అమ్మ శాస్త్రాలు పఠించలేదు . వేదాలు వల్లించలేదు. అమ్మకు పాఠశాల చదువు కూడా అనుమానమే. అమ్మ గ్రంథ కర్త కాదు. ఉపన్యాసాలు ఇచ్చినట్లు లేదు. ఆమె పీఠాధిపతి కాదు. మత కర్త కాదు. అమ్మ గురువు కాదు. అమ్మకు శిష్యులులెవరూ లేరు. అంతా శిశువులే. అందుకే అమ్మ సంభాషణలన్నీ తల్లి పాలిస్తూ ఒడిలో ఉన్న బిడ్డతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి.

 

ఎవరు ఎంత జటిలమైన ప్రశ్న వేసినా, తల్లి తన బిడ్డతో ఎలా మాట్లాడుతుందో, ప్రశ్నించిన అతనితో కూడా అదే రకంగా మాట్లాడేది. అమ్మ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. మృదు మధురంగా మాట్లాడుతుంది. మాటలు తడుముకోవటం ఉండదు. తడబాటు అసలు లేదు. ఒక్కొక్కప్పుడు కాంతి కంటే వేగవంతమైన భావతరంగాలతో సమాధానాలు దొర్లేవి. మరొక్కప్పుడు తాను వాగ్దేవి అవతారమనిపించే విధంగా భాషపై అధికారం ప్రదర్శించేది. ఆ పదలాలిత్యమే వేరు. 'అసలు ఇంత మధురమైన పదజాలం తెలుగు భాషలో ఉన్నదా?' అనిపించేది. ప్రశ్నించేవారు ప్రశ్నవేయటానికి తోట్రుపాటు పడుతుంటే, అతని మనసులోని ప్రశ్నను గూడా తానే చెప్పి, దానికి సమాధానం చెప్పేది. మరొకప్పుడు అమ్మను పరీక్షించటం కోసం వచ్చిన పోకీరలకు అంతకంటే చాకచక్యంగా సమాధానాలు దొర్లేవి. అమ్మ దగ్గర జిజ్ఞాసులకు లభించే సమాధానాలు వేరు సాధకులకు లభించే సమాధానాలు వేరు, తత్త్వవేత్తకు లభించే సమాధానాలు వేరు. అడిగిన వారి స్థాయిని బట్టి సమాధానాలుండేవి.

 

అమ్మ మరుగుజ్జులలో మరుగుజ్జు, మహాకాయులలో మహాకాయ. అవతల వారికంటే ఒక్క మెట్టు మాత్రమే పైన ఉన్నట్లు కనిపిస్తుంది. కొంచెం ఎగురితే చాలు మనం అందుకోగల మన్నట్లుండేది. కాని, అమ్మ ఎవరికీ ఏనాడు అందేదికాదు. అయితే ఎవరిస్థాయి ననుసరించి వారితో ఆత్మీయంగా, ప్రేమగా , దయార్ద్ర హృదయంతో ఆప్యాయంగా సంభాషించేది. అమ్మ దర్శనార్థం వచ్చిన లక్ష్మీకాంతయోగి గారు, అవధూత రఘువరదాసు గారు ప్రభుదత్త బ్రహ్మచారి గారు, మరెందరో మహానుభావులు, అమ్మ చల్లని చూపులకే పరవశించి, వారి నోటికి అమ్మ అందించిన మహాప్రసాదాన్ని స్వీకరించి, దివ్యానుభూతులు పొంది , తమ జీవితాలకిదిచాలనుకున్నారు.

 

ఒకసారి ఇజ్రాయిల్ దేశానికి చెందిన క్రైస్తవ సోదరుడు ఒకరు అమ్మను దర్శించుకొని " అమ్మా!- మేము క్రీస్తు దేవుడని నమ్ముతున్నాము. కాని క్రీస్తు తాను దైవ కుమారుణ్ణి మాత్రమే- అని చెప్పుకున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి?" అని ప్రశ్నించాడు.

 

అమ్మ " నేను అట్లా అనుకోవటం లేదు. నాకంటే పైన మరొకరు ఉన్నారనుకోవటం లేదు. నాకంటే క్రింద ఎవరో ఉన్నరనుకోవటం లేదు " అని ఉదాసినంగా సమాధానం చెప్పి ఊరుకున్నారు.

 

అంటే, ఉన్నదంతా తానూ మాత్రమేనని "అహం బ్రహ్మాస్మి" అన్న ఉపనిష ద్వాక్యానికి తార్కాణంగా తనను తాను ఆవిష్కరించుకున్నదని అర్థం.

 

ఎన్నిరకాలుగా ప్రశ్నించినా ,ఎన్ని సార్లు అడిగినా అమ్మ దగ్గర నుండి ఒకే సమాధానం " అంతా అదే" "అంతా నేనే" అమ్మ ఎన్నోసార్లు, ఎన్నో మాటల్లో తనకూ -దైవానికి, తనకు -సర్వసృష్టికి అభేద స్థితిని వ్యక్తం చేసింది. కానీ మళ్ళా దైవంతో తనకు తాదాత్మ్యాన్ని వ్యక్తం చేస్తూనే , మళ్ళా అంతలోనే మాయకప్పేసి " మీరు కానిది నేనేమి కానని" మనందరి సరసన నిలుచుండేది.

 

పరమపూజ్యులు పూర్వపు కూర్తాళ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విమలానంద భారతీస్వాములు , ‘ఇదంతా’ అనే పేరుతొ ఒక గ్రంథాన్ని రచించారు. వారు మహా మేధాసంపన్నులు. అ గ్రంథమంతా "ఇదంతా అదే " అన్నట్లు సాగిపోతుంది. సాధక మహాశయుడొకడు, అమ్మ దర్శనార్థం వచ్చి " తన శిష్యుడైన వివేకానందునుకి, శ్రీ రామకృష్ణ పరమహంస దర్శింప జేసినట్లుగా నాకు గూడా నీవు దైవాన్ని దర్శింప జేయాలమ్మా!” అనగానే అమ్మ చుట్టూ ఉండే పరిసరాలను ఒక్కమాటు కలయజూచి " ఉన్నది అంతా అదే అయినప్పుడు , ఇందులో దేనిని ప్రత్యేకించి నీకు చూపించమంటావు నాన్నా! " అన్నది. " ఈ కంటికి కనిపించేదంతా 'అదే' అయినప్పుడు ప్రత్యేకించి కండ్లు మూత లెందుకు? అని ప్రశ్నించింది. అంటే మనకు కనిపించేది- మనకు కనుపించనిది , అంతా బ్రహ్మమే అని అమ్మ భావన.

 

మరొక సందర్భంలో "అమ్మ దేవుడిని గురుంచి తెలుసుకోవటం అంటే దేవుడు లేడని తెలుసుకోవటమే" అన్నది. ఈ వాక్యం వింటే 'అమ్మ మతం నాస్తిక మతమా!' అని మనకు అనిపించవచ్చు. కాని అది సరి కాదు. ఈ సృష్టి కంటే భిన్నంగా గాని, వేరుగా గాని దేవుడు లేడని అర్థం.

 

అమ్మకు గూడా ఒక పంచాక్షరి ఒక అష్టాక్షరి ఉండేవి. ఇది ఏమిటి ? అసలు ఏమిటి ?- ఇవే అమ్మ చెప్పిన మంత్రాలు.

 

కొన్ని ఆధ్యాత్మిక పదాలకు, అమ్మ ఇచ్చే నిర్వచనాలు అనిర్వచనీయాలు, అనితర సాధ్యాలు ఆపాత మధురాలు, ఆలోచనామృతాలు ఏ ఆధ్యాత్మిక భావనకైనా అమ్మ చెప్పే అర్థం వింటే, " ఇంత చిన్న మాటలో అంత పెద్ద అర్థం ఉందా?" అనిపించటమే గాదు, ”ఇంకెంత అర్థం నీగూఢoగా ఉన్నదోనని" మనలో ఉత్కంఠ రేకేతిస్తాయి.

 

‘ఆత్మసాక్షాత్కారం కావటం’ అంటే ‘ఈ జగమంతా ఆత్మాగా కనిపించటమే’ నని సరికొత్త నిర్వచనాన్ని సాధకులకు ప్రసాదించింది అమ్మ

 

ఇదే వరసలో ‘జగజ్జనని’ అనే పదానికి అర్థం చెపుతూ ‘జగత్తుకు జనని’ అని కాదు. ‘జగత్తే జనని’ అని సరికొత్త వ్యాఖ్యానం చేసి మనమంతా సాధారణంగా చూచే దృష్టి లో మార్పు తెచ్చింది. లోకాన్నే మనకు ఆరాధ్యం చేసింది, లోకారాధ్య అయిన అమ్మ.

 

'నీబిడ్డలో ఏమి చూస్తున్నావో అందరిలోనూ దానిని దర్శించటం నిజమైన బ్రహ్మ స్థితి' అని బోధించింది అమ్మ. ఇది అమ్మ మనకిచ్చిన ఆధ్యాత్మిక మహా మంత్రం. ప్రతివాడు తన బిడ్డల వలె ఇతరులను ప్రేమించగలిగితే ఈ ప్రపంచములో కక్షలు, కార్పణ్యాలు , ద్వేషాలు, దౌర్జన్యాలు, మారణకాండలు, మహాసంగ్రామాలు వీటన్నిoటికీ తావెక్కడిది? ఈ లోకమంతా శాంతిమయంగా కాంతిమయంగా కావాలని అమ్మ ఆకాంక్ష.

 

మనతోటి మానవులందరినీ, మన ఆత్మీయులుగా భావించాలి అనే సామాజిక స్పృ హలో ఇంతవరకు మనకు శాస్త్రం బోధించిన మార్గాలు రెండున్నాయి. ఒకటి లోకాన్ని- తనలాగానే చూడటం, రెండవ మార్గం –లోకాన్ని దైవంగా పూజించటం. అమ్మ ఈ రెండాకులకు మూడవ ఆకును ముడివేసి నూతన సిద్దాంతానికి శ్రీకారం చుట్టింది. అదే 'లోకాన్నంతా నీ బిడ్డగా ప్రేమించు' . ఇది సాధకులకు అమ్మ ప్రసాదించిన నూతనమైన కానుక. యశోదానందుల వంటి వారు గూడా బాలక్రిష్ణునిలో భగవంతుని దర్శించారేమొగాని, ప్రతి జీవిలోనూ తన బిడ్డను చూచుకోవటమనేది జరగలేదు! ఇదొక మనోహరమైన భావన. మధురమైన ఆరాధనామార్గం.

 

అమ్మ దృష్టిలో దైవారాధన – సమాజసేవ వేరు గావు. మనకందరికీ నిత్యమూ దర్శన మిచ్చే సృష్టి కంటే దేవుడు వేరే ఎక్కడో లేడు. " కనిపించే లోకాన్ని ఆరాధించటం మాని, కనిపించని దేవుడి కోసం ఆరాటం ఎందుకు? అని అమ్మ అనేక సార్లు ప్రశ్నించేది

 

"ప్రాపంచికమని పారమార్థికమని రెండు లేనేలేవు. రెండు ఒక్కటే" అని చెప్పి , నింగికి నెలకు ఒకే గట్టి పీటముడి వేసింది అమ్మ.

 

ఆధ్యాత్మిక దృష్టి వేరు, సామాజిక దృష్టి వేరు --అనే అపోహకు చరమ గీతం పాడి, ఆధ్యాత్మిక జీవనాన్ని సామాజిక సేవను కలనేతగా పెనవేసుకున్న, నూతన మానవ విధానాన్ని మన ముందు ఆవిష్కరించింది అమ్మ. మాధవత మానవత ఈ రెండిటి విచిత్ర సమ్మేళనంతో నవరసభరితమైన విశిష్ట వ్యక్తిత్వం మాతృశ్రీది.

 

అన్నపూర్ణాలయం అంకురార్పణ చేయటంలో గల అంతరార్థం గూడా ఇదేనేమో?

 

అమ్మ తాత్త్విక చింతన అగాధం. లోకజ్ఞానం అపారం. వాక్కు సరళం. హృదయం దయార్ద్రం. మేధస్సు సునితం. వీటన్నింటి కలబోత అమ్మ అవతారం.

 

అమ్మ జగద్గురువుల కంటే ఒక అడుగు ముందుకు వేసి " సృష్టికి- కర్తకు భేదం లేదన్నది" “పూవులోని భాగాలన్నీ పూవు కాకుండా పోతాయా" అన్నది . భగవంతుడే ఈ సృష్టిగా ఉన్నాడన్నది. మళ్ళీ మాట్లాడితే భగవంతుడు, సృష్టి, ఆత్మా, బ్రహ్మ ఇవన్నీ ఒకే శక్తికి పర్యాయపదాలన్నది. కనపడనిదేదో కనబడేదీ 'అదే' అన్నది. ఈ కనపడేదంతా ఏమిటి? అని ప్రశ్నించి, ‘అంతా అదే’ నన్నది. మనమంతా మన కళ్ళతో చూచేదంతా 'దాని నిజస్వరూపాన్నే" అన్నది.

 

ఈ దృశ్యమైన జగత్తు, అదృశ్యమైన జగత్తు,--- 'అంతా అదే' సర్వం మాతృమాయం జగత్. --- 'అంతా అదే' జయహో మాతా!

 

Author: 
శ్రీ అన్నాప్రగడ లక్ష్మీనారాయణ
Source: 
విశ్వజనని మాస పత్రిక జనవరి - 2011 ( సంపుటి 10 సంచిక 6)