ముఖములో వెన్నెలలు కారు చీకట్ల
బారద్రోలగా –వచ్చె- బంగారు తల్లీ!
పద్మ రాగాలతో వాదులాడెడు పాద
పద్మములతో – వచ్చె- బంగారు తల్లీ!
ముఖములో …………
రాయంచలకు నడక తీరు తెన్నులు నేర్పు
నెన్నడలతో -వచ్చె- బంగారు తల్లీ!
ముఖములో …………
మెఱపు తీగెను బోలు తను లతా సౌందర్య
విభవమ్ముతో- వచ్చె - బంగారు తల్లీ!
ముఖములో …………
కడగంటికొనలతో కరుణా రసము చిల్కు
సిరులతోడను - వచ్చె- బంగారు తల్లీ!
ముఖములో …………
ప్రజలలో రేకెత్తు వైశ్వాన రాగ్నికి ఆతిథ్య మీయగ అమృత హస్తముతోడ
భూమికొ య్యన - వచ్చె- బంగారు తల్లీ!
ముఖములో…………
కొంగ్రొత్త యుగమును కువలయంబున దిద్దు
వేడ్క తోడను - వచ్చె- బంగారు తల్లీ!
ముఖములో …………
మధురాయ మాణమై వేదాంత రుచి చూపు తెలుగు నుడికారమ్ము సింగార మొనగూర్చ
లోకమాతగ తాను మాతృతత్త్వమును నెలకొల్పగా – వచ్చె- బంగారు తల్లీ!
ముఖములో………