"నామరూపాలకు అతీతంగా భాసించే శ్రీమాత నామరూప వివర్జిత. రూపంలేని ఆమెకు ఏ రూపమైన భాసించవచ్చు. నామం లేని దేనిని ఏ పేరుతోనైనా పిలువవచ్చు. నామరూపాలు అశాశ్వతమైనవి. దేవి అఖండ స్వరూపుణి" -భారతీవ్యాఖ్య

 

సామాన్యమానవులమైన మనం ఒక్కపేరుకి, ఒకే రూపానికీ పరిమితమై ఉంటాం. ఆ పేరు కూడా జన్మతో వచ్చింది కాదు. మనం పుట్టిన 11 లేదా 21 వ రోజున పెద్దలు ‘బారసాల’ పేరుతో నామకరణ మహోత్సవం జరిపి ఏదో ఒక పేరును నిర్ణయిస్తారు. అలా పెట్టింది పేరు కాదు. అది ఒక గుర్తు మాత్రమే. పదిమందిలో గుర్తింపు తెచ్చుకున్నది అసలైన పేరు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మన పేరు, మన కుటుంబ గౌరవం నిలబడతాయి. ఈ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తే లబ్ధప్రతిష్ఠుల మవుతాం. ఇది మానవులకు సంబంధించిన అంశం. అయితే, భగవంతుని విషయానికి వస్తే, అతడు నామరహితుడు, నిర్గుణుడు నిరాకారుడు. రూపంలేని దేవుణ్ణి పలురూపాలతో, నామరహితుడైన దైవాన్ని వివిధ నామాలతో ఆరాధిస్తూ  ఆనందించటడం మన సంప్రదాయం గా వస్తోంది.

 

"విగ్రహం నిగ్రహం కోసమే" మనస్సును ఏకాగ్రతగా ఉంచటానికి ఏదో ఒక రూపాన్ని భావించి, ఆ నామాన్ని ధ్యానించడమే భక్తి. భక్తికి పరాకాష్ఠ స్థితిజ్ఞానం. జ్ఞాని సర్వత్రా భగవంతుని దర్శిస్తూ, నామరూపరహితమైన పరబ్రహ్మతత్త్వాన్ని గ్రహించి అలౌకికానందానుభూతుని పొందుతున్నాడు.

 

శ్రీ లలితాపరాభట్టారికను ఆదిశక్తిగా భావిస్తూ, సృష్టిలోని సకల ప్రాణకోటిలో దాగి ఉన్న శక్తిగా (చైతన్యంగా) అమ్మను దర్శించగలిగితే, ఆమె నామరూపవివర్జితగా మనకు సాక్షాత్కరిస్తుంది.

 

"భావమే దైవం" అని చెప్పిన  "అమ్మ" నామరూపవివర్జిత. “అన్నిరూపాలు ఆయనవే కనుక రూపరహితుడు, అన్నినామాలు ఆయనవే కనుక నామరహితుడు”

 

అని భగవత్తత్త్వాన్ని విడపరిచి చెప్పిన “అమ్మ” నామరూపవివర్జిత “రాముడంటే మగవాడనీ, అనసూయ అంటే ఆడదనీ కాదు, అనేక పేర్లతో అన్నీ వాడే" అని విశదీకరించిన “అమ్మ” నామరూపవివర్జిత. "నేను ప్రతీ దానిలో ఉన్నాను" నేను ప్రత్యేకించి ఏ ఒక్కటీ కాను” అని నామరూపాలకు అతీతమైన తన స్థితిని స్పష్టం చేసింది "అమ్మ".

 

"మీరెవరమ్మా?” అనే ప్రశ్నకు సమాధానంగా "నీకెట్ల కనబడితే అట్లా! చూడు నాయనా! అని తన నిర్దిష్టమైన రూపాన్ని సూచన చేసింది. "అమ్మ" ఒక సందర్భములో  మాతృత్రయం కలిస్తేనే అనసూయేమో!” అని నర్మగర్భంగా "ముగ్గురమ్మలకు మూలపుటమ్మ తానే" అని సెలవిచ్చింది నామరూపవివర్జిత అయిన “అమ్మ”.

 

“అమ్మ” తనకు పూజ చేసుకునేవారి గురించి "ఈ పూజలు నాకని చేస్తున్నారా? ఏ పార్వతి అనో, లక్ష్మి అనో, సరస్వతి అనో చేస్తున్నారు కానీ ...." అంటూ నామరూపాలుతో సంబంధంలేని తన తత్త్వాన్ని ప్రకటించింది. ఇలా అమ్మ చెప్పటమే కాదు భక్తులు కూడా "అమ్మను" వారి వారి ఇష్టదైవాలుగా దర్శించి, ఆనందించారు. కేవలం హిందువులే మాత్రమే కాదు, ఇతర మతస్థులు కూడా "అమ్మ" లో దైవాన్ని దర్శించడం నామరూపవివర్జితగా "అమ్మ"ను  ప్రత్యక్షం చేస్తుంది.

 

చాలా చిన్న వయస్సులోనే "అమ్మ" ఎందరికో, వారి వారి ఇష్ట దైవాల రూపం లో దర్శనమిచ్చింది. రాముడుగా, కృష్ణుడుగా, బాలాత్రిపురసుందరిగా,  శ్రీరాజరాజేశ్వరిగా సుబ్రహ్మణ్యునిగా, సత్యనారాయణస్వామిగా నృసింహస్వామిగా …. ఇలా వివిధ దేవతాకృతులతో భక్తులను పరవశింప చేసిన సందర్భాలెన్నో!  ఎన్నెన్నో! అయితే భౌతికంగా స్త్రీ రూపం లో కనిపిస్తుంది గనుక, చాలామంది "అమ్మ" ను శ్రీ లలితాపరమేశ్వరిగా భావించి, పూజించుకొంటున్నారు. అందుకు తగినట్లుగా "అమ్మ" అవనిపై అవతరించిన సంవత్సరములోనే, మన్నవలోని రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాజరాజేశ్వరీ యంత్ర ప్రతిష్ఠ జరగడం కూడా ఒక విశేషమే. అందువలనే ఈ గ్రామ ప్రజలు "అమ్మ" ను రాజరాజేశ్వరిగా సంభోదించారు.

 

సాధారణ వ్యక్తులకు "అమ్మ" విశ్వజననిగా గోచరించటములో ఆశ్చర్యం లేదు. కాని, మహనీయులకు మహానుభావులకు సైతం "అమ్మ" గాయత్రిగా (లక్ష్మీకాంత యోగి ) రాజరాజేశ్వరిగా (కాశీ కృష్ణమాచార్య) దర్శనమీయడం, తాను నామరూపవివర్జిత అని నిదర్శనగా మనకు తెలియజేయడమే. అనసూయా దేవి అంటేనే అమ్మా? హరే రామ హరే రామ అంటే అమ్మ కాదూ! అని ప్రశ్నించి, మనకు సందేహ నివృత్తి చేసిన "అమ్మ" నామరూపవివర్జిత.

 

అర్కపురీశ్వరి అనసూయా మహాదేవిని నామరూపవివర్జితగా దర్శించి, భజించి పరవశించుదాం!

 

Author: 
శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లి
Source: 
విశ్వజనని మాసపత్రిక సంపుటి 11 సంచిక 4 | నవంబరు - 2011