పందొమ్మిది వందల అరవయ్యో సంవత్సరమో, ఆ మరుసటి ఏడాదో సరిగా గుర్తు లేదు. హైదరాబాద్ చెందిన కొందరు సోదరులు, గుంటూరు వాస్తవ్యులైన మరి కొందరితో కలసి పెదనందిపాడు చేరి, అక్కడ బాపట్ల వెళ్ళే బస్సులో ఎక్కడానికి తంటాలు పడుతున్నారు. బస్సు ప్రవేశ ద్వారము వద్ద జనం తోసుకుంటున్నారు. సోదర బృందం  గుంపు వెనకే నిలబడి బస్సు ఎక్కే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పెద్ద మనిషి వారిని " ఎక్కడికి వెళ్ళాలి?" అని పలకరించాడు.

 

ఒక సోదరుడు " జిల్లేళ్ళమూడి" అని జవాబు ఇచ్చాడు. "దేనికి అమ్మను చూడటానికా ?" మళ్లీ ప్రశ్న."అవునండి" అని సోదరుడి సమాధానం. పెద్దమనిషి నొసలు చిట్లించి "బాగా చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇదేమిటి మీరు ఆమెను చూడటానికి వెళుతున్నారా?"  సరిగా ఇవే మాటలు కాకపోయినా పెద్ద మనిషి ఈ అర్థం వచ్చే వ్యాఖ్యాన పూర్వక ప్రశ్న వేశాడు. సోదరులలో ఒకరు శ్రీ తంగిరాల కేశవశర్మ గారు చిరునవ్వుతో ఆ పెద్దమనిషి వంక తిరిగి "చడువున్న వాళ్లము గనుకనే వెళుతున్నాం అనుకోండి!" అన్నారు. ఆ పెద్ద మనిషి మొహం మాడ్చుకొన్నాడు. జిల్లేళ్ళమూడి అమ్మ దగ్గరకు వెళ్ళడం అంటే తాయత్తులు కట్టించుకొనడానికో , మంత్రం పెట్టించుకొనడానికో అనుకునే ఆ రోజుల్లోనూ, అటు తరువాత కూడా ఉండేవారు. జిల్లేళ్ళమూడి వెళ్ళకుండానే అభిప్రాయాలు ఏర్పరచుకునే వారే ఎక్కువ మంది అలాంటి వ్యాఖ్యానాలు  చేస్తుండేవారు. కొంతకాలం తరువాత అక్కడ దొంగనోట్లు ముద్రిస్తున్నారనీ, అమ్మను పోలీసులు పట్టుకొని  పోయారని కూడా వదంతులు  పుట్టాయి. విచిత్రమేమంటే అక్కడ బోలెడు డబ్బులు మూలుగుతున్నాయని,వెండి ,బంగారాలు పుష్కలముగా ఉన్నాయని భ్రమించి  విప్లవ వర్గంగా ప్రకటించుకున్న కొందరు జిల్లేళ్ళమూడి అమ్మ ఉన్న ఇంటిపై ఒక రాత్రి వేళ దాడి చేసారు.

 

ఇలా ఎందరు ఎన్ని విధాలుగా అనుకున్నప్పటికీ జిల్లేళ్ళమూడి అమ్మను ఒకసారి దర్శించుకున్నవారు మళ్లీ మళ్లీ దర్శించుకొంటూనే వచ్చారు. అలా అమ్మ పట్ల భక్తి ప్రేమ గౌరవాలు పెంచుకున్న వారిలో కేశవ శర్మగారు చెప్పిన చదువుకున్నవారూ  ఉన్నారు. చదువులేని వారూ ఉన్నారు. కోటిశ్వరులెవరూ లేరమోగాని, అంతో ఇంతో ఉన్న మధ్య తరగతి వారూ ఉన్నారు, పేదలు నిరుపేదలు ఉన్నారు.. అన్ని వర్గాలువారు ఉన్నారు. అక్కడ వివక్షత కనిపించదు. "ఉదారచారితానాంతు  వసుధైక కుటుంబకం"  అమ్మ సమక్షములో నిరూపణమైందని కొందరము అనుకొన్నాము.

 

తత్వశాస్త్రాలు చదువుకొని, అమ్మ మాటలను శాస్త్రపరంగా అర్థం చేసుకొన్న సోదరులలో ఒకరు, ఆంధ్ర ప్రదేశ్ లో  సైన్స్ చదివి డాక్టరేట్లు పొందిన తొలితరం శాస్త్రజ్ఞులలో ఒకరైన డాక్టర్. శ్రీపాద  గోపాలకృష్ణమూర్తిగారు - అమ్మ ప్రసంగవశాత్తు పలికిన అనేక పసిడి పలుకులను కూర్చి రెండో మూడో సంపుటాలను ప్రచురించారు. ఆయన గొప్ప సాహతీవేత్త, విద్యా వేత్త కూడా. ఆయనతో గంటల తరబడి సంభాషణలు జరిపిన అనుభవము నాకు ఉంది. ఆయనతో ఎప్పుడు మాట్లాడిన ఎంతో కొంత  నేర్చుకోన్నామని తృప్తి కలిగేది. అమ్మ పట్ల ఆయనకీ విశ్వాసం కలగటానికి యేవో కొన్నిఅనుభవాలు ఉన్నాయి. "సైన్సును నమ్మేవాళ్ళు  ఇలా దైవత్వాన్ని లాంటివి నమ్ముతారా?' అని నేను అడిగితే, 'రుజువు దొరికినప్పుడు సైంటిస్ట్ అయినవాడు నమ్మి తీరుతాడు.' అని ఆయన సమాధానం . ఖచ్చితముగా ఇవే మాటలను ఆయన వాడి ఉండక పొవచ్చు. కాని, భావము మాత్రం ఇదే.

 

వేదాంత గ్రంధాలు అందించిన నాలుగు మహావాక్యాలు - అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం తత్త్వమనీ అయమాత్మా బ్రహ్మ - తత్త్వశాస్త్ర జిజ్ఞాస కలిగిన  వారందరికీ తెలిసినవే. వాటిపై అనేకానేక వ్యాఖ్యానాలు వివరణ గ్రంథాలూ వెలువడ్డాయి.

 

పాతంజలయోగ సూత్రాలు, వేదాంత పంచదశి భగవద్గీత,ఉపనిషుత్తులు, శ్రీ మద్భాగవతాది పురాణ గ్రంథాలు,కావ్యకంఠవాసిష్ఠ   గణపతి ముని రచనలు -ఇంకా ఎన్నో గ్రంథాలు చదివిన డాక్టర్ శ్రీ పాదగోపాల కృష్ణమూర్తి, శ్రీవీరమాచనేని ప్రసాద్ గారు శ్రీ రాయప్రోలు భధ్రాది రామశాస్త్రి గారు, డాక్టర్ పన్నాల రాధా కృష్ణమూర్తి గారు, బులుసు లక్ష్మీ ప్రసన్న సత్యనారయణ శాస్రి గారు కృష్ణ భిక్షు గారు మొదలైన మేధావులు విధ్వాంసులు అమ్మ నోటి నుండి వెలువడిన అద్భుత వాక్యాలకు తమదైన పద్ధతిలో వ్యాఖ్యానాలు పలికారు.

 

వేదాంత గ్రంథాలు చెప్పినవి నాలుగు మహావాక్యాలయితే అమ్మ వాటినతంటి సారాన్ని ఒకే వాక్యములో "నేను నేనైనా నేను" అని ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మహా వాక్యాన్ని చెప్పింది.

 

సంస్కృత  సాహిత్యములో ప్రత్యేకించి వైదీక సాహిత్యములో సూత్రీకరణ ఒక మహాఅద్భుత ప్రక్రియ. అవి బ్రహ్మ సూత్రాలు కావచ్చు, పాతంజలయోగ సూత్రాలు కావచ్చు. తరచి చూచిన కొలది వాటిలో కొత్త ఆలోచనలు కలిగిస్తాయి. మహావాక్యాలు సూత్రాల కంటే ఘనమైనవి.

 

అమ్మ ప్రసంగవశాత్తు పలికిన కొన్ని లఘువాక్యాలను ఆ రోజుల్లో అమ్మ దగ్గరకు వస్తూ ఉండిన కొందరు సోదరులు మహావాక్యాలు అనేవారు. ఉదారహణకు అమ్మ చెప్పిన 'ఇష్టం లేనిది కష్టం' 'ధ్యాసే ధ్యానం' 'తృప్తే ముక్తి'  'ముముక్షుత్వమే మోక్షం' 'అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు' - ఇవన్ని ఒకవిధంగా నిర్వచనాలు, మరొక విధంగా సూత్రాలు కూడా. తవ్విన కొద్దీ భావం  వ్యక్తమవుతుంది.

 

"నాకేమి తెలియదు."  "మీరు కానిది నేనేమి కాను"  "నేను మీలో దైవత్వాన్ని చూస్తున్నాను"   "నా సాధన పిల్లల్ని కనడమే" అలాంటి మాటలు చెప్పే అమ్మలో ఆకర్షణ ఏమిటి? చదువుకున్నవాళ్ళూ, కుల, మత, వర్గ,వర్ణ భేదం లేకుండా ఎందుకు ఆమెను చూడటానికి వెళుతున్నారు? ఎందుకంటే ఎవరి అనుభవం వారికి ఉన్నాయి. గనుక, అనుభవాలు విశ్వాసానికి పునాదులైనాయి. ఆనుభవాలంటే అద్భుతాలా(మిరాకిల్స్)? ఆమె మిరాకిల్స్ చేశానని గాని, చేస్తానని గాని చెప్పలేదు. మిరాకిల్స్ గురించి అమ్మ ఒకసారి ఇలా అన్నారొకసారి." మిరాకిల్ మిరాకిల్ అంటారు. మిరాకిల్ అంటే ఏమిటి? ఈ కనిపిస్తుంది అంతా మిరాకిల్ కాదూ? అంతకంటే మిరాకిల్ ఏమి కావాలి?

 

మహాత్యాలు ఉన్నాయా లేవా అనే విషయములో అమ్మ ఎవరికి కావలసిన పద్ధతిలో వారు అర్థం చేసుకొనే సమాధానము చెప్పింది. ఒకానొక సందర్భంలో " నీకు సాధ్యము కానిది ఇతరులకు సాధ్యం కాదని ఎందుకు అనుకొంటున్నావు?" అని ప్రశ్నించింది. " మహాత్తత్వానికి మహాత్యాలతో పని లేదు" అని ఇంకొక సందర్భములో అన్నది.

 

ఇలా ఎటూ తెగని సమాధానాలు చెబితే ఎలా? అని ఎవరి మనసులోనైన ప్రశ్న తలెత్తవచ్చు. అందుకు కూడా అమ్మ చెప్పిన సమాధానం ఉంది. " నా సమాధానాలు వాళ్ళ వాళ్ళ స్థితికి తగినట్లుగా ఉంటాయి. అడిగే  విధానములోని  పరిస్థతి తెలుస్తుంది.    దానికి  తగినట్లే   సమాధానం ...."

 

"అవినావభావసంబంధం" అనే అభివ్యక్తి చాలామంది చాలా సందర్భాలలో విని ఉంటాము. అదికూడా ఒక గొప్ప సూత్రమే. అమ్మ "అవి-నా- భావసంబంధం' అని అన్నారు. అమ్మ పలికిన "నా" అంటే ఎలా దైవికమో వ్యక్తలకు వ్యక్తి సంబంధమైతే  దైవానికి దైవ సంబంధము!  "అని -నా -భావసంబంధము" అర్థం కావటానికి అమ్మ చేసి చూపించిన ఒక ప్రయోగాన్ని ఇక్కడ జ్ఞాపకము చేసుకుందాం. 1970 డిసెంబర్ "మాతృశ్రీ " సంచిక 26 వ పేజిలో ఈ సంఘటన సమాచారం ఉంది.

 

"వసుంధర చాలా ఆదుర్దాగా  బీరువాలో, అలమరలు గాలించేస్తుంది. అయినా ఈ ఉంగరం కన్పించలేదు. ఒకటికి రెండు సార్లు అమ్మ దగ్గరికి వెళ్లి ఆ వస్తువును దొరికేటట్లు చేయమని బ్రతిమలాడింది. అమ్మ తన పాదాన్ని ముందుకు జాపారు.- వసుంధర అదేమీ  గమనించకుండా మళ్లీ వెళ్లి వెదకసాగింది. అమ్మ కాలివ్రేలికే ఉన్న వస్తువు మరిక్కోడో ఎందుకు దొరుకుతుంది? మూడోసారి తన దగ్గరుకు బిక్క ముఖము పెట్టుకొని వచ్చిన వసుంధరను చూచి అమ్మ నవ్వుతో -"అట్లా ఉంటుంది వసుంధరా! అబినాభావసంబంధము అంటే. ఇదే నేను చూపించినా నీ భావాన్ని బట్టి నీకు కనిపించటము లెదు. ఏదైనా మన భావాన్ని అనుసరించే ....దానికి కారణం మన భావాలే".

 

అవినాభావ సంబందానికి అమ్మ చేసిన తాత్విక వివరణ చూడండి.

 

రజ్ఞువును సర్పంగా చూపించి నా భావం, భయపడ్డది నా భావం, దీపం తెచ్చింది దానిదే. ఆ భావమే భావానికి ఆధారమయింది. భావాభావ సాహితమే యీ ప్రభావమంతా. దీనికి రహితం లేదు. అంతా సహితమే. అందుకే అవినాభావ సంబంధం అంటే -అవి -నా భావ సంబంధం. అవి కనబడేవి. నా భావం అంటే కనబడే వాటిని ఊహించేది. ఊహను బట్టి సంబంధం ఏదైనా చూసేదాన్ని బట్టి కనబడుతుంది."

 

బ్రహ్మ సూత్రాలపై చాలా భాష్యాలు వెలువడ్డాయి. ఒక్కొక్కటి  నాలుగేసి పాదాలు కలిగిన నాలుగు అధ్యాయాలోను  (నాకు తెలిసినంత వరకు ) మొత్తం 555 బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి. కాని, అమ్మ బోధనలన్నింటి సారాంశాన్ని ఒకే సూత్రములో బంధించింది.   " నేను నేనైనా నేను",   వైదిక వాంగ్మయంలోని  మహా వాక్యాల, బ్రహ్మసూత్రాల సరసన నిలిచే అమ్మ సూత్రం.

 

Author: 
డా. పొత్తూరి వెంకటేశ్వర రావు
Source: 
విశ్వజనని మాసపత్రిక | సంపుటి 4 | జూన్ - 2005 | సంచిక 11