ముల్లు గుచ్చుకున్నప్పుడే వస్తుంది చిక్కు.

 

'ఎక్కడ ఉన్నవో ..... ఏ మరియున్నావో తనయుని మరిచావో ....... ఈ తనయను మరిచావో'-- అని సరిపెట్టుకోలేని మనస్తత్వవం - నన్ను ఇంతగా నువ్వు సోధించనేగూడదు' అని భగవంతునికే కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. మనం అనుకొనే ఈ వేదనని, దుర్భరస్థితిని మాత్రమే ఇచ్చాడు భగవంతుడు అనిపిస్తుంది. ఈ జగన్నాటక చదరంగంలో మనల్ని పావులు కావాలంటాడని, ఎందుకు నీ లీల ఈ విధంగా కొనసాగాలి అని ప్రశ్నిస్తే, ‘ There’s not to reason why’ అలా అడగడానికి వీలు లేదంటాడని అనిపిస్తుంది. మార్దోవోపేతమైన సుగంధ భరితమైన సరే ఈ జీవన సుమం వాడి, వాసి విడనాడి రాలిపోవాల్సిందే అని అంటాడని పిస్తుంది. అన్నీ వాడే చేస్తున్నాడని అనుకోలేం గనుక అమ్మను అమ్మగానే చూస్తే నే ఆనందం, అందం ప్రాణానికి కాస్త శాంతి, మనస్సుకి కొంచెం ఊరట.

 

ఒకసారి శ్రీవిష్ణు సందర్శనార్థమై తపోధనులైన సనకసనందనాది మహర్షులు రాగా ద్వారపాలకులైన జయ విజయలు స్వామి సందర్శనానికి ఆ సమయం అనుచితమని అభ్యంతరం చెప్తారు. వెంటనే ఆ పిన్న- పెద్దలు ఆగ్రహోదగ్రులై వారిని శపిస్తారు. ఆ తీరుని వర్ణిస్తూ శ్రీ పోతన గారు - వక్రంబింతయు లేక పాయని మహావైరంబునన్ నిత్య జాత క్రోధస్మరణంబులన్ విదళితో ద్యత్పాప సంఘాతులై , చక్రచ్చిన్న శిరస్కులై మునివచ శ్శాపావధి ప్రాప్తులై చక్రించెందిరి వారు పా ర్శ్వచరులై సారూప్య భావంబునన్ - అని అంటారు.

 

వారు ఆ సమయం అనుచితమని అడ్డగించారు. అడ్డగించారని శపించారు వీరు.. ఎవరిది దోషం? అని అడిగితే అంతా ఆ యోగీశ్వరేశ్వరునికే ఎరుక అనాలి. లోక కళ్యాణార్థం ఉదయించే అవతార మూర్తి చేతిలోని నిహతులై మూడు జన్మలూ అంతరించగా శాపావసానం చెంది వైకుంఠ ప్రాప్తి కలిగేటట్లు వారు కోరిన విధంగానే వక్రంబింతయు లేక (తేడా ఏమి లేక) అని వ్యాఖానిస్తారు కొందరు. చరిత్ర ఏ విధంగా సమర్థించినా శపించబడటానికి వారు చేసిన దోషం ఎప్పటికి దురవగాహ్యమే. ఆ బాధ ప్రాకృత మానవుడు పడితే యేమని సరిపెట్టుకుంటాడు? పురాకృత కర్మ ఫలం అనుకుంటాడా? ఆ ‘దేవదేవుని లీల’ అని కీర్తిస్తాడా? లేక హృదయం లేనివాడని అంటాడా? ఏది జరిగినా తన మంచికే అని సముదాయించుకుంటాడా? తన చేతిలో ఏది లేదు కనుక ‘సృష్టికి ఇది సహజం’ అని సమాధాన పడతాడా?

 

ఆదరించేది అమ్మ అంటే అని,

 

ఆదమరించింది ఆ భగవంతుడనిపిస్తుంది. మన బాధల్ని తనవిగా అనుభవించి మన కోసం నిల్చే అమృత హృదయ అమ్మ.

 

మనల్ని పాత్రధారులుని చేసి నేపథ్యంలోకి కనుమరుగైన సూత్రధారుడు ఆ భగవంతుడు.

 

కనుకనే 'బాధ ఎవరిదైనా-- అనుభవం నాదే' అంటుంది మనందరి ఇలవేల్పు అయిన అమ్మ.

 

‘పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతాం’ అని పార్థసారధి అంటే .....................

 

‘మనుష్యులంతా మంచివాళ్ళే నాన్నా! ‘ అని , “అందరికి సుగతే” అనీ హామీ ఇస్తున్నది విశ్వజనని.

 

ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే ' జాలిగోలిపి కన్నీరు చిలికే దాతలు’ ఎక్కడ ఉన్నారో తెలియదు గాని

 

------ మాత (అమ్మ) మాత్రం ఉన్నది జిల్లెళ్ళమూడి లో,…….. అమ్మను ఆవిధంగానే చూడాలి అంటాను.

 

Author: 
శ్రీమతి రాధ
Source: 
మాతృశ్రీ మాస పత్రిక - సంపుటి 15 - సంచిక 3 - మే 1980 (రెండవ భాగం)