‘రెడ్డి అన్నయ్య’ అని ప్రేమగా అందరు నోరారా పిలిపించుకునే వారి అసలు పేరు మేనకూరు సుందరరామారెడ్డి గారు. వారిది నెల్లూరు. అమ్మ దివ్య సన్నిధానంలో 1966 నుండి ఉంటున్నారు.

 

‘ కర్మయోగి, బ్రహ్మచారి, త్యాగశీలి’ అయిన రెడ్డి గారు తన అనుభవాలు నాతో ఈ విధంగా పంచుకున్నారు;

 

అప్పుడు నాకు 23 ఏళ్ళు. పండరీపురం వెళ్ళి పాండురంగడి వద్ద ఉండిపోవాలానుకున్నాను. నాకు దారి తెలియదు. రైలులో కొంతమంది రేపల్లె వ్యాపారులు తెనాలి లో కలిశారు. పండరీపురం వెళ్ళటానికి యెట్లా వెళ్ళాలని వాళ్ళను అడిగాను. మేముకూడా అటే షోలాపూర్ వరకు వెళ్తున్నాము. అక్కడి నుండి పండరి వెళ్ళవచ్చు అన్నారు. ఆ విధంగా వాళ్ళతో షోలాపూర్ వెళ్ళి అక్కడి నుంచి బస్సులో పండరీ పురం వెళ్ళి పాండురంగ స్వామిని చూశాను. అందరు పండరి భజనలు చేస్తూన్నారు. నాకెందుకో అనుకున్నంత తృప్తి అనిపించలేదు. చంద్రభాగా నదికి స్నానానికి వెళ్ళాను. నేను కొంత సేపు కూర్చుని ధ్యానం చేసుకున్నాను. ఇంతలో దేదీప్యమానంగా వెలుగొందే, ఒక స్త్రీ మూర్తి నా దగ్గరకు వచ్చి ' ఏం నాన్నా!' అంది. ‘ఏ ఊరు అమ్మా నీది?’ అన్నాను నేను. ఆమె విజయవాడ అంది. ఆ దివ్యమూర్తిని విజయవాడలో వారి ఇంటికి వెళ్లి కూడా చూడాలని అనిపించింది. మీ మగవాళ్ళు ఎక్కడ ఉన్నారు? అని అడిగాను. ఊళ్లోకి వెళ్ళారు నాన్నా అన్నది. ఆమెది ఎంతో తియ్యని కంఠం. మళ్ళీ తరువాత అచట కనుపించలేదు. ఆ దివ్యమంగళ స్వరూపం ఇంకా నామదిలో మెదులుతూనే ఉన్నది. ఇప్పటికి ఆ దివ్యదర్శనం తలుచుకుంటేనే ఆనంద పారవశ్యం లో మునిగి పోతాను.

 

నేను 1966 జిల్లెళ్ళమూడి వచ్చిన తరువాత అమ్మ ‘నీవు ఎక్కడెక్కడ తిరిగావు?’ అని ప్రశ్నించారు . నేను హృషీకేశం మొదలైనవి చూశానని ‘లక్ష్మణ ఝూలా’ చూశానని చెప్పాను. ‘ఇంకా ఎక్కడ తిరిగావు?’ అని అమ్మ అడిగారు. పండరీపురం వెళ్లాను అని చెప్పాను. అక్కడ ఎవరిని చూశావని అడిగింది. ఒక దేవతామూర్తి లాంటి స్త్రీ మూర్తిని చూశానని చెప్పాను. అమ్మ దగ్గర ఉన్న ఫోటోలు కొన్ని నాకు చూపించి, ఫోటోలలో ఏ మాదిరిగా ఉన్న్డదని అడుగుతూ ఒక ఫోటో చూపించింది. ఆశ్చర్యం ఆ ఫోటో లోని మూర్తినే నేను దర్శించినది. అని అమ్మతో చెప్పాను.. పరమాశ్చర్యం ఆమే జిల్లెళ్ళమూడి అమ్మ. నాకానాడు పండరీలో దర్శన భాగ్యం కలుగ జేసింది. అప్పటి నుంచీ ఆ తల్లిని పరమభక్తితో కొలుస్తున్నా' అన్నారు రెడ్డి అన్నయ్య .

 

జిల్లెళ్ళమూడి లో వాటరు టాంకులు ఏర్పడ్డా, జనరేటరు వెలుగునిస్తున్నా, అన్నపూర్ణాలయం వంటశాల భవనం నిర్మాణమైనా, స్టోర్సు కట్టబడినా ఇంకా అనేక గుప్త దానాలు కావించినా ఆ అమృత హాస్తం రెడ్డి అన్నయ్యదే. 'నేను చేస్తున్నది ఏమి లేదు. అమ్మ ప్రేరణ- దయతోనే అంతా జరుగుతోంది , ఆ తల్లి ఇస్తేనే మనం చేయగలిగేది' అంటారు రెడ్డి అన్నయ్య. వారు అమ్మ దివ్యనామ స్మరణలో పునీతులవుతున్నారు. సార్థక జన్ములు శ్రీ సుందర రామిరెడ్డి గారు.

 

రెడ్డి అన్నయ్య గారితో సంభాషణ అంటే ఒక సత్సంగమే. ఎంతోమంది మహానీయుల్ని ఆయన దర్శించారు. 'రమణ మహర్షి, సత్యసాయిబాబా లాంటి వారిని అందరినీ దర్శించిన తర్వాత అమ్మే శరణ్యం అన్నింటికి' అంటారు అన్నయ్య.

 

Author: 
శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు
Source: 
విశ్వజనని మాసపత్రిక సంపుటి 1 సంచిక 4 - సనవంబర్ 2001