అమ్మ సన్నిధి లో ఉంటే ఎంతో హాయి! అనిర్వచనీయమైన ఆనందం, ఏదో మధురానుభూతి కల్గుతూ ఉంటుంది. అమ్మ సంభాషణ అతి మృదువుగా, భావగంభీరంగా అర్థవంతంగా వుంటుంది. జటిలమైన వేదాంత రహస్యాలని కూడా అలతి అలతి పదాలతో సులభంగా సుగమం చేస్తారు.

 

నేను చాలా రోజుల నుండి అమ్మ దర్శనం చేసుకోవాలి, అమ్మతో సంభాషించాలి - అని తహ తహ లాడుతూ వుండేవాణ్ణి. ఆ రోజు శనివారం, కాకి వాలింది, తాటిపండు పడిందన్నుట్లుగా నాకా రోజు అమ్మ దర్శనం జరుగుతుందని మా గైడ్ చెప్పారు. ఆ వార్త విని పట్టరాని ఆనందంతో అమ్మ దర్శనానికి వెళ్ళాను. లోకంలో ‘అడగందే అమ్మయిన అన్నం పెట్టదు’- అంటారు. కానీ, ఈ అమ్మ అడగకుండానే బిడ్డల ఆకలి ఎరిగి అన్నం పెడుతుంది. ఎవరు ఎప్పుడొచ్చిన " నాన్నా భోజనం చేశావా?" అని అడుగుతారు. భోజనం చేయకపోతే అన్నపూర్ణలయానికి వెళ్ళి భోజనం చేసి రమ్మంటారు. అదే విధంగా అమ్మ "నాన్నా శ్రద్దగా చదువుతున్నారా?"--- "మూడు పూటలా భోజనం చేస్తున్నారా?" అని అడుగుతారు.

 

అమ్మతో సంభాషించాలి- అని వున్న నేను- " అమ్మా! జిల్లేళ్ళమూడిలో అసంఖ్యాక జనులకు అన్నం పెడ్తుతున్నావు. నీవు పెట్తాలనుకొని పెడుతున్నావా? అది అలా జరగాలని వున్నది, కావున, జరుగుతున్నదా? అని అన్నాను. అప్పుడు అమ్మ 'నేను పెట్టాలని అనుకోవటం నా కోరిక మాత్రమే. నాకనేక కోరికలు న్నాయి. అవన్నీ నేరవేరుతున్నాయా? ' అని అన్నారు. అంటే కోరికలన్నవి ప్రతివాడికి ఉంటాయి. అవి ఫలించడం మాత్రం కష్టం, కానీ, అమ్మకున్న కోరికలు సామాన్య మానవుడికి వుండే కోరికలు మాత్రం కావు, ‘ఎప్పుడూ బిడ్డలకు పుష్కలంగా అన్నం పెట్టాలి’ అనేది అమ్మకు ముఖ్యమైన కోరిక.

 

"అమ్మా! నీ వెప్పుడు ఏమిటి ఆలోచిస్తూ ఉంటావు?" అని అమ్మ నడిగితే "నాన్నా! మీకు ఈ వయసులో తగిన ఆహారం పెట్టాలేక పోతున్నాను. ఇంతకన్నా పుష్టికరమైన ఆహారం పెట్టాలీ - అని ఆలోచిస్తూ ఉంటాను" అని సమాధానమిచ్చారు. అంటే అమ్మ ఆలోచన లోకకల్యాణం, లోకోద్దరణ మొదలగు కృత్యాలపై ఉంటుంది. అందుకు మేమిక్కడ సంతృప్తిగా భోజనం చేస్తున్నాము, అమ్మా! అంటే - అయితే మీరు సంతృప్తులు , నాకే అసంతృప్తి - అని అన్నారు. అమ్మ సన్నిధిలో ఉండి ఎంత మంది బిడ్డలు సంతృప్తులు కాలేక పోతున్నారో వాళ్ళకై అమ్మ అసంతృప్తి చెందుతున్నారు.

 

అమ్మ "తృప్తే ముక్తి" అంటారు. అంటే మనస్సు తృప్తి చెందటమే మోక్షం . అది ఎంత అసాధ్యం! మానవునునికి అన్నీ ఉన్నప్పటికీ ఇంకా ఏదో కావాలని అంటాడే కానీ తృప్తుడు మాత్రం కాలేడు. ఎప్పుడైతే తృప్తుడ వుతాడో అప్పుడు ముక్తి లభిస్తుందని ఆ మాట కర్థం. అమ్మ అలతి అలతి పదములలో అనంతార్థాన్నీ వేదాంత రహస్యాలను చెప్తారు. చదువుల తల్లి కదా?

 

సాధారణంగా కొందరితో మాట్లాడితే ఎంత త్వరితంగా ఆ సంభాషణ ముగుస్తుందా! అని ఎదురు చూస్తుంటాము. కానీ, అమ్మతో సంభాషిస్తే ఇంకా సంభాషించాలని ఉంటుందే తప్ప అచ్చట నుండి త్వరగా రావాలనిపించదు. అమ్మ దగ్గర నుండి రాలేక వచ్చాను.

 

Author: 
శ్రీ కొటికలపూడి సూర్యనారాయణ
Source: 
మాతృశ్రీ మాసపత్రిక సంపుటి 18 సంచిక 3- జూన్ 1983