇచ్చి విశ్వాన్నే మోస్తున్నాననే భావం కలింగించి 1923 సం. మార్చి లో ఈ భూమిని పావనం చేసింది.

పుట్టినదే మొదలు తన 30 సంవత్సరముల వరకు ప్రత్యేకంగా కొందరికి మాత్రమే ఆధ్యాత్మిక అనుభవాల్ని ప్రసాదించి 1952/53 నుండి పామర జనాలకు ప్రాపంచిక, ఆధ్యాత్మిక, వారి వారి కోరికలు, అవసరాలు అనుసరించి ప్రసాదించింది. 1923 నుండి 1985 వరకు ఈ మధ్యకాలంలో ఎందరో తన శరీరాన్నీ దండించి శల్వావశిష్టం చేసినా, దూషించిన మనకోసం 62 సంllలు నిలిపి 1985 జూన్ 12 న దేవాలయం ప్రవేశం చేసింది.

1984 అక్టోబర్/నవంబర్ లో నేను 40 రోజులు అమ్మ సన్నిధానంలో దీక్షలో వున్నప్పుడు మాటల సందర్భంలో ‘ఈ శరీరం వదిలేకాలం దగ్గర లోకి వచ్చిందిరా!, అనసూయేశ్వర గర్భాలయ గోపురం, నీ దీక్షతో పాటే , నీ దీక్ష పూర్తి అయ్యే లోపల పూర్తి చేయి నాన్నా!’ అని ఎంతో జాలిగా అడిగింది. ‘అపుడే తొందర ఏమిటమ్మా?’ అని అంటే, ‘ఈ శరీరం చీకి పోయిందిరా!, ఎన్నిమార్లు కుట్లు వేయను, వేసినా నిలిచే స్థితి పోతున్నది, ఈ శరీరం మహా వుంటే 1985 పుట్టినరోజు వరకే , ఆ తరువాత ఎన్ని నాళ్ళు వుంటే, మీరు అంత అదృష్టవంతులు’ అన్నది.

నా చుట్టూ వున్న మనుషలయితే మారుతున్నారుగాని , నా పరిస్థితులు ఏమి మారలేదు. అమ్మ చుట్టూ వున్న జనం, తమ స్వార్థం కోసం అమ్మ శరీరాన్ని , మనస్సును ఎంతో క్షోభ పెట్టారు. ఆ క్షోభకు గురి కాకపోతే తన శరీర వునికిని పెంచుకుని వుండేది. ఆ మాటలకు నేను బాధపడుతూ వుంటే, 'ఎందుకురా! అలా బాధపడుతావు, ఎన్నో అవతారాలు వచ్చాయి, అందరూ బాధలు అనుభవించిన వారే! వారంతా ఈ ప్రపంచాన్నీ ఎంతవరకు మార్చగలిగారు? అంతే! వీరంతా నేను పోయిన తరువాత ఏడుస్తారు.' అంతలోనే అమ్మ నవ్వుతూ నా గడ్డం పట్టుకొని 'నన్ను గురించి నేవేమి అనుకుంటావు రా?' అని నా కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించింది.

‘అమ్మ! నీవు మంచం మీద కూర్చుని, కబుర్లు చెబుతూ, మాకు ప్రసాదం, అన్నపు ముద్దలు, తినిపిస్తున్నప్పుడు , అమ్మగా అనిపిస్తావు.- నీకు పూజ చేసేటప్పుడు మాత్రం ఏదో తెలియని అనుభూతి, ఆనందంతో ఏదో లోకంలో వుండి, నీవు దేవుడిగా, నాగుండా పూజలు అందుకుంటున్నావు అని అనిపిస్తుంది.’ అమ్మ నవ్వుతూ, 'అంతేనా!' అని మౌనం వహించింది.

1985 ఫిబ్రవరి లో నన్ను పిలిచి,’ హైమా మంటపం కట్టించరా!’ అంటే, నవంబర్ లోనే కదమ్మా గర్భాలయ విమానం కట్టించావు, నాకు 4 నెలలు టైమ్ ఇవ్వమ్మా! అంటే ‘నేను చూడాలని నీకుంటే తక్షణం మొదలుపెట్టు, పూర్తి చేయి - అందులో సప్త సప్తాహం జరగాలి' అని ఆజ్ఞాపించింది. ఆర్థిక ఇబ్బందులలో వున్నా, కట్టించమన్నందుకు బాధ కలగ లేదు. కాని, తన నిర్ణయం 'దేవాలయ ప్రవేశం' పొడిగించనందుకు దుఃఖం వచ్చింది. అయినా, అమ్మ ఆజ్ఞ పాటించటమే నా వంతు; అని అనిపించింది. పూర్తి చేశాను.

1985 ఏప్రిల్ లో అమ్మ పుట్టినరోజు అయిపోయింది. కాలం గడుస్తున్నది. 'వీలయినన్ని ఎక్కువ సార్లు వచ్చి పోతుండు,' అని ఆజ్ఞాపించింది. వారానికి 2 లేక 3 సార్లయినా వెళ్లివస్తూ వుండేవాడిని.

‘మే 5’ అమ్మ పెళ్ళి రోజు అయిపొయింది అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకుందని సంతోషించాను. ఆ ఆశ నిరాశ అయింది. జూన్ మొదటివారంలో కొండముది రామమూర్తి గారు, ఫోన్ చేశారు. అమ్మకు ఒంట్లో బాగలేదు, నీవు ఒకసారి వచ్చిపోతే బాగుంటుందని. తక్షణం జిల్లెళ్ళమూడి చేరాను. నేను వెళ్ళేటప్పటికి అమ్మ ఆయసపడుతున్నా అందరితో హాయిగా మాట్లుడుతున్నది.

మరల ‘జూన్ 7న’ రామమూర్తి గారు ఫోన్ చేశారు. అయినా, రెండు రోజులే కదా! అమ్మను చూచి వచ్చింది, అని ఆఫీసు పని వత్తిడి వల్ల నిర్లక్ష్యం చేసి జూన్ 10 వ తారీఖున వెళ్ళాను. అమ్మ సన్నిధికి వెళ్ళి కూర్చోబోతుండగానే "ఏరా!, ఫోన్ చేసిన రాలేదు! నేను పోననేగా నీ ధైర్యం" అని నవ్వుతూ ప్రశ్నించింది. నేను ఏమి మాట్లాడలేక అమ్మ పాదాలమీద నా శిరస్సు వుంచి నమస్కరించి కూర్చున్నాను. అమ్మ చుట్టూవున్నవారు తమకు ఏమి అర్థంకాక తెల్లపొయారు.

‘జూన్ 12’ రానే వచ్చింది. ఆ రాత్రి 11 గంటలకు దారుణ వార్త. నేను తట్టుకోలేనేమోనని కావచ్చు. నన్ను మానసికంగా 1984 నవంబర్ నుండి నన్ను సిద్దం చేసింది.

1922 లో శిధిలమయ్యే 'దేహాలయ' ప్రవేశం చేసి, 1985 లో 'దేవాలయ' ప్రవేశం చేసింది.

బాధించలేని శిధిలం కాని శైలజ రూపంలో 'అం ఆ' గా దేవాలయ ప్రవేశం చేసి , మనకు తానూ లేని కొరత తీరుస్తున్నది. దీనినయినా సరిగా కొలవక, కాపాడుకోలేకపోతే మన తప్పులకు క్షమాపణ లేదు. అమ్మ చెప్పినట్లు మనకు 'ఏడుపే' మిగిలేది.

ఈ మధ్య కాలంలో వేదాంత గ్రంథాలు చదువుతూ వుంటే, అందులోని వాక్యాలకు అమ్మ నాతో సంభాషించినపుడు అమ్మ చెప్పిన వాక్యాలు రూపంగా మారి వివరణ జరుగుతుండేవి. అందులో ఒక ఉదాహరణ;

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన మారురూపమయిన ఆంజనేయుని ప్రశ్నించుతాడు. తనని గురించి ఆయన అభిప్రాయం ఏమిటని? ఆయన వినమృడై, చేతులు జోడించి, విన్నవించుకుంటాడు.

 

1. శరీరపరంగా నీవు నా ప్రభువువి, నేను నీ బంటును.

 

2. జీవపరంగా నీవు అనంతానివి; నేను నీ అంశను

 

3. ఆత్మపరంగా నీవు ‘త్వమేవాం’ ‘నీవే నేను’ ‘నేనే’ నీవు

 

ఈ పైవే అమ్మ సున్నితంగా మనకు వివరిస్తుంది;

 

శరీరపరంగా... (1) నేను అమ్మను(Mother) --- మీరంతా నా పిల్లలు(Children)(ప్రభువు –బంటు)

 

జీవపరంగా... (2) నేను 'అం ఆ'(Totality) ను ---- మీరు నా అవయవాలు(Limbs)

 

ఆత్మపరంగా ...(3) నేను ‘నేను’ అయిన ‘నేను’ , అన్ని ‘నేను’లు “నేనే”, ‘నేను’గా వున్న ‘నేను’ ‘నీవు’గా వున్న ‘నేను’

 

అందుకనే కాబోలు, నన్ను తనని గురించి అడిగినప్పుడు మూడవది నేను చెప్పుకోలేని స్థితి కనుక 'అంతేనా' అని నవ్వి మౌనం వహించింది. ఇంకొక స్థితి వున్నది అని చెప్పక చెప్పింది. అందుకోనేమో ! ఆ స్థితి పొందగలందులకు నాకు 'అం ఆ' అయిన మన అమ్మ 'ఓం తత్సత్' అని మంత్రోపదేశం చేసింది. అది ఇపుడు మననం చేయటమే నా విధి.

 

“ఓం తత్సత్”

 

అమ్మ జననం ......... 28 మార్చి1923

 

అమ్మ మహానిష్క్రమణ 12 జూన్ 1985

 

అమ్మ మహాదర్శనం... 13 జూన్ 1985

 

అమ్మ ఆలయ ప్రవేశం. 14 జూన్ 1985

 

Author: 
కీ.శే.శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ.
Source: 
మదర్ అఫ్ ఆల్ – వాల్యుమ్-2 నెంబరు-2;అమ్మ- ఆలయ ప్రవేశము స్పెషల్ ఇష్యూ - జూలై 2000