అమ్మ కరుణ అవ్యాజమైనది. అనిర్వచనీయమైనది. అమ్మ మన అవసరాలను ఆపదలను గుర్తుంచి ఆదుకొనే ఆపద్భాంధవి.

 

నా పుట్టుక అమ్మ ఇచ్చిన వరమే. మా తల్లిదండ్రులకు పెళ్ళైన తరువాత 7 సంవత్సరాలకు కూడా పిల్లలు కలగ లేదు. మానాయనమ్మ బాధపడుతుంటే మా ఫ్యామిలి కి దగ్గర ఆప్తురాలైన దోనేపూడి భారతమ్మ గారు "బాధపడకే అచ్చమ్మ! అమ్మ తప్పకుండా కరుణిస్తుంది” అనేవారట.

 

జిల్లెళ్ళమూడికి మా అమ్మను తీసుకెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్న తరువాత నేను పుట్టాను. నేను పుట్టాక , మా అమ్మకు కలలో ఆకాశం నుంచి రింగులు రింగు లుగా తిరుగుతూ ఒక పాప వచ్చి పండు అందిందిగా సంతోషేమేగా అన్నదట. మా అమ్మ " హైమ నాకలలో కనిపించింది కనుక పాపకు హైమ అని పేరు పెడితే బాగుండని” మనసులో అనుకున్నదట. భారతమ్మ మామ్మ గారు కూడా హైమ అనే పేరు పెడదాము అని అన్నారట.

 

మా స్వగ్రామం బొల్లాపల్లి లో చిన్నాదేవి అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. మా చిన్ననాటి నుండి వాళ్ళతో సన్నిహితంగా ఉంటాము. మా కుటుంబ ఇబ్బందులు, బాధలు చెప్పి బాధపడుతుంటే ఆ అక్కాయి వాళ్ళు ఎప్పుడూ నీకేమి ఫర్వాలేదు నీ బిడ్డలు అమ్మ ప్రసాదాలు వాళ్ళను అమ్మే చూసుకుంటుంది అని ఓదార్చేవాళ్ళు. ఆ విధంగానే అమ్మ మమ్మల్ని అడుగడుగునా కంటికి రెప్పల్ల కాపాడుతూ రక్షిస్తూ ఉంది.

 

భారతమ్మ మామ్మ గారితో కలసి, మొట్ట మొదటిసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు (1982) అమ్మ కు చేరువుగా కూర్చునే భాగ్యం కలిగినది. అమ్మ నా నుదుట కుంకుమ దిద్దింది. మామ్మగారిని ఈ అమాయి ఎవరు భారతీ! అని అడిగింది. మామ్మ గారు చాల సంవత్సరాలు తరువాత జిల్లెళ్ళమూడి రావటం జరిగింది. తన పేరు గుర్తుంచుకొని అమ్మ తనని పలకరించిందని మామ్మ గారు ఆశ్చర్య పోయారు. మారుపే లేని అమ్మను చూసి ఆశ్చర్యపోవడం మన నైజం.

 

అంతక్రితం ఒకసారి భారతమ్మ గారు మా నానమ్మను తీసుకొని జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ ' ఆరోజు సాయంత్రం ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు గదా! వాళ్ళను పిలవండి అన్నారట. అమ్మే స్వయంగా అన్నం గోంగూర కలిపి ముద్దలు చేసి తినిపించారట. ఇద్దరికీ చెరొక పట్టు చీర పెట్టి " ఏమే భారతీ! అచ్చమ్మ చీర బాగుందని మళ్ళీ నువ్వు మారుస్తావా?" అన్నారట. ఆమె చంచల మనస్తత్వానికి గుర్తించి ఆ విధంగా అన్నారు కాబోలు. ఆ తల్లికి తెలియని మన ప్రవర్తన, మనసు ఉంటాయని అనుకోవడం మన భ్రమ.

 

Author: 
శ్రీమతి హైమవతి
Source: 
విశ్వజనని మాస పత్రిక ఏప్రిల్ - 2011 ( సంపుటి 10 సంచిక 9)