జగన్మాత అయిన అమ్మ దృష్టిలో ప్రతి ప్రాణీ తన సంతానమే. అన్ని రకాల ప్రాణులు తింటే కానీ, తల్లికి తృప్తి ఉండదు.
1950 సం లో గ్రామంలో కొన్ని కుక్కలకు పిచ్చి ఎక్కిందని ఊరివారు వాటి తలల మీద కొట్టి ఊరికి దూరంగా పారేశారు. వాటిలో 2 కుక్కలు ఆ కొట్టిన దెబ్బలకు మరణించలేదు. స్పృహ వచ్చాక నడవటానికి ఓపిక లేక పోయినా, తగిలిన దెబ్బలు బాధ పెడుతున్నా, పరుగెత్తుకొని వచ్చి అమ్మ సన్నిధికి చేరాయి. అమ్మ మజ్జిగ చిలుకుతుంటే, కింద పడ్డ చుక్కలు నాకి , అమృతాన్నీ ఆస్వాదించినట్లు దానిలో ఒక కుక్క తేరుకున్నది, (మజ్జిగ చుక్కలు నాకినంత మాత్రాన తేరుకునే స్థితి కాదు). ఇంకొక కుక్క అమ్మ పాదాల మీద వ్రాలి ఆత్మార్పణం చేసుకున్న ధన్యజీవి.
తేరుకున్న కుక్క అమ్మను ప్రాణ ప్రదంగా ప్రేమించేది. అమ్మకు ఏ బాధ తగిలిన సహించలేక పోయేది. అమ్మకు కష్టం కలిగించిన వాళ్ళ అంతు కనుక్కొనేది. దాని చూపులో, నడకలో, నడతలో అమ్మకోసం ఏ క్షణంలోనైనా ఆత్మార్పణం చెయ్యగల ధైర్యం, త్యాగం కనిపిస్తుండేది. అనేక సందర్భాలలో అమ్మకు తోడుగా మిత్రుడిగా ప్రవర్తించేది.
అమ్మ ఒక సందర్భములో "దాని గురించి చెప్పాలంటే మనిషి మనిషిని ఎంతగా ప్రేమించావచ్చో అంత దూరం అది నన్ను ప్రేమించింది. ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకు జబ్బుగా ఉంటె నేను వాళ్ళదగ్గర కూర్చునే అవకాశం లేక పనిలో ఉన్నప్పుడు నేను పని పూర్తిచేసుకొని వచ్చేవరకు వాళ్ళ దగ్గర కూర్చునేది. ఇంటికి ఎవరైనా కొత్త మనిషి వస్తే నా దగ్గరకు వచ్చి తాకి సంజ్ఞ చేసి చెప్పేది” అని చెప్పేది.
అమ్మ దగ్గరకు వచ్చే జనానికి 7వ మైలు రాయి నుండి ఊళ్ళోకి దారి చూపించేది. ఊళ్ళోకి ఎట్లా తీసుకోచ్చేదో అట్లాగే పంపి వచ్చేది. అది ఎవరి జోలికి పోయేది కాదు. అనవసరంగా తన జోలికి వస్తే ఊరుకోదు.
అమ్మ స్నానం చేసి హాల్లోకి వచ్చేసరికి రోజూ వచ్చే కుక్క రాకపోయేసరికి కుక్క ఎక్కడుందో చూసి రమ్మని వెతికించింది. అప్పుడు అమ్మ అలంకార హైమ ఉన్న ఇంట్లో ఉండేది. కుక్క దూరంగా (ఇప్పుడు అన్నపూర్ణాలయం కెదురుగా వున్న ఇసుక దిబ్బలమీద) పడుకున్నది. మరణ యాతన పడుతున్నది. లేవలేక పోతున్నదని చెప్పారు.
అమ్మ వెంటనే కుక్కను చూడటానికి బయలుదేరింది. అప్పుడు సన్నగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో, బురదలో వద్దని వారించి కుక్కను నీ దగ్గరకు తీసుకోస్తామన్నాడు రామకృష్ణన్నయ్య. అందుకు అమ్మ నవ్వి "దాన్ని మీరు తీసుకొచ్చేది నా కోసం కాదుగా, నాకేమి ఫర్వా లేదు. నేను వెళ్ళాల్సిందే" అని బురదగా ఉన్న నేల మీద కూడా పొడి నేల మీద నడిచినట్లు చక చక నడుస్తూ అంతిమ దర్శనానికి ఎదురు చూస్తున్న ఆ కుక్కను (భక్తుడ్ని) సమీపించింది నిరవద్య అయిన అమ్మ.
అప్పుడే పాలు తాగించడానికి ప్రయత్నిస్తున్న సోదరి చేతిలో పాలల్లో తులసిదళాలు తెప్పించి వేసి కుక్క పక్కన కూర్చొని ఆప్యాయంగా దానిమీద చెయ్యి వేసి నిమురుతుంటే - తన ప్రార్థనలనాలకించి వచ్చిన ఆర్త్రత్ర్రాణపరాయణ అయిన అమ్మ అమృత స్పర్శకు ఆ కుక్కలోని నరనరమూ పులకించేదేమో ఆ ఆనంద ఛాయలు దాని కదలికలోనే కాక ముఖంలో కూడా కనిపించాయి. కళ్ళు విప్పి అమ్మను చూడాలని ప్రయత్నం చేసింది.
పాల గిన్నె ముందు పెట్టినా కుక్క ముట్టుకోలేదు. దాని నర్థం చేసుకున్న అమ్మ దాని మూతి కడిగి శరీరమంతా నీళ్ళు చల్లి తోకవైపి భాగం తుడిచి చెవి పట్టుకుని అక్కడ వున్న కురుపుని చూచింది. అది బాధగా మూల్గింది, మళ్ళీ నీళ్ళు చల్లి చెవి అంతా కడిగి శరీరమంతా నిమిరి వెచ్చగా వున్న ప్రదేశంలో పడుకో బెట్టమన్నది. (వాతావరణం చాలా చల్లగా ఉన్నది)
తర్వాత రెండు రోజులకు అంతిమ శ్వాస వదిలి అమ్మను చేరింది. ఈ విషయం విన్న అమ్మ మరో కుక్కలు గాని, జంతువులు గాని పీకి తినకుండా గొయ్యి తీసి పూడ్చి పెట్టమన్నది. శరీరత్యాగం చేసిన తర్వాత కూడా అమ్మ బిడ్డపై చూపిన వాత్సల్య సంస్కారమనేది కేవలం మానవులలోనే కాక మిగతా జీవజాలంలో కూడా వున్నదని మనకు తెలియజేసిన ధన్యజీవి.
కుక్క అమ్మ చరిత్రలోనే ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. ఈ కుక్కే అమ్మ సన్నిధిలో మెలిగే ఆవు దగ్గర పాలు త్రాగింది. ఇదే పిల్లికి పాలు ఇచ్చింది. ఈ పిల్లి "మ్యావ్" అన్న ధ్వనిలో ఓంకారం ధ్వనించేది. అమ్మ పని చేసుకొని తీరిక వేళలో గుంజకానుకొని కూర్చుంటే ఎలుకలు, పిల్లులు కలసి అమ్మ పమిట చెరుగుమీద స్నేహితుల్లా ఆడుకునేవి. ఆ దృశ్యం కనువిందుగా ఉండేది.
ఒకసారి అమ్మ గదిలో పిల్లులు బాగా తిరుగుతుండేవి. అమ్మ మంచం మీద కెక్కి - అమ్మ సింహాసనంలోకి దూకి మూత్రవిసర్జన తో కలుషితం చేసివి. అమ్మ దుప్పట్లలో ఆడుకుంటూ చింపేవి. అలమరలో నక్కి కూర్చోని అమ్మ దుప్పట్లన్నీ ఖరాబు చేసివి. తమ పిల్లలకు ఆహారం కోసం రోజూ రాత్రి ఎలుకలను చంపి అమ్మ గదిలోకి తీసుకోచ్చేవి. తెల్లవారేసరికి అంతా రక్తపు మరకలు మాంసపు ముక్కలు. ఆ దృశ్యాలు చూసి సహించాలేకపోయే వాళ్ళము. ఒక రోజు పిల్లి పిల్లలను గోతంలో వేసుకొని వాటిని మరో ఊరిలో వదిలి రావటానికి ఆలోచించారు.
ఈ విషయం అమ్మకు తెలిసి ‘వాటిని స్వేచ్ఛగా వదిలేయండి. మీరు బజారుకు వెళ్ళారనుకోండి, అక్కడ మంచి పళ్ళు కనిపిస్తాయి. వాటిని కొనుక్కొచ్చి మీపిల్లలకు పెడదామనుకోరూ? తోటలో మంచి కూరగాయలు చూసినా వాళ్ళకిష్టమయినవి తెచ్చిపెట్టుకోరు? అవి అంతే! వాటిని గురించి ఇంత గొడవ ఎందుకూ? వాటిని ఏం చెయ్యద్దు ఎక్కడికి పంపవద్దు’ అన్నదా దయార్ర్థ హృదయ.
ఒకసారి కాకి అమ్మగదిలోకి వచ్చి అటూ ఇటూ తిరుగుతున్నది. ‘అది తోలినా పోవటం లేదమ్మా!’ అంటే ‘అదీ నా కోసమే వచ్చింద’న్నది.
మరొకసారి నేతిలో పూరీలు చెయ్యమన్నది. పూరీలు చేసి అమ్మకిచ్చాను. అవి తుంచి ముక్కలు చేసి వాకిట్లోకి వచ్చి ఒక్కొక్క ముక్క కాకులకి క్రింద పడకుండా నోటితో పట్టుకునేలా ఎగరవేస్తుంటే ‘అమ్మ కాకుల కోసమే నేతితో చెయ్యమన్నది' అని ఆశ్చర్యంగా నేనంటే "వాటికి నేతితో ఎవరు పెడతారు? అవీ రుచిగా తింటై కదా!" అని అమ్మ అనేది. అలాగే గారెలు కూడా నేతితో చేయించి వాటికి పెట్టేది. వాటిపై ఎంత మమకారమో! మొక్కజొన్న పేలాలు వేయించమని అవి కూడా ఎగుర వేసేది. అవి క్రింద పడకుండా కాకులు పట్టుకునేలా. అవి ఎగిరెగిరి పట్టుకుంటుంటే అమ్మ కళ్ళలో ఎంత ఆనందమో! వాటికి ప్రత్యేకంగా వండి పెట్టాలని, రుచిగా పెట్టాలని మనకుండదు కదా!
అమ్మ ఇంట్లో ఒక గుడ్డి గేదె ఉండేది. అమ్మ ఎక్కడకి వెళ్తే అది అమ్మకు తోడుగా వెంట ఉండేది. అమ్మ బయటకు వెళ్తుండగా ఒక సర్పం వచ్చింది. అమ్మను ఆ పాము ఎం చేస్తుందోనని అది అవతలకు వెళ్ళేదాకా ఆ బఱ్ఱె అక్కడినుంచి కదలలేదు. దానికి అమ్మ అంటే ఎంత ఆరాధనో!
ఒక ఆంబోతు ఉండేది. అమ్మ చుట్టూ రోజూ ప్రదక్షిణం చేసేది. అమ్మ మంచం చుట్టూ ఎంతమంది పడుకున్నా తొక్కకుండా వెళ్ళేది.
ఒక శుక్రవారం నాడు అందరం అమ్మకు పూజ చేసుకుంటుండగా అక్కడకు ఒక పాము ప్రవేశించింది. దాని చూచినా అందరం భయపడ్తున్నాము. అది మెల్లిగా పూజాద్రవ్యాల క్రిందకు చేరింది. అంతా గమనిస్తున్న అమ్మ "దానిని కదిలించవద్దు. అది పూజ చూడటానికి వచ్చింది. అది అపకారం చేసిన వాళ్ళ జోలికే పోతుంది. కానీ మనమే అందరి జోలికి వెళ్తాం" అన్నది. అమ్మ అన్నట్లే ఆ పాము పూజ కాగానే వెళ్ళిపోయింది. అది ఎటు వైపు వెళ్ళిందో ఎవరికి తెలియదు.
ఒక రోజు అమ్మ హాల్లో మంచం మీద కూర్చుని దర్శనం ఇస్తుండగా ఒక కప్ప వరండాలో తిరుగుతూ హాల్లోకి ప్రవేశించింది. అమ్మ రమ్మని పిలవగానే అది అంతే చాలనుకుని అమ్మ మంచం పైకి ఎక్కింది హుషారుగా. అమ్మ మంచం దిగి వరండాలోకి వెళ్తూ కప్పను రమ్మని తలూపింది. వెంటనే దిగింది. అమ్మ దానితో ఏం మాట్లాడిందో, దానికేమి అర్థమయిందో?
అమ్మ ఒకరోజు ఆరుబయట పందిట్లో మంచం మీద కూర్చున్నది. అప్పట్లో కరెంట్ లెదు. పెట్రో మాక్స్ లైట్ వెలిగించి స్తంభానికి తగిలించారు. ఆ లైట్ చుట్టూ పురుగులు చేరినై. అమ్మ మంచం చుట్టూ చుట్టుముట్టాయి. ఆ పురుగుల్ని దులపబోతుంటే అది చూచిన అమ్మ "దులపబోకండి. ఉండనీయండి. అది వాటి సంస్కారము." అన్నది.
అవి అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటిలో ఒక నల్లని పురుగు ఒకటి అమ్మ వక్ష స్థలం పై వాలింది. అమ్మ దానిని ముద్దు పెట్టుకున్నది. "చూడమ్మా! ఈ పురుగు, దీన్ని ముద్దు పెట్టుకున్నా వదలటం లేదు. ఇది దీని సంస్కారం . సంస్కారం అనేది ఎవరికైన ఒక్కటే . ఇన్ని పురుగులున్నై కదా! ఇది ఒక్కటే రావటానికి దీని సంస్కారమేగా. చూడు ఎట్లా మెల్లిగా నడుస్తున్నదో" అన్నది. ఆ నల్ల పురుగు సుమారు ఒక అరగంట మెల్లిగా నడుస్తూనే అమ్మ శరీరమంతా సృశిస్తున్నది. ఈ అవకాశం మళ్ళీ లభ్యం కాదేమోనన్నట్లు . అమ్మ చుట్టూ పరివేష్టితులైన సోదరీసోదరులు అమ్మకు వాటిపై గల మక్కువకు అమ్మ చర్యలకు చకితులైనారు.
అలాగే దోమల్లో కూడా. అమ్మ పాదాలకు ప్రదక్షణ చెయ్యటం. మరికొన్ని అమ్మ పాదాల మీద ఆత్మార్పణం చేసుకోవటం. అమ్మ అన్నట్లు అది వాటి అదృష్టం. సంస్కారం. కందిరీగ కుట్టి చెయ్యి చాచి బాధపెద్తున్నా సేవ చేసుకొని వెళ్ళిందనేది. పురుగు వ్రాలి గట్టిగా పట్టుకొని వదలక పోయినా "అది దాని సంస్కారం, దాన్ని సేవ చేసుకోనివ్వండి." అంటుంది.
చీమలు శరీరం మీద పాకుతున్నా తను బాధ పడ్తున్నా కాలు కదల్చదు సరి గదా, తియ్యనివ్వదు.
తన సంతానం అంతా తన చుట్టూ ఉండాలనే కోరిక. "గడ్డ లేచిందట గదమ్మా?" అంటే "గడ్డ కూడా బిడ్డే" అన్నది. "నీకీ బాధలేమిటమ్మ?" అంటే "అవీ మీలాగే" అంటుంది అమ్మలోని మాతృత్వం.
కాకులు, కుక్కలు, పిల్లులు, పిచ్చుకలు, చీమలు, దోమలు పురుగులు సమస్త జీవులు అమ్మ ప్రేమలో మునిగి తేల్తుంటాయి.
ఒక సందర్భంలో అమ్మ అన్నది "తరించటానికి మానవ జన్మే అవసరం లేదు. ప్రతి వ్యక్తీ, ప్రతి వారు బాగుపడటానికే వచ్చింది. ఎవ్వరూ వృధా పోరు. అందరికీ సుగతే. కాస్త వెనుకా ముందు తేడా అంతే.”