పరిమితమైన మమకారం మానవత్వాన్ని సూచిస్తే, అపరిమితమైన మమకారం మాధవత్వాన్ని సూచిస్తుంది అని అమ్మ అన్నారు. అంటే తరతమ భేదం లేకుండా సమపథ సృష్టి యందు తాదాత్య్మ భావంతో సృష్టి విధానాన్ని తన విధానంగా చూస్తూ ఎవరు అనుభూతిని పొందుతూ ఉంటారో వారే నడిచే దేవుళ్ళు.

 

కాళీమాతతో అంత్యంత ప్రేమతో భక్తీ భావంతో సంభాషించే శ్రీ రామకృష్ణ పరమహంస జమీందారు మధురనాధునితో కలసి తీర్థ యాత్రలకు వెళుతూ ఉంటారు. దేవఘర్ వైద్యనాథ మహాక్షేత్రానికి వెళ్లి అక్కడి నుండి ఒక మామూలు గ్రామం మీదుగా వెళుతున్నప్పుడు పరమహంస ఆ గ్రామస్థుల దుర్బర దైన్యాన్ని చూసి , మధురునితో నీవు జగన్మాత రసద్దారుడవు. వీరందరికీ సంతృప్తిగా భోజనం పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బట్ట యిమ్మని కోరగా, శతాధిక పరివారంతో యాత్ర చేయుచున్న మధురనాధుడు ధనం సరిపోదేమో యని పలుకగా అదేమో నాకు తెలియదు నీవు వీరికి ఆహారము, వస్త్రము యీయనిచో నేను యిచటనుండి బయలుదేరాను అని గ్రామం మధ్యలో పరమహంస కూర్చుంటారు . వెంటనే జమీందారు కలకత్తా నుండి బేళ్ళ కొలది బట్టలు తెప్పించి గ్రామస్తులందరికీ సంతర్పణం చేసి బట్టలు ఇచ్చిన తరువాత కాని పరమహంస అక్కడి నుండి కదలలేదు.

 

అమ్మ ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు తనతో వచ్చిన పరబ్రహ్మమూర్తి గారిని చూసి "ఇక్కడ మనవాళ్ళు ఎంతమంది వున్నారు?" అని అడిగారు. ఆయన అమ్మ వెంట కార్లలో వ్యాన్లలో వచ్చిన జనాన్ని లెక్కవేసి "సుమారుగా ముప్పై నలభై మంది ఉండవచ్చమ్మా!" అన్నారు. అమ్మ వెంటనే "నేనడిగింది వీళ్ళ గురించి కాదు , యీ నెల్లూరు లో ఫుట్ పాత్ మీద ,రోడ్డు మీద ఆకలితో దిక్కుమొక్కు లేకుండా తిరిగేవారిని గురించి అడిగాను వాళ్ళందరికీ పులిహోర పెరుగన్నం పెడదాము. వారెంతమందో వివరాలు సేకరించండి” అని అమ్మ అన్నారు. నిలువ నీడలేక, కట్టుకునేందుకు బట్టలు లేక తినేందుకు తిండి లేక అలమటించే వారు చాలామంది ఉంటారు. ఆదరించి వారి ఆకలి తీర్చే వాళ్ళు ఎంతమంది? పరిశీలన చేసి కట్టుకునేందుకు బట్టలు ఇచ్చేవారు ఎంతమంది? సామాన్యులకు ఈ భావన కలగక పోయినా, పరమహంస అన్నట్లుగా నాటి జగజ్జేననియే ఈనాడు వచ్చారు కాబట్టి తనకు ఆకలి లేకపోయినా అసలైన ఆకలితో బాధ పడేవారి వేదన గ్రహించి వాళ్ళని తన వాళ్ళుగా అమ్మ జ్ఞాపకం చేయగలిగింది. ఒక కూర ఒక పప్పు ఒక పచ్చడి ఒక సాంబారు వీటిల్లో ఉండే రకరకాల రుచి ఒక్క పులి హోర లో కనిపిస్తుంది. అందువల్ల పులిహోర పెరుగన్నము పెడితే ఆకలి బాధ తీరుతుంది. నోటికి హితవుగా ఉంటుంది. అందుకని అమ్మ మన వాళ్లకు పులిహోర పెరుగన్నము పెడదామని అన్నారు.

 

మనము కూడా మన ఇళ్ళలో శుభ కార్యక్రమములు చేస్తున్నప్పుడు కొంత అదనముగా ఆహార పదార్థములను చేయించి , రోడ్ల దగ్గర - గుళ్ళ దగ్గర-పార్కుల దగ్గర మరియెక్కడైన వుంటూ ఆకలితో బాధపడే వారికి తృప్తిగా పెట్టగలిగి, అదే సందర్భములో ఒకరిద్దరికైనా బట్టలు పెట్టగలిగితే అంతకు మించిన అమ్మ ఆరాధన మరోకటి ఉండదు కదా!

 

యాదేవీ సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

 

Author: 
కీII శేII శ్రీ ఐ. హనుమబాబు
Source: 
విశ్వజనని మాసపత్రిక జనవరి 2011 ( సంపుటి 10 సంచిక 6)