అనుకున్నది జరిగినప్పుడు ఆనందం, అలా జరగనప్పుడు దుఃఖం ఇదే మనిషి ,మనోలక్షణం. ఆశలు, ఆశయాలు, ప్రణాళకలు, ప్రయత్నాలు ఎన్ని చేసినా ‘ఫలితం’మన చేతిలో లేదు. తన గత కర్మపై ఆధారపడియున్నది. ఆ కర్మఫలాన్నే అందిస్తుంది దైవం. అంతేకాని మనం ఊహించినదంతా నెరవేరదు. ఆశోకుడు తన సోదరులను హతమార్చాడు. గొప్ప భారతసామ్రాజ్యాధినేతగా పరిణమించాలనుకున్నాడు. అప్పటికి ఆయన ఆశయానికి తగ్గ ధైర్యముంది, సాహసముంది, వీరత్వముంది, ఆలాగే జయిస్తూ వచ్చాడు కానీ!, కళింగ యుద్ధం తన ధృడ సంకల్పాన్ని మనో నిశ్చయాన్ని తారు- మారు చేసింది. ఆలోచింప చేసింది. యుద్ధానంతరం ప్రజా జీవనమెలా ఉంటుందో పరిశీలంపజేసింది. తనని పశ్చాఃతాపానికి గురిచేసింది. తత్ఫలితంగా రజోగుణ ప్రభావ పూరితమైన యుద్ధకాంక్షనుదునుమాడింది. ధర్మ మార్గం వైపు అడుగులు వేయించింది. భౌద్ధ మతావలంబిగా చేసింది,ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టించింది ఆ యుద్ధ ఫలితం . కానీ అశోకుడు అనుకున్నట్లుగా జరుగలేదు. ఇప్పుడు మనం అనుభవిస్తుంది, భోగమైన, భాగ్యమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, మరేదైనా గత ఫలితమే కాని ఇప్పటిది కాదు. అది అనుభవానికి రావలసియున్నప్పుడు మనకు ప్రేరణ కలిగించి,ప్రయత్నం చేయించి ఫలితాన్ని అందజేస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తుంది ప్రారబ్ధం, అందుకే ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నది శృతి వాక్యం . దీనిని అనుభవిస్తూ సత్కర్మలనాచారిస్తూ ఉంటే , ప్రారబ్ధానుభవంతరువాత సత్కర్మల యొక్క సత్ఫలితాన్ని అనుభవించ గలుగుతాము. తానూ తలపెట్టిన దేమైన జరిగితే తన ‘ప్రతిభ’ అనుకుంటాడు మనిషి, కానీ, తలపెట్టిన ప్రతీదీ జరగనప్పుడు, నా ‘కర్మ’అంటాడు. అంటే జయాపజయాలు తన ఇచ్ఛ ప్రకారం జరగవని తనకున్నదే తనకు జరుగుతుందని, తనకు లేనిది తనకు జరగదని అమ్మ ప్రభోదించింది. మన ప్రారబ్ధంలో ఉంటే మనం వద్దనుకున్న మనకు అందక మానదు. లేకుంటే ఎన్ని చేసినా అది అనుభవానికి రాదు- అన్న సత్యాన్ని గ్రహించి సర్వ వేళలలో దైవం (అమ్మ) పై భారం వేసి బాధ్యతలు నెరవేర్చుకోవాలి.
శ్రీ పరాత్పరికీ ‘జై’