అమ్మ వాత్సల్య ప్రపూర్ణ. అమ్మ హృదయం విశాలం.  అమ్మ ఆలోచనలు సర్వజనహితాలు,  ప్రయోగాత్మకాలు.       

 

1959 సంII లో అమ్మ ‘అన్నపూర్ణాలయం’ స్థాపించింది. ఆ అన్నపూర్ణాలయం ‘అందరిల్లు’ అయి ప్రపంచ దృష్టినే ఆకర్షించింది. ‘అన్నపూర్ణాలయం’లో అమ్మను దర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి కీ ఉచిత భోజనమే. అక్కడ కుల, మత,  వర్గ  విచక్షణ ఏమి లేదు. పెద్ద వాడు, పేదవాడు అన్న భేదమే లేదు. రోజుకు యింతమందికే పెడతామన్న పరిమితులు లేవు. రోజుకు యీ సమయాల్లోనే పెడతామన్న నిబంధన ఏమి లెదు. ఏ వేళ ఎంతమంది ఎవరు వచ్చినా అక్కడ ఆదరంగా అక్కడ అన్నం పెట్టబడుతోంది. అమ్మ చెప్పినట్లుగా జిల్లెళ్ళమూడికి ఎవరియినా ఆకలితో రావచ్చును గానీ,   జిల్లెళ్ళమూడి నుండి ఆకలితో బయటకు వెళ్ళరాదు.

 

ప్రస్తుతం ‘అన్నపూర్ణాలయం’లో  నిత్యమూ యాత్రికులూ, విశ్వజననిపరిషత్ లో    స్వఛ్చందంగా   సేవ చేసే వ్యక్తులూ, కుటుంబాలూ,  ఓరియంటల్  కళాశాల,  పాఠశాలలలోని విద్యార్థినీ విద్యార్థులు మాత్రమే భోజనం చేస్తున్నారు. వీరు కాక మరెన్నో కుటుంబాలు ఆ ఆవరణంలోనే  నివసిస్తూ ప్రత్యేకంగా వంటచేసుకుంటున్నాయి.

 

అందరూ కలసి ఒకే వంటలో ఒకే చోట భోజనం చేస్తే ఎట్లా ఉంటుందీ? - అని అమ్మకు విలక్షణమయిన  ఆలోచన కలిగింది. అమ్మకు ఒక ఆలోచన వస్తే -వెంటనే దానిని అందరికీ చెప్పవలసిందే. అది ఆచరణలో పెట్టవలసిందే.

 

సంస్థలోని ముఖ్య కార్యకర్తలను పిలిచి వారికి వివరించింది.

 

కొందరు ‘బాగుంది’- అన్నారు

 

మరికొందరు  - యిది సాగడం కష్టం  -అన్నారు.

 

అందరూ కలసి ఆలోచించి నిర్ణయించమని ఆదేశించింది అమ్మ.

 

దాని ఫలితమే -1981 జనవరి 16 తేదిన ‘అన్నపూర్ణాలయం’లో  అమ్మ సంకల్పించిన సామూహిక భోజనానికి ప్రారంభోత్సవం జరిగింది.

 

ఆ ఉత్సవానికి అమ్మ క్రిందికి దిగి   అన్నపూర్ణాలయానికి  విచ్చేసింది.

 

ఆ సభలో డాక్టర్ రాధాకృష్ణశర్మగారు  ప్రసంగిస్తూ- ఈ విధానం అపూర్వమయినదీ, ఆదర్శమయినదీ, అని ఉద్ఘాటించారు. సమిష్టి కుటుంబ వ్యవస్థ  విఛ్చిత్తి పొందుతున్న యీ కాలంలో అమ్మ యీ విధానాన్ని ప్రవేశపెట్టడం  ఆదర్శప్రాయమయిన సమిష్టి కుటుంబ వ్యవస్థకు అమ్మ పునరుజ్జీవనం ప్రసాదించడమే - నని ప్రకటించారు.

 

1981 జనవరి 16 వ తేదిన ప్రారంభమయిన సామూహిక  భోజనపద్ధతి  జయప్రదంగా జరుగుతూ అందరికీ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగిస్తున్నది.

ఇది సాధ్యమా?- అని భయపడ్డవారందరికి అమ్మ సంకల్పిస్తే  " అసాధ్యం " అనేది లేదని మరొకసారి  ఋజువయింది.     

 

అమ్మ   -  'సంకల్పసిద్ధ , ఘటనాఘటన సమర్థ'  గదా!  

 

అమ్మ ప్రవేసిపెట్టిన విలక్షణ నూతన విధానంలో సామాజిక ఆదర్శమే కాక వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనకూడా యిమిడిఉంది.

మొదట్లో కష్టం అయినా వ్యక్తి భోజనపరమయిన యిష్టానిష్టాలపై  విజయం సాధించి క్రమంగా జిహ్వను జయిస్తాడు. అప్పుడు అన్నం జిహ్వచాపల్యం కోసం కాక ఆకలికి మాత్రమేనని గ్రహిస్తాడు. క్రమంగా జితేంద్రియుడవుతాడు. జితేంద్రియుడయిన వ్యక్తి  స్థితప్రజ్ఞుడవుతాడు.    స్థిత ప్రజ్ఞయే వ్యక్తి ధ్యేయం కదా!

 

Author: 
కీ.శే. శ్రీ కొండముది రామకృష్ణ
Source: 
విశ్వజనని మాసపత్రిక సంపుటి 15 సంచిక 12 | ఫిబ్రవరి - 1981