మనం అమ్మ నాన్నలకు ధాన్యాభిషేకం ఎందుకు చేస్తున్నాము? ఆ విధానం ఎలా వచ్చింది?

 

అభి అంటే సామీప్యము- అంతట -అత్యంతము అని అర్థం. అభిషేకము అభి అంటే స్నానము - అంటే సామీప్యములో నుండి అత్యంత నిష్ఠతో అంతట తడుపుట. దేనితో ? ధాన్యముతో తడుపుతున్నాము. లేక ధాన్యముతో స్నానం చేయిస్తున్నాము. ధాన్యముతో ఎవరైనా స్నానం చేయిస్తారా? నీళ్ళతోనో పాలతోనో చేయిస్తారు కదా! మరి ఇదేమిటి? అంటే ఇదే ఇక్కడి ప్రత్యేకత.

 

అమ్మ అన్నది తడి గుడ్డలోని తడి లాగ నేను మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉన్నాను అని. అంటే ఆత్మ స్వరూపిణియై సర్వ జీవులనూ అమ్మ ఉన్నది అన్నది అమ్మ మాటలతో మనకర్థమవుతుంది.

 

అమ్మ అర్చనకు విధి నిషేధాలు లేవు. ఉమ్మెత్తకాయలతో,పల్లేరు కాయలతో పుట్లకుపుట్లు కుంకుమతోనూ అర్చన చేసినవారున్నారు అమ్మ వద్ద ఒక విధానం లేదు ఎవరికేది యిష్టమైతే అది.

 

ఎండా కాలములో వర్షాలు లేక బాధ పడుతుంటే, అమ్మకు సహస్ర ఘటాభిషేకాలు చేసి వర్షం కురుపించుకున్న సన్నివేశాలున్నాయి. తొలి ఏకాదశి నాడు పాలతో అభిషేకం చేసుకున్న సన్నివేశాలున్నాయి. సంక్రాంతి ముందు భోగినాడు రేగుపళ్ళతో అమ్మ పాదాలభిషేకించి ఆ రేగుపళ్ళను అమ్మ చేతులమీదుగా తమ తలలపై అభిషేకించుకున్న వారున్నారు. అప్పుడు చూస్తే అమ్మ అమృతాన్ని రెండు చేతులతో పంచే మోహినీ రూపం ధరించిన విష్ణుమూర్తిలా వుండేది. అయితే ఇక్కడ అమ్మకు దేవతలు రాక్షసులు అనే తేడా లేదు. సర్వులూ సమానులే. - అమ్మకు ఎల్లలు లేని మాతృత్వం. నరకాసురుడు లోకానికి దుర్మార్గుడే కావచ్చు. కాని వాడి తల్లి వాడిని ప్రేమించకుండా ఎలా ఉంటుంది? అన్న అతిలోకా మాతృత్వం అమ్మది. ఎవరికైన అమ్మ వద్ద శిక్షణే కాని శిక్ష లేదు.

 

అమ్మ వద్దకు ఆకలితో వచ్చి కడుపునిండకుండా వెనుతిరగకూడదు అనేది అమ్మ సిద్ధాంతం. డ్రస్సును అడ్రస్సును బట్టిగాక ఆకలే అర్హతగా అన్నం పెట్టమన్న అన్నపూర్ణ అమ్మ. అందరింటిలో దోచుకున్న నక్సలైట్లను జిల్లెళ్ళమూడికి తెస్తే వాళ్లకు ముందు అన్నం పెట్టండి తరువాత మిగతా విషయాలు అన్న అనంత మాతృత్వం అమ్మది. అన్నపూర్ణాలయంలో గాడిపోయి నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ దాన్ని తన గుండె అన్నది. అన్నపూర్ణాలయం నడవాలంటే ధాన్యం ప్రధానం. అమ్మ ధాన్యలక్ష్మిగా విరాజిల్లుతూ అక్కడ ఆరాధింపబడుతున్నది. అన్నపూర్ణాలయం పరిపూర్ణముగా ఉంచాలంటే ధాన్యం అవసరం కదా? సర్వకాలసర్వావస్థల్లో అది జగనాథ రథ చక్రాల్లా ఆగకుండా నడవాలని అమ్మ ఆకాంక్షా. అందుకే ధాన్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే ఫిబ్రవరి 17 న ధాన్యంతో అమ్మ నాన్నలను అభిషేకించటం ఇక్కడి ప్రత్యేకత.

 

ధాన్యాభిషేకం కార్యక్రమం జరిగే రోజు నాన్నగారి ఆరాధనా దినోత్సవం కావడం యాదృఛ్చికం కాదు. ఎందుకంటే అన్నపూర్ణాలయం రాక ముందు నాన్న గారే అమ్మను దర్శించడానికి వచ్చే బిడ్డలందరికి భోజన సదుపాయాలు చూచేవారు. అమ్మ కొరకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండతముతో అమ్మ నచ్చచెప్పిన తరువాతనే నాన్న గారు అంగీకరించి 1958 ఆగస్టు 15 న అమ్మతో అన్నపూర్ణాలయం శంకుస్థాపన చేయించారు.

 

నాన్నగారి కుటుంబ త్యాగ ఫలింతంగానే మనం అమ్మ ఒడిలో ఆడుకున్నాం, పాడుకున్నాం, ఆరాధించుకున్నాం.

 

అమ్మ సంకల్పం పిడికడి బియ్యం. (అందరు రోజూ తాము వండుకొనే గిన్నేలోనుండి ఒక పిడికడి బియ్యం పోగుచేయటం) పథకం ఒక మంత్రమైయింది. అలా ఒక చోట చేరిన మనస్సుల ఏకతా మంత్రమే అన్నపూర్ణాలయానికి పునాది.దాని యొక్క ప్రతిరూపమే ధాన్యాభిషేకం.

 

అమ్మను ఒక జ్యోతిష్యుడు ఏదైనా ప్రశ్న అడుగమ్మా! సమాధానం చెపుతాను అంటే. ఈ సృష్టి లో ఏ జీవి ఆకలితో బాధ పడని రోజు ఎప్పుడు వస్తుంది? అని అమ్మ అడిగింది.

 

జిల్లెళ్ళమూడికి ఏది సమర్పించినా బంతి గోడకు కొట్టినట్లే నాన్నా! అని అమ్మ అనేది. అన్న దానాన్ని మించినది మరోకటి లేదు. మనం మొదలు పెడితే అమ్మే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందరు రండి! ఫిబ్రవరి 17 న మనం కూడా ఉడుతా భక్తితోఈ మహాద్భుతమయిన కార్యక్రమంలో పాలుపంచుకొందాము. ధాన్యాభిషేకాన్ని విజయవంతం చేద్దాం.

 

Author: 
శ్రీ పి ఎస్ ఆర్
Source: 
విశ్వజనని మాస పత్రిక ఫిబ్రవరి 2008( సంపుటి 7 సంచిక 7)