దక్షిణ భారతంలో జిల్లెళ్ళమూడి గ్రామంలో ఒక అమ్మ ఉన్నది. తన పిల్లలకు అన్నం పెడుతుంది. వారి అనారోగ్యంలో సాకుతుంది. వారిని మందలిస్తుంది. ఆప్యాయంగా బుజ్జగిస్తుంది. ఆపదలో ఓదారిస్తుంది. సుఖఃదుఖాలలో వారి కన్నీళ్ళు తుడుస్తుంది. ఆ అమ్మ దాదాపు మనవలనే ఉంటుంది. చూపులోగాని, తీరులోనుగాని, మామూలు గుంపులోనుంచి విడదీసేందుకు ఏ రకమైన విశేషం గాని, వ్యక్తిత్వ లక్షణం గాని కనబడదు. అయినా, ఒక్క ప్రత్యేక లక్షణం లేకపోయినట్లయితే వేలాదిమంది చేత ఆరాధించబండటం కాదు గదా! కనీసం గమనించపడి ఉండేవారు కూడా కాదు. ఏమిటి ప్రత్యేక లక్షణం? అందరి తల్లుల నుంచి అమ్మను విడదీసి చూపుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే - సామాన్యంగా మనం మన ఆపేక్ష ఆప్యాయతలకు పరిధులు గీసుకుని గర్భ వాసాన పుట్టిన వారినే మన సంతానంగా భావిస్తాం. కాని, అమ్మ అలా కాదు, సర్వమూ తన సంతతిగా భావిస్తుంది. సకల మానవులు , జంతువులు, వస్తువులు, ఆలోచనలూ, గుణాలు- సర్వం అందరినీ అన్నిటినీ ఎక్కడున్నా గాఢమైన ఆపేక్షతో ప్రేమాదరాలతో దయతో పరామర్శిస్తున్నది.

 

సమస్త విశ్వంలో దేనిని ఈ అమ్మ జడంగా చూడదు. చైతన్య రహితంగా చూడదు. ఈ అనంత సువిశాల చైతన్య ప్రవాహంలో నామ రూపావస్థా వైవిధ్యంలో ఎడతెరపిలేకుండా తన సంతానాన్నే చూస్తుంది. అమ్మలో మూర్తిభవించి భాసిల్లే సంపూర్ణమైన ప్రేమ, ఏకైక దర్శనమూ మానవ జీవితంలో పొందదగిన తలమానికమైన విజయసంకేతాలు-వాటికి ఉన్ముఖమైన గమనమే అరుదు. గమ్యం చేరుకోవటం అరుదు.కాని, అమ్మ విషయంలో వానికై గమనమూ, గమ్యం చేరుకోవటం అనే ప్రశ్నలే లేవు. మొట్టమొదటి నుండి అమ్మ ఒకే విధంగా ఉన్నది. అదృష్తవంతులైన ఏకొద్దిమందో అమ్మ చిన్నతనంలోని ఉన్నత స్థితికి తార్కాణాలుగా నిలిచారు.

 

తరుచూ ఎందరికో అమ్మ బాల్యంలో అద్భుత మనిపించే అసాధారణ దర్శనాలు కనుపించేవి. అమ్మను కృష్ణ పరమాత్ముని వలె, రాజరాజేశ్వరి వలె, క్రీస్తుభగవానుని వలె ఇంకా ఎన్నో దేవతా రూపాలలో ఎందరెందరో దర్శనాను భూతులు పొందారు. సర్వసాధారణంగా చాలామంది ఆ పసికందులో పరమపవిత్ర వ్యక్తిత్వాన్ని మహోన్నత మాతృత్వాన్ని గుర్తించారు. అర్ధశతాబ్ది క్రితం ఏ లక్షణాల మూలంగా అమ్మ వైపు ఆకర్షితులైనారో అవే లక్షణాల వలన అసంఖ్యాకులైన యాత్రికులు నేడు జిల్లెళ్ళమూడికి ఆకర్షితులవుతున్నారు.

 

జిల్లెళ్ళమూడి గ్రామంలో అమ్మ చుట్టూ వర్ధిల్లిన ‘అందరిల్లు’ దేశంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్ర మైంది. ఆంధ్రదేశం నలుమూలల నుంచి అసంఖ్యాకమైన జనం అమ్మ దర్శనానికి వస్తారు. దేశంలో ఇతర ప్రాంతాలనుండి విదేశాలనుండి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతుంది. రావటంలో గల కారణాలు వచ్చే యాత్రికుల వలెనే -ఎన్నో రకాలు. అద్భుత శక్తుల గురించిన కథలతో ఆకర్షితులై కొందరు, వ్యాపార విజయానికై కొందరు - ఇలా ఎన్నో విధాలు; ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన మరి కొందరు ఒక మహా’యోగిని’ నుండి అశీర్వచనానికై మార్గదర్శకం కోసం వస్తారు. తత్వపరిశోధకులు, అమ్మ జ్ఞానసీమను కొలవాలని కొందరూ, అమ్మ నుండి సంశయనివృత్తికై కొందరూ వస్తుంటారు. సాంప్రదాయకులయిన హిందువులు ఆదిశక్తి అవతారంగా భావించే అమ్మను శాస్త్రోక్తరీతిలో పూజించుకునేందుకు వస్తారు. ప్రారంభంలో ఏ ఉద్దేశంతో మనం అమ్మను చూచేందుకు వచ్చినా, తిరిగి తిరిగి మళ్ళీ రావటానికి మాత్రం అందరికి ఒకటే కారణం, అమ్మలో మనం మహోత్కృష్టమైన ప్రేమకు ఉన్నతమైన ఆధారమునకు మూలాన్ని చూడటమే కారణం. అమ్మ అనే పదానికి ఎంతో నిజమైన గొప్పదైన భావాన్ని అమ్మలో చూస్త్తాం.

 

అమ్మ సాన్నిధ్యంలోనికి మనం మొదటిసారి వచ్చినపుడు మనలను అంతకు మునుపే ఎరిగినట్లుగా, మనం క్రొత్త వారం కానట్లుగా, విచిత్రమైన తెలిసిన తనంతో గమనిస్తుంది అమ్మ. అమ్మ ముఖ కవళికలలో పరమ ప్రశాంతతతో పాటు అతిలోక లక్షణమైన కాంతి ఉంటుంది. అయినా తన చూట్టూ చేరిన వారిని చూస్తుంటే ఆ చూపులో హావభావాలలో తల్లి కనబరిచే ఆసక్తి గోచరిస్తుంది

 

మాములుకన్నా పెద్దదైన కుంకుమబొట్టు కనుబొమ్మల మధ్య ఉండటంతో విశేషమైన ప్రాధాన్యం గల అమ్మ కనుల వైపు మనం లాగబడతాం. అందని లోతులతో సూక్ష్మమైన శక్తితో నిలదీసే కళ్ళు అవి. ఏ మాత్రం వ్యాకుల పాటు స్వీయప్రజ్ఞ అనే బుడగలు లేని నిశ్చల కాసారాలు అమ్మ కళ్ళు. అమ్మ మనలను చూస్తున్నప్పుడు ఆ దృష్టి మన అంతరంగపు అడుగుల దాకా పోతుంది. అయినా, మనం ఏ ఇబ్బందికీ గురికాము. ఎందుచేతనంటే ఆ దృష్టి ఎంతో సన్నిహితమై సున్నితమై గొప్ప హాయినిపిస్తుంది. అజ్ఞాతమైనదేదో మనలో జాగృతమై కదులుతుంది. చాలామంది చెప్పలేని భావోద్వేగానికి లోనై ఏడుస్తారు. కొందరు పరమ ప్రశాంతత మృదువుగా అవతరించటం అనుభవిస్తారు. అమ్మ ప్రశాంత వీక్షణంలో యుగాలుగా మరిచిన పరమ రహస్యం ఒక్క మాటుగా మన ముందుంచినట్లుగా దాదాపుగా అందరికీ పోగుట్టుకున్నదేదో కాళ్ళకు చుట్టుకున్నట్లనిపిస్తుంది.

 

అమ్మకు సర్వమూ తెలుసు- అమ్మకు సర్వమూ సమ్మతమే అనే ప్రేరణ సహజంగా కలుగుతుంది. ఈ అవగాహనతో పాటు ఎంతో కాలంగా మనసుకలవాటు పడిన దోష భయందోళనల మోత బరువు దిగినట్లు ఒక్కసారిగా మనసు చక్కటి స్వేచ్చాభావన పొందుతుంది. కృతజ్ఞత నిండిన మూగ ప్రార్ధనతో మన అంతరంగం ఊర్థలోకాలకు దూసుకువెళు తుంది. అపారమైన సువిశాలమైన అంతర నిశబ్దంలో 'అమ్మ' అనే ఒక్క పదం అప్పుడప్పుడు ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక రకంగా అప్పటికి పూర్తిగా అంతుపట్టకపోయినప్పటికి ఇంటికి తిరిగి చేరుకున్నట్లుగా మనకు ఎరుక అవుతుంది.

 

మనలో చాలామందికి ఈ మొదటి భావోద్వేగం (fade) త్వరలో తగ్గిపోయి మనకు అనుభవంలో ఉన్న ప్రతిస్పందనలూ, మనోవృత్తులూ చోటుచేసుకుంటాయి. అయినా మనకు ప్రసాదింపబడిన ఈ అద్భుతమైన దివ్యదర్శనం మరచిపోలేము. నాటిన విత్తనము వలె యెదలో పదిలమై అదృష్టంగా ఉండి అతిలోక జీవన పిపాసగా పరిపూర్ణమై (mature) తీరుతుంది.

 

ఆపుకోలేనంతగా ఎంతో మంది ఎందుకు మళ్ళీ మళ్ళీ జిల్లెళ్ళమూడి కి వస్తుంటారో కొంచెం సమయం అమ్మదగ్గర కూర్చుంటే చాలు తెలుస్తుంది. ప్రతిరోజూ అమ్మ చిన్నగదిలో ఎడతెగగుండా యాత్రకి జనతా ప్రవాహం సాగుతుంటుంది. చాలామంది కొద్దిసేపు అమ్మ వద్ద సంభాషిస్తూనో, మౌనంగా గమనిస్తూనో ఉంటారు. ఏ రోజు కారోజు ప్రపంచములోని సుఖదుఃఖాల బరువునంతా అమ్మ పాదాల మ్రోల క్రుమ్మరించినట్లుగా ఉంటుంది. ఎన్నడూ తరుగుతున్నట్లు తోచని ఆసక్తితో ఎంతో ఓర్పుతో శ్రద్ధగా అందరు చెప్పేది వింటుంది. ప్రతి ఒక్కనికి ఆప్యాయతతో రంగరించిన ఒక మంచి మాటో చిరునవ్వో బుజ్జగింపో ఏదో ఒకటి అమ్మ పదిలపరుస్తుంది. ఏ ఒక్కరినీ వదలదు. ఏ ఒక్కరినీ తిరస్కరించదు. జిల్లెళ్ళమూడికి ప్రయాణం ఎలా సాగిందీ, భోజనం చేసింది - లేనిదీ, వ్యక్తిగత విషయాలతో సహా పరామర్శిస్తుంది. అమ్మ తీరు ఎంతో నిరాడంబరంగా మనలను ఎంతో హాయిగా ఉంచుతుంది. అమ్మ ముఖ కవళికలెంతో కాంతివంతమై, స్నిగ్ధమై, మార్దవంగా ఉంటే అమ్మ మాటలు మెత్తగా, హాయిగా ఉంటూనే నిశబ్దంగా ఉంటాయి. ఆరితేరిన కళాకారుని వలె (Artist) అమ్మ అల్లిన గొప్ప సంతోష సమన్వయ వాతావరణంలో పీట ముడి పడిన సమస్యలు మంచులా కరిగిపోయి ఆందోళనలతో బిగిసిన ముఖాలన్నీ, దరహాస భాసురాలవుతాయి. పునీతం చేసే ప్రవాహంలో మనం ప్రక్షాళితులమయినట్లు నూతనోత్తేజంతో మనం అమ్మగదిని వదిలివస్తాం.

 

మనం జిల్లెళ్ళమూడిలో బహుశా, మనసును ఆకట్టుకోగల రూపంతో పరిసరాల నుండి విడివడి దైనందిన చీకూ చింతలకు అతీతమైన అంతర్ముఖత్వంతో ఉన్నశక్తి సంపన్నుడయిన "యోగి" ని చూడాలని అనుకుని ఉండవచ్చు. తద్భిన్నంగా మనం పరిసరాలను సావధానంగా ఆసక్తిగా గమనిస్తున్న మాతృమూర్తిని చూస్తాం. మనం పూర్తి నిరాసక్తత, నిర్లిప్తత ఉంటుందని ఎదురు చూచిన చోట అన్ని ఆచరణాత్మక సన్నివేశాలలో సంపూర్ణమైన ఆసక్తి, వానిలోని వివిధాంశాలపై ఏంతో జాగరూకత మనకు కనబడుతుంది. పచ్చియోగ విభూతులు దర్శనం కాక అణకువలో వికసించిన అలవికాని మృదురీతిని అమ్మయందు మనం అనుభవిస్తాం. సాధారణంగా ఈ మాటతో చెలామణి అయ్యే తన్ను తాను కించపరుచుకొనే స్వభావం కాక ఎవరినైనా దేనికైనా చిన్న చూపు చూడటానికి వ్యతిరేకించే అణుకువ ఇది. పిచ్చి వాడు కాని, పసివాడు కాని, మంత్రి కాని, దారినిపోయే కుక్క గాని అందరిపైన ఒకే దృష్టి జరిపే చైతన్య స్రవంతి మీద అమ్మకు గల ఆదరమే దీనికి కారణం. అందరినీ ఒకే విధమయిన ప్రేమతో ఆదరంతో చూస్తుంది, తనను అందరిలో చూస్తున్నది కనుక.

 

అమ్మ హృదయంలో తనకు మాత్రమే ఒక ప్రత్యేక స్థానం ఉంచిందని ప్రతి వ్యక్తికి ఒక స్పష్టమైన అభిప్రాయం. వచ్చే సోదరులు అసంఖ్యాకంగా ఉన్నా, ఆ అభిప్రాయం కలగడం గమనించతగ్గ విషయం. అనుపమానంగా అనుగ్రహింపబడ్డామని ఊహాలోకంలో ఉన్న మనకు ప్రతివాడూ- అలాగే భావించడం చూచి ఆశ్చర్య పోతాం. ఒక రకంగా అమ్మ దృష్టిలో మనం ప్రత్యేకం - అని ఆలోచించుకోవడం తప్పేమీ కాదు ప్రతివాడూ తన అనుగు బిడ్డడే, కనుక, ప్రతి ఒక్కరమూ అమ్మకు ప్రత్యేకమే. ప్రతి ఒక్కడూ పోగుట్టుకోలేని వదులుకోలేని విలువైన వాడే అమ్మకి.

 

మనకు త్వరలోనే అవగతం అవుతుంది. సర్వసాధారణంగా మనకు లభ్యమయ్యే పొగడ్తలకు లొంగేటువంటిదీ, ఎర చూపి పొందగలిగినట్టిది, స్వాధీనం చేసుకోవాలని తహ తహ లాడేది, చూపించిన ప్రేమకు ప్రతిఫలాపేక్ష కోరేది అయిన ప్రేమ కాదు అమ్మది. తద్భిన్నంగ్గా అమ్మ చూపే ప్రేమలో ఏ మాత్రం బలవంతం గాని, బంధంగాని కనబడదు. అది పూర్ణంగా స్వతంత్రమైనది. పొందేవాడిని కూడా స్వతంత్రంగానే వదులుతుంది.

 

తన కిరణ ప్రసారం పొందేందుకు పచ్చని చెట్లన్నీ విచ్చుకొని తన కిరణోన్ముఖం కావాలని సూర్యుడు వత్తిడి చేయనట్లే అమ్మ ప్రేమ కూడా మనకు ఇష్టమైతే స్వీకరించవచ్చు , లేకపోతే తిరస్కరించవచ్చు- అనే స్వేచ్చలోనే మనలను ఉంచుతుంది. బ్రహ్మాండమైన మఱ్ఱిచెట్టు పైన గాని, గడ్డి పరకమీద గాని వివక్షత లేకుండా సూర్యకిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి. ప్రతి మొక్క తాను ఓపినంత శక్తినే తీసుకుని తన స్వభావానికి అనుగుణమైన రీతిలో పెరగటానికి ఆ శక్తిని ఉపయోగించుకొంటాయి. స్వీకరించేవాడి అవసరాలకి అనుగుణంగానే ప్రేమ ఆదరింపబడి స్వీయగతమౌతుంది.

 

అమ్మ ప్రేమలో లక్ష్యం లేదు. దానిదైన పథకం లేదు. ప్రేమించడంలోని ఆనందం కోసమే - ప్రేమించకుండా ఉండలేదు కనుక ఆ ప్రేమకు ఫలితాలను గూర్చిగాని ఘనవిషయాలను గూర్చి లెఖ్ఖే లేదు. విజయ పరాజయాలకు గుణదోషాలకు జమాఖర్చులకు కోట్ల యోజనములకు ఆవల ఉన్నది - ఈ తల్లి ప్రేమ. పరిస్థితులను మార్చాలనే అసహనం లేదు దానిలో - ఎందుకంటే అన్నీ శాశ్వతంగా పూర్ణమైనవేనని తనకు గుర్తేకనుక. కాని చిత్రమేమంటే మార్పు తేవటంలో ప్రేమకు ఉన్న శక్తి మరి దేనికీ లేదు.

 

తన పరమమైన ఇచ్ఛతో ఆ ప్రేమ మార్పు చేయలేనిదేమీలేదు. చర్మచక్షువులకి పనిచేయనట్లు తోచినా ప్రేమలో లవలేశం చాలు ప్రపంచాలు తుది దాకా పరిభ్రమించడానికి.

 

అమ్మ తన మంచం మీద ప్రశాంతంగా కూర్చుంటుంది. అమ్మ ఏమి చేస్తున్నట్లు కనబడదు. తను ఉండే గది దాని ఆవరణ దాటడం అరుదు. జిల్లెళ్ళమూడి అసలు వదలదు. పుస్తకాలు వ్రాయదు. ఉపన్యాసాలు ఇవ్వదు. గంటలతరబడి తన మంచం మీద మౌనంగానో తనను పూజించుకునేందుకు భక్తి ప్రపత్తులు ప్రకటించుకోనేందుకు బారులు తీరే ప్రజలతో ఇష్టాగోష్టి మాట్లాడుతూనో ఉంటుంది. కాని, ఒక అవ్యక్త ప్రభావం అసంఖ్యాకమైన తన బిడ్డల జీవితాలలో రూఢి అయిన పరిణామం తెస్తు తెస్తూ ఉంది. ఏదో ఒకనాడు ప్రపంచానికి కాంతినీయగల వేలాది హృదయాలలో చిన్న జ్యోతి వెలిగించబడుతున్నది.

 

Author: 
శ్రీ రిచర్డ్ షిఫ్మెన్ (USA)
Source: 
బ్రహ్మాండేశ్వరి "అమ్మ" సంపుటి నుండి (22-06-2014)