విజయవాడ వచ్చినప్పటి నుంచీ జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను చూచి రావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నాల్లోనే నాలుగు సంవత్సరాలు గడిచి పోయినవి. ఒకరిద్దరు మిత్రులను కారు అడిగి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా, ఆ నాలుగు సంవత్సరాల్లోనూ సాధ్యమైంది కాదు. అయిదో సంవత్సరo పూర్తి కావస్తున్న సమయంలో మిత్రులు శ్రీ మాడభూషి కృష్ణస్వామి సహకారం వల్ల సాధ్యమైంది.

 

ఆరోజు ఆదివారం. అది 1972 వ సంవత్సరం. ఉదయం విజయవాడ లో వర్షం పడుతూ వుంది. కార్లో వెళ్ళితే దార్లో ఆగిపోవలసివస్తుందేమోనన్న సందేహం కల్గింది. "వర్షం ఆగిపోతుంది. మనం అమ్మను దర్శించే వరకూ వర్షం ఇబ్బంది ఉండకూడదు. పోదాం" అని ప్రోత్సహించాను. నేను, శ్రీ కృష్ణస్వామి , మరో ఇద్దరు స్నేహితులు బయల్దేరాం. దార్లో వర్షం పడింది. అయితే మేము వెళ్ళడానికి ముందే వర్షం కురిసి ఆగిపోయింది. ఏ ఇబ్బందీ లేక జిల్లెళ్ళమూడి చేరాం.

 

మేము బయల్దేరి వస్తున్నట్లు బాపట్లలో స్నేహితుడికి మాత్రం కబురు పెట్టాం. జిల్లెళ్ళమూడికి మేము క్రొత్త. అయినా, మేము అమ్మ ఆలయం చేరేసరికి పై నుంచి శ్రీ కొండముది రామకృష్ణ, ఇతర ఆశ్రమ వాసులు వచ్చారు. "అమ్మ మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు " అన్న కబురు తెచ్చారు. మేము వస్తున్నట్లు ఎలా తెలిసిందా-అని ఆశ్చర్యపోయాం. అసలు మేమువస్తున్నామని తెలిసి మేడమీద నుండే ఎవర్నో చూడమన్నట్లు కన్పించింది. వారు మమ్మల్ని చూచి గబగబా లోపలి వెళ్ళిపోయారు.

 

అయితే ఆ వస్తున్నది మేమేనని ఎలా తెలుసుకున్నారా? - అని అనుకున్నాము. ఎందరో వస్తుంటారు మరి ఎలా పోల్చుకో గలుగుతారో -తెలియదు. నాకు మేడ ఎక్కటం శ్రమ. అలాగే ఆయాస పడుతూ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాం. అప్పటికే పైన చాలామంది ఉన్నారు. మేము వెళ్లి వో ప్రక్కన కూర్చున్నాం. కొంత సేపటికి కొందరిని పిలిచారు లోపలికి. వారు వెళ్లి వచ్చారు.. తరువాత మమ్మల్ని రమ్మన్నారు. వెళ్లాం. నమస్కారం చేసి కూర్చున్నాం అమ్మ ఎదురుగా ఒక మంచంపై కూర్చొని అందర్నీ తేరిపార చూస్తున్నారు. అయిదు నిమిషాలు తరువాత శ్రీ రామ కృష్ణ పరిచేయం చేశారు. పరిచయం అవసరమా? అనిపించింది. పిల్లల్ని గురించి అమ్మకు పరిచయం చేయాలా? అమ్మ మెల్లిగా అడిగారు ‘ఆయసమా?’ అని --ఔనన్నాను. శ్రీ రామకృష్ణ అన్నారు" అమ్మ కూడా మెట్లు ఎక్కితే అలాగే ఆయాస పడుతారు." అని. అయినా అమ్మ అన్నారు " ఎందుకంత ఆయసపడి పైకి వచ్చారు.? నేను క్రిందికి దిగివచ్చేదాన్ని కదా -" అమ్మ వాత్సల్యం ఆ ఒక్క మాటలోనే వెల్లడయింది. పిల్లలు కష్టపడ్దాన్ని సహించలేరు. పిల్లలు కొరకు అమ్మ ఎన్ని కష్టాలైనా పడతారు.

 

అమ్మ దగ్గరకు రమ్మన్నారు, పాదాలదగ్గర కూర్చున్నాను. తల నిమిరారు. వీపుపురాస్తూ వున్నారు. ఎంతో ధైర్యం, ఆత్మ విశ్వాసం! కల్గింది. చిన్నతనంలో కన్నతల్లి కూడా ఇలాగే చేరదీసి ఆప్యాయంగా తలనిమిరిన రోజులెన్ని? అని జ్ఞాపకం చేసుకోవాలనిపించింది. అమ్మ కుశల ప్రశ్నలు వేశారు. వినిపించి వినిపించనట్లుగా అతి నిదానంగా మెల్లిగా అడిగారు. కొంత సేపటి తరువాత అమ్మ లోపలి వెళ్ళారు. స్నానం చేశారు. తిరిగి వచ్చారు. ఇంతలోనే ఒక గిన్నె పులిహోర తెచ్చారు. అందరికీ ఆకులిచ్చారు.. అమ్మ స్వయంగా అందరికీ పెట్టారు. ఆ ప్రసాదం తింటూ వుండగానే మరో గిన్నెలో అన్నం తీసుకు వచ్చారు. అన్నం ఎంతో వేడిగా పొగలు గ్రక్కుతూ ఉంది. అయిన అమ్మ కలుపుతూనే వున్నారు. అందరికీ ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టారు. తరువాత ఆకులో నాతో వచ్చిన ముగ్గురికీ పెట్టారు. అమ్మ నన్ను దగ్గర కోర్చోబెట్టుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెడుతూ వచ్చారు. ముందు నేను చేయ్యిపడితే అమ్మ నోరు తెరవమన్నారు. అలాగే చివరిదాకా పెడుతూ వచ్చారు. మధ్యలో "పొట్లకాయ నీకు ఇష్టమేనా? కూర బాగుందా? " అని అడిగారు.

 

బాగుందని అనగానే "కాయలు మన దొడ్లో కాసినవే మన చెట్ల కాయలు" అని తృప్తిగా చెప్పారు. కూరన్నం అయింది. పులుసు అన్నం తెచ్చారు. పులుసు వేడిగా వుంది మసిలిపోతూ వుంది. అయినా అట్లాగే కలిపారు. ఆ పులుసన్నం కూడా కూరన్నం లాగే పెట్టారు.మాకు పెడుతూ అమ్మ త్రేపుతూ వున్నారు. పిల్లలకు పెడితే అమ్మ కడుపు నిండింది. అదే చిత్రం సర్వ భూతాల్లోనూ భగవంతుడున్నాడు గదా! మరి. శ్రీ సాయి బాబా కూడా అట్లాగే చేసేవారు. భక్తులు తింటే , ఆయన కడుపు నిండినట్లుండేది. భగవంతుడు సర్వాంతర్యామి అన్న ప్రహ్లాదుని నాదం ఎప్పటికీ యధార్దమే అని నిరూపణ అవుతూ వుంది.

 

కూరన్నం పులుసన్నం తినేసరికి కడుపు నిండింది. ఇక మజ్జిగన్నం ఎలాగా ఎలా తినాలో అనుకుంటూ వుంటే, " మజ్జిగ త్రాగుదురుగాని చేతులు కడుక్కోండి - అన్నారు అన్న అమ్మ. (అమ్మకు అన్ని తెలుసు). నేను 'మూతి కడుక్కుందాం" అని అనుకొన్నాను. అమ్మ లేవనివ్వలేదు. క్రింద పడిన మెతుకులు అమ్మే ఎత్తివేశారు. ఒక మెతుకు వుంటే నేను ఎత్తుతుంటే ఆ మెతుకు అమ్మ తీసికొని చేతులు కడిగారు. అలాగే మూతి కడిగి తుడిచారు. మిగిలి పోయిన పులిహోర తీసివేశారు. అంతా అమ్మే శుభ్రం చేశారు. అట్లా కొంత సేపు కూర్చున్నాం. ఇంకా అమ్మ దర్శనానికి వచ్చినవారు ఎందరో ఉన్నారు. మేమే గంటల తరబడి వుంటే , మిగతావారంతా ఏం కావాలని అనుకున్నాం.

 

ఇంతలో శ్రీకృష్ణస్వామి అమ్మను ఏదో అడగాలని అనుకున్నారు. వారి మరదలు వివాహం అనుకుంటాను. అవుతుందన్నారు. ఒక పూలదండ ఇచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వివాహం అయింది. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం చెప్పాలి. శ్రీకృష్ణస్వామి భార్య విజయవాడ లో లేరు. మిగతా ఇద్దరు స్నేహితులలో ఒకరికి భార్య పోయారు. మరొకరికి వివాహం కాలేదు. వీరెవరిని ఏమి అడగలేదు. నన్ను మాత్రం 'అమ్మాయిని తీసుకురాలేదేం?" అని అమ్మ అడిగారు. అందరూ మగవాళ్ళం అయిన కారణంగా తీసుకురాలేదని చెప్పాను. వాస్తవానికి నేను బయల్దేరే వేళ నా భార్యకూడా వస్తానని ప్రయాణమైతే , మరోసారి వెళ్ళవచ్చునని చెప్పాను. అమ్మ నన్ను మాత్రం అడగడం ఆశ్చర్యమేసింది తర్వాత ఈ సారి వచ్చినప్పుడు అమ్మాయిని కూడా తీసుకువచ్చి కొన్ని రోజులుండాలి ఇక్కడ మీరిద్దరూ అని అమ్మ చెప్పారు. ఇంకా, మేమిద్దరం కలసి జిల్లెళ్ళమూడికి రావాల్సిఉంది.

 

ఇంతలో శ్రీకృష్ణస్వామి అమ్మను ఏదో అడగాలని అనుకున్నారు. వారి మరదలు వివాహం అనుకుంటాను. అవుతుందన్నారు. ఒక పూలదండ ఇచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వివాహం అయింది. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం చెప్పాలి. శ్రీకృష్ణస్వామి భార్య విజయవాడ లో లేరు. మిగతా ఇద్దరు స్నేహితులలో ఒకరికి భార్య పోయారు. మరొకరికి వివాహం కాలేదు. వీరెవరిని ఏమి అడగలేదు. నన్ను మాత్రం 'అమ్మాయిని తీసుకురాలేదేం?" అని అమ్మ అడిగారు. అందరూ మగవాళ్ళం అయిన కారణంగా తీసుకురాలేదని చెప్పాను. వాస్తవానికి నేను బయల్దేరే వేళ నా భార్యకూడా వస్తానని ప్రయాణమైతే , మరోసారి వెళ్ళవచ్చునని చెప్పాను. అమ్మ నన్ను మాత్రం అడగడం ఆశ్చర్యమేసింది తర్వాత ఈ సారి వచ్చినప్పుడు అమ్మాయిని కూడా తీసుకువచ్చి కొన్ని రోజులుండాలి ఇక్కడ మీరిద్దరూ అని అమ్మ చెప్పారు. ఇంకా, మేమిద్దరం కలసి జిల్లెళ్ళమూడికి రావాల్సిఉంది.

 

ఈ విధంగా అమ్మ మాట్లాడుతుండగానే మరొకరు వచ్చారు. ఆయన వారి విషయాలన్నీ చెప్పుకున్నారు. అమ్మ సావధానంగా విన్నారు. భోజనం చేసి వెళ్ళ మన్నారు. నాకు అతిమూత్ర వ్యాధి వుంది, వరి అన్నం తింటే ఎక్కువతుంది అని ఆయన సమాధానం చెప్పారు. మరేం భయం లేదు. నాకూ వుంది అది , భోజనం చేసి వెళ్ళు . ఏం చేయదు లే అన్నారు మందహాసం చేస్తూ. పిల్లలందరి జబ్బులతో అమ్మ బాధపడుతూనే వుంటారు.

 

అమ్మ దర్శనమే చిత్రంగా వుంటుంది. అక్కడ శ్రీ రామకృష్ణ అన్ని విషయాలు చెప్తూ వుంటారు. మేము ఒక మాల,కొన్ని పూలు ఫలాలు తీసుకువెళ్ళాం . అమ్మ లోపలిన్న్చి వచ్చికూర్చోగానే దండవేయమని చెప్పారు. దండ వేసి పాదాలపై పూలువుంచి ఫలాలు అమ్మకు అందిస్తే, శ్రీరామకృష్ణ వాటిని స్వీకరించారు అమ్మ లాంఛనంగా అందుకున్న తరువాత, అమ్మ పాదాలకు నమస్కరించాము. అమ్మ మా నుదుట కుంకుమ పెట్టారు. ఆశీర్వదించారు. అది దర్శన పద్ధతి. ఆతర్వాత ఇక పరామర్శ , భోజనం - జరిగిపోయినాయి.

 

భోజనాల తర్వాత అందరికీ బట్టలు తెప్పించి ఇచ్చారు. ఒక ధోవతి, కండువ, శాలువ, నాకు ఒక శిల్కు ఉత్తరీయం ధోవతి ఇచ్చారు. "ధోవతి మిల్లుది నాన్న ఖద్దరు కాదు -మరి" అన్నారు. 'ముందుగా తెలియలేదు ఇవాళ దుకాణాలు లేవు' అని ఎంతో బాధ పడుతూ అన్నారు. ఆ తర్వాత అందరికి ఖద్దరు శాలువలు ఇచ్చారు. ఇది ఖద్దరే అన్నారు. " అమ్మ అన్నం పెట్టి, కొత్త బట్టలిచ్చి ఇక ఆడుకోండి అని పంపిస్తారు".- అని దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారన్నారని మందహాసంతో అమ్మ మా అందరితో అన్నారు. అంతే కాదు , రాత్రి కప్పుకోనేందుకు శాలువలు కూడా ఇచ్చారు. ఎంత శ్రద్ధ! అమ్మకు పిల్లల యోగ క్షేమాలపట్ల.

 

మా నలుగురికి బట్టలిచ్చిన తరువాత అమ్మే అడిగారు - " వీళ్ళ కారు డ్రైవరు ఉండాలిగా " అని. అప్పుడూ అందరు కంగారు పడి డ్రైవరిని పిలిచారు. అమ్మ ఆదరణ చూడాలి అప్పుడు. ఆ డ్రైవరికి పట్టుపంచ పట్టుఉత్తరీయం ఇచ్చారు. ఔను! అతడు స్వయంగా స్వంతంగా కొనుక్కోలేడు. అమ్మే యివ్వాలి! - ఆ ఖరీదైన పంచలు. వీళ్ళు మరిచిన డ్రైవరును అమ్మ జ్ఞాపకం పెట్టుకోవడం, ఆతరువాత పట్టుపంచాలు ఇవ్వడంలోనే ఉంది విశేషం.

 

అమ్మ వద్ద సెలవు తీసుకొనేందుకు లేచాం. అమ్మ కూడా లేచారు. అప్పుడు వెళ్ళి స్నానం చేస్తారట. అమ్మ పాదాలకు నమస్కారం చేశాం. అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని తల నిమిరి బుగ్గలు పట్టుకొని ఎంతో ఆప్యాయంగా " వెళ్లి రండి నాయనా" అని పంపారు. అదొక విచిత్రమైన దివ్యమైన అనుభూతి.

 

మెల్లిగా క్రిందికి దిగి వచ్చి అమ్మ సాహిత్యం కొని, తీసుకుని ప్రయాణమయ్యాం. ఏ ఇబ్బందీ లేకుండా విజయవాడ చేరాం. మాకు మాత్రం వర్షం ఇబ్బంది వెళ్ళేటప్పుడు గాని - వచ్చేటప్పుడు గాని కలగలేదు.

 

అమ్మ సాహిత్యం చదివితే అతి నిగూఢమైన వేదాంత విషయాలను అతి సులభంగా తెలిసేటట్లు చెప్తారు. ఆ సాహిత్యం ఎంతో వుంది. అందులో అమ్మ ఏం చెప్తారో ఏం చేస్తారో తెలుస్తుంది. అమ్మను మనం మరిచినా, అమ్మ మాత్రం మనల్ని మరువరు- అని మనం ఎప్పటికి గుర్తుంచుకోవాలి!

 

Author: 
కీ. శే. శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు
Source: 
మాతృశ్రీ మాసపత్రిక ఏప్రిల్ 1974( సంపుటి 9 సంచిక 1)