ఆచరణాత్మక ప్రబోధాన్ని అందించే అమ్మ జీవితమే ఒక సందేశం. తోలు నోరు కాదు గదా - తాలు మాట రావటానికి అని అమ్మ చెప్పినట్లుగా, అమ్మ ప్రతిమాట మంత్రమై, మహామంత్రమై మహోపదేశమయింది.

 

అమ్మకు జన్మనిచ్చి మనకు అందించిన పుణ్యమూర్తి రంగమ్మ గారు, అమ్మకు మూడు సంవత్సరాల వయస్సులోనే పరమపదించింది. అమ్మకు మాటలు వచ్చీరాని వయస్సు. ఆ వయస్సులోనే అందరు దుఃఖ పడుతుంటే “దైవం పంపిన మనిషి మరల దైవంలోకి పోతే మధ్య మనకు ఏడుపు ఎందుకు తాతయ్య?” అని చిదంబరరావు తాతగారిని ప్రశ్నించింది. ప్రశ్నరూపేణ ఆ వయస్సులోనే అమ్మ మనకందించిన మహోపదేశమది.

 

అమ్మకు 5 సంవత్సరాలు. ఆ వయస్సులో పోలీసు మస్తానుతో సంభాషిస్తు “మాట అంటే ఏమనుకున్నావు, మారుమాట లేని మాట. ఆ మాటనే మంత్రం అంటారు.” అని అమ్మ పలికిన ఆ వాక్యమే అతని జీవితానికి మహామంత్రమై ఎన్నో అనుభవాలను ప్రసాదించింది. అంతేకాదు. ఆనాడే “అందరికీ సుగతే” అని అమ్మ హామీ ఇచ్చింది. ఆ హమీయే అతని జీవితములో ఎంతో మార్పు తీసుకొచ్చింది.

 

అమ్మ ప్రబోధం సంభాషణ పూర్వకంగానే ఉంటుంది. ఒకరోజు కొండముది రామకృష్ణ అన్నయ్య అమ్మతో సంభాషిస్తూ “అమ్మా! నిన్ను నమ్ముకొని నీ సన్నిధికి చేరాము కదా! అందరికి సులభసాధ్యమైన సాధన ఏదయినా చెప్పమ్మా! మాకు ఏ ఉపదేశమూ చేయకపోతివి. మేమూ ఏ సాధన చెయ్యటం లేదు. కాలమేమో గతించిపొతున్నది ఎట్లా అమ్మా!” అని అడగటం జరిగింది.

 

అమ్మ ప్రసన్నంగా నవ్వుతూ “అయితే సరే, మీకు నేను పెట్టినదేదో తిని హాయిగా ఉండండి. నేను ఇచ్చిందేదో ఇక్కడకు వచ్చిన పదిమందికీ ఆదరణతో పెట్టండి. ఇదే మీకు సాధన.” అని చెప్పింది. ఈ సాధనను ఎలా అలవరుచుకోవాలో ఒక సన్నివేశం ద్వారా అమ్మ నాకు ప్రబోధించింది.

 

ఒక రోజు మధ్యాన్నం 3 గంటల వేళ ఒక సోదరుడు అమ్మ దర్శనార్ధం వచ్చిన్నట్లు అమ్మకు విన్నవించాను. “భోంచేశాడేమో కనుకున్నావా?” అన్నది అమ్మ. “లేదమ్మా! మూడు గంటలు దాటింది కదా! తినకుండా ఉంటారా అని అడగలేదు” అని అమ్మ చెప్పినవెంటనే ఎందుకయినా మంచిదనిపించి ఆ సోదరుని దగ్గరకు వెళ్లి భోజనం విషయం అడిగితే చెయ్యలేదన్నాడు. అన్నపూర్ణాలయానికి తీసుకెళ్ళి అన్నం పెట్టించాను. ఆ సమయంలో అమ్మ భోజనం సంగతి కబురు చేసినందుకు ఆ సోదరుడు అమ్మ ప్రేమకు ఆనందంతో పొంగిపోయి అమ్మ పాదాలపై వాలిపోయాడు. ఆనాటి నుండి ఎవరు ఏ సమయంలో వచ్చినా భోజనం చేశారా? అని పలకరించాలి అన్న అమ్మ మాటలే ఉపదేశంగా భావించాను.

 

ఇక్కడకు వచ్చిన వాళ్ళు అమ్మ సన్నిధికి చేరాక తృప్తినీ, హాయినీ పొందటమే కాదు. అందరింటిలో అడుగు పెట్టిన క్షణమే అమ్మ దగ్గరకు వచ్చిన అనుభూతిని పొందగలగాలనీ, ఆదరణ ఆప్యాయతతో అందరిల్లు నిండి ఉండాలనీ, ఏ సమయంలో వచ్చినా అన్నపూర్ణాలయంలో ఆదరణ అనే అనుపాకం వేసి భోజనం పెట్టాలని అమ్మ ఆకాంక్ష. అందుకే ఒక సందర్భములో ప్రపంచములో ఆస్తి అంటే ఆదరణేననీ, ఆ ఆస్తి ఎవరు అంటే అమ్మ అనీ, ఆ ఆస్థి తనేననీ సుస్పష్టంగా పలికింది.

 

పూర్వం సంస్థ భాద్యతలు నిర్వహించిన సోదరులు హరిదాసుగారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా - రేపటికి బియ్యం లేవు. వడ్లు మరకు పంపిద్దామంటే - మరకు వెళ్ళే మనిషి లేడు. ఇంట్లో విసిరిద్దామంటే - తిరగలి విసిరే వాళ్ళు లేరు. ఏమి చేయాలో తోచటం లేదు అని మొర పెట్టుకున్నాడు.

 

అమ్మ వడ్లు తాను విసురుతానని తిరగలి వేయమన్నది. కొన్ని వడ్లు విసిరి, కొంత చెరిగి శుభ్రపరించింది. అన్ని పనులూ చేస్తూన్నే “నాకు పనులు రావు. అన్ని పనులు నేర్చుకోవాలి” అని అక్కడే వున్న సోదరి గజేంద్రమ్మతో అన్నది.

 

“నీకు రాని వేముంటయ్యమ్మా?” అన్న గజేంద్రమ్మతో - నేను మీతో కలవకపోతే మీరు నా దగ్గరకు రాలేరు. నేను మీతో కలసి మిమ్మల్ని దగ్గరకు తీసుకోవాలి. వడ్లగింజలో బియ్యపు గింజలాగా దాగి ఉన్నాం మనం. మనలో దోషాలు తొలగించుకొని వేరు కావాలి ఇలా. వడ్ల గింజలో ఎన్ని దాగి ఉన్నాయో మనలోనూ అన్ని దాగి ఉన్నాయి. అవి తొలగించుకోలేక పోయిన ప్రస్తుతానికి ఇవి తొలగించండి” అని అమ్మ పరిహాసము చేసింది కానీ దాని వెనుక నున్నది మనలో మాలిన్యాన్ని తొలగించుకోమని అమ్మ యొక్క ‘ప్రభోదమే’ కదా!

 

ఒక సోదరుడు మానవులు దుష్కర్మ చేస్తున్నప్పుడు దుష్కర్మ, సత్కర్మ రెంటికి కర్తవైన తల్లివి. నీవు ఈ బిడ్డల మనస్సులను మార్చి సన్మార్గంలో పెట్టవచ్చు కదా! - అని అమ్మను అడిగినప్పుడు “నాకు దుష్కర్మ కనబడితేగా” అన్న అమ్మ సమాధానం విన్న ఆ సోదరుడు “మాకు ఆ భేదం కనిపిస్తుంది. వాటి వల్ల నష్టం అనుభవిస్తున్నాం కదా! నీవు మా మనసులను తిప్పి అన్నీ సత్కర్మలే చేయిస్తే లోకంలో యీ సంక్షోభమే తప్పుతుంది కదా! - అని అనగా “నాకు అవసరమని అనిపించినప్పుడు తిప్పుతాను” అని అతి నిర్లిప్తంగా అన్నది అమ్మ. కానీ అందులో నిశ్చయమే ధ్వనించింది. ఆ సందర్భములో మంచి, చెడులను గురించి వివరిస్తూ ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం నిర్ణయించుకోవటం ఎట్లా అంటే - అన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు అనుకోవటమే – కష్ట సుఖాలు రెండు వాడి అనుగ్రహమే. ఆయా అవసరాల్లో ఆయా పనులు చేయించటమే కరుణ. అంతా వాడి అనుగ్రహమే అనుకుంటే మనస్సు హాయిగా ఉంటుంది. మనం చేస్తున్నది ఏమి లేదనీ, మనను నడిపించే శక్తి మరొకటి ఉన్నదనీ, ప్రేరణే దైవమనీ, అసలు భగవంతుడంటే - ఈ సృష్టి సర్వమూ దైవ స్వరూపమే. సృష్టే దైవం. ఎక్కడ ఎవరకి పరిచర్యలు చేసినా, ఏ రూపంలో చేసినా అది దేవతార్చనయే. ఎవరికి సాయం చేసినా మేమే చేస్తున్నాం అనే భావన కాక భగవంతుడిచ్చిన అవకాశంగా భావించాలి.

 

ఒక సోదరుడు సాధన గురించి ఒక మూర్తిని ఉద్దేశించి ధ్యానం చేస్తుంటే - అనేక రూపాలు ఎదురుగా వచ్చి నిలుచుంటాయి ఏకాగ్రత కుదరటం లేదు ఏం చేయాలమ్మా అని బాధపడ్డాడు. ‘భాద పడకు నాన్నా! నీవు ధ్యానం చేసే దైవమే అన్ని రూపాలు తనవే నని నీకు తెలియ చెప్పటం కోసం అన్ని రూపాల్లో సాక్షాత్కరించింది. అంతేకాని నీవు ఒకరిని కొలుస్తుంటే ఇతరులేవరో నీ మార్గానికి అడ్డు రావటం కాదు. వారందరూ ఒక మూర్తి యొక్క విభిన్న రూపాలని భావించటమూ, గుర్తించటమే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే పటం ముందు కుర్చోవటమే కాదు, ప్రతివస్తువును ఆ స్వరూపంగా చూడటమే ఏకాగ్రత అని అతనికి సాధనా మార్గాన్ని నిర్దేశించింది.

 

మరొక సందర్భంలో - మంత్రం అంటే అక్షరం మాలేగా అక్షరాలు ఏర్చి, కూర్చి వాక్యాన్ని రూపొందించి వాటి కొక భావన కల్పించి, చెవిలో చెప్పేసరికి అది మంత్రమవుతున్నది. దాని కొక పవిత్రత మేర్పడుతుంది. గాయత్రీ - బ్రహ్మోపదేశం ఎవరికి వినబడకుండా చెప్పాలంటారు. దేనికి? ఇతర ధ్యాస లేకుండా ఇతర శబ్దం వినకుండా వినమని అనటానికి బదులుగా ఎవరూ వినకుండా అంటున్నారు. తృప్తినీ శాంతినీ హాయినీ ఇచ్చి సందేహ నివృత్తి చేయగలిగింది. ఏదయినా, సందేశమే – మంత్రమే, మననమే – మంత్రం.

 

ఎవరయినా ఇక్కడ ఉంటామని అమ్మను అడిగినప్పుడు. ఇక్కడేదో అమ్మ దగ్గర హాయిగా ఉందని అనుకొవద్దు. గులాబిపువ్వు కావాలనుకొంటే - గులాబీ ముళ్ళు గుచ్చుకొంటాయి. ఇక్కడ తేళ్ళు, కాళ్ళ జేర్రులు, మండ్రగబ్బలు, పాములు అనేకం ఉంటాయి. వాటింన్నింటితో కలసిమెలగాలి. ఇక్కడ మెలగ గలిగితే ప్రపంచంలో ఎక్కడయినా మెలగగలరు” అని అమ్మ చెప్పింది. ఇది సమాధానమో, సందేశమో మరి. ఉండటమే- పూజ అనీ,  ఇది కాశీ రామేశ్వరం లాంటి క్షేత్రమనీ అదృశ్యంగా అన్నింటికీ  కూడలి అవుతుందనీ " చెప్పింది.

 

నిగ్రహం కోసమే - విగ్రహారాధన అని చెప్పిన అమ్మ దానిని  ఈ విధంగా వివరించింది.. రాముని  బొమ్మ ఉన్నదనుకోండి  దానిని బొమ్మల దగ్గరగా పెడితే బొమ్మగా చూస్తున్నాము. దేవతార్చనలో పెడితే దేవునిగా చూస్తున్నాము. స్థానాన్ని బట్టి పేరు పెడుతున్నాం. ఈ  నోములూ, వ్రతాలలో ఒక్కొక్క  నోముకు ఒక్కొక్క వస్తువులో దైవత్వాన్ని  ఆపాదించి పూజ చెయ్యడం జరుగుచున్నది. విడి సమయంలో   ఆ వస్తువును ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాం. అదే నోముల్లో   దైవత్వాన్ని చూస్తున్నాం. కనుక ప్రతివస్తువులో దైవత్వాన్ని చూడటం కోసమే ఈ నోములూ వ్రతాలు.

 

కాలవనిండా నీరు ఉన్నా దాహం తీరటానికి రేవు అవసరం.  ఆలయాలు కూడా రేవుల్లాంటివే  అని చెప్పిన అమ్మ ఇక్కడ హైమాలయం , అనసూయేశ్వరాలయాలను ఏర్పాటును చేసి తను అనుగ్రహాన్ని వర్షించటానికి    అనసూయేశ్వరాలయంలో కొలువై ఉన్నది.

 

"అమ్మా! మహిమలు చేసే నీవు మహిమలు ఎందుకు ఒప్పుకొవు." అన్న ప్రశ్నకు -  “మహాత్య్మాలతో కలిగే విశ్వాసం అవి నిలిచిపోయినప్పుడు చెదిరిపోతుంది కనుక ఏది జరిగిన – ఏ పరిస్థితులలోనయినా భగవంతుని మీద చెరగని విశ్వాసం ప్రసాదించామని కోరుకోవటమే ప్రార్థనకు పరమావధి.” అన్నది.

 

కష్టాలలో ఉన్న అభాగ్యుల బాధలకు స్పందించటమే మానవుని ద్వారా వ్యక్తమయ్యే దివ్యత్వమని నిర్వచించి అమ్మతన బిద్దలందరూ ఆస్థితిని పొందటానికి ఏమి చెయ్యాలో  అనేక సన్నివేశాల ద్వారా వివరించింది.

 

ఒకసారి బాపట్లలో దారుణమయిన అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సంఘటన విన్న అమ్మ హృదయం ద్రవించి వారికి ఆహార సదుపాయాలు కలుగచేయమని  “శ్రీ విశ్వజనని పరిషత్’  ను ఆదేశించింది. అన్నం పొట్లాలు కట్టటం మొదలైన పనులన్నీ తానే స్వయంగా దగ్గరుండి జరిపిస్తోంది. ఆ సమయం లో అమ్మ దర్శనార్థం వచ్చిన ఒక సోదరుడు నాకేదైనా ‘సందేశం’  ప్రసాదించవమ్మా!  అని ప్రార్థించాడు. అమ్మ మౌనంగా అతన్ని చూసింది. అతను మళ్ళీప్రాధేయపడ్డాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని అమ్మ సూచించింది. అందులోని సందేశం అర్థంకాక ఆ సోదరుడు అమ్మ పాదాలవైపు అమ్మ వైపు చూస్తుండిపోయాడు.

 

వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తుంటారు. నలుగురు కలిస్తే వారికి త్వరగా అందించవచ్చు  అన్న అమ్మ మాటలలో ప్రేమా సానుభూతి అతనికి ధ్వనించాయి. ఒకరి కొకరు తోడయితే పని తొందరగా  అవుతుంది. వారికి త్వరగా అందించటానికి అవకాశం

 

ఉంటుంది  అన్న భావం- ఆంతర్యం అప్పటికిగాని అతనికి అవగతం కాలేదు. తనకు ఆ సేవలో పాల్గొనే అవకాశం అమ్మ ఇచ్చినందుకు ఆ రూపంగా సందేశం అందిచినందుకు ఆ సోదరుడు ఎంతో సంతృప్తి పొందాడు.

 

ఈ  విధంగా  అమ్మ తన మాటల ద్వారా, చేతల ద్వారా,  కొన్ని సన్నివేశాల  ద్వారా, ఆయా పరిస్థితులకు  అనుగుణంగా ప్రభోదించింది. అందుకే “పరిస్థితులే గురు”వన్నది.

 

అమ్మ ఏం చెప్పినా తన అనుభవం లోనుంచే చెప్పింది. తాను ఆచరించి చూపింది కనుకనే - “నీ బిడ్డయందు దేనిని  చూస్తు న్నావో --అందరి యందు దానిని చూడటమే  బ్రహ్మస్థితిని పొందటమ”నీ, “కూతుర్ని కోడల్ని ఒకటిగా చూడటమే అద్వైతమ”నీ ప్రభోదించింది.

ఉపదేశమంటే దైవసన్నిధికి చేర్చటం అని ప్రవచించిన అమ్మ మనం ఆ సన్నిధికి చేరుకోవటానికి చేసిన మహోపదేశాలు ఎన్నో- ఎన్నెన్నో.....

 

Author: 
బ్రహ్మాండం వసుంధర
Source: 
విశ్వజనని మాసపత్రిక సంపుటి 11 సంచిక 4 | నవంబరు - 2011