కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే ।
శివభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యామానంద స్పురదనుభవాభ్యాంనతిరియమ్ |
సకల కలాన్వరూపులును, శిఖలో చంద్రశేఖరులను అలంకరించుకున్నవారునూ, తపస్సు చేత ఒకరి నొకరు పొందినవారును, భక్తులకు కోరిన వరములను ప్రసాదించు వారును, మంగళమూర్తులను, ముల్లోకాలకు శుభాలను ప్రసాదించు వారును, ధ్యానసమయంలో హృదయమున సాక్షాత్కారించువారును, పరమానందంతో కూడిన స్వరూప సాక్షాత్కారం కలవారును అయిన అనసూయేశ్వరులకు వందనము.
అమ్మ నాన్నగార్లు మేనత్త మేనమామ బిడ్డలు. అమ్మ పుట్టినిల్లు మన్నవ , నాన్నగారి పుట్టిన వూరు రేటూరు.
అపుడు అమ్మకు 6 సంవత్సారులు. బాపట్ల లో నరసింహ ఉపాసకులైన శ్రీ నరసింహాచార్యులు గారు , రాత్రి పూట వారి ఇంటి నుంచి అమ్మకు తోడుగా వస్తున్నారు. అప్పటికే అమ్మ ను లలిత స్వరూపంగా భావిస్తూ ఉండేవారు.
దారి లో ఒక పెద్ద పాము ఎదురైంది. నరసింహ చార్యులు గారు "అమ్మా! పాము , పక్కకు తొలుగు కరుస్తుంది" అని అన్నారు . "అది పాము కాదు నాయనా నాగేంద్రుడు!" అన్నది అమ్మ . అంతలో వారికీ ఆ పాము అమ్మను చుట్టుకుని కనబడింది. " నాగేంద్రుడే నన్ను చుట్టుకుని వున్నాడు. నేను నాగేంద్రుడిని చుట్టుకుని వున్నాను. ఆ నాగేంద్రుడే నాగేశ్వడయి వస్తాడు. వాడే నాకాధారం. వాడి ఆకారమే నేను" అని అమ్మ ప్రకటించింది.
అపుడు అమ్మ కు 8,9 సంవత్సరాల వయస్సు. నాన్నగారి నాన్నగారికి (సుబ్బారావు తాతగారికి ) సుస్తీ చేసి బాపట్ల లో వైద్యం నిమిత్తం చిదంబరరావు గారి ఇంట్లో వుంటారు. ఒకరోజు అమ్మను దగ్గరకు పిలిచి "బావను చేసుకుంటావా ?" అని అడుగుతారు. "చేసుకుండే యోగ్యత వుంటే " చేసుకుంటా అని అమ్మ అంటుంది. అమ్మ నిర్ణయించుకొనే వచ్చింది కనుక, అన్నీ తెలుసు కనుక చూచాయగా, నరసింహచార్లు గారితో సుబ్బారావుగారితో అంటుంది సీతాపతి తాతగారు అమ్మ వివాహం నాన్నగారితో నిర్ణయించి పెళ్లి కార్డులు అచ్చు వేయించి కనకమ్మ బామ్మగారికి తెలియపరిచి, ఉద్యోగ ప్రయత్నం మీద నిజామాబాదు వెళ్ళిన నాన్నగారికి కబురు చేయమంటారు. ఆ కబురు నాన్నగారికి అందరు. పెళ్లి ఆగిపోతుంది. తాతగారికి, బామ్మగారికి మనస్పర్ధలు వస్తవి.తాతగారు వేరే సంబంధాలు చూస్తారు. ఏది కుదరదు. మధ్య వర్తుల వల్ల తగాదాలు పెరుగుతవి. అమ్మ నాన్నగారినే చేసుకుంటా నందని, పుకార్లు పుట్టిస్తారు.
భారతమ్మ గారు ( చిదంబరరావు గారి కూతురు ) గుంటూరు పురుడు పోసుకొను వెళుతుంది. సహాయంగా ఉంటుందని అమ్మను కూడా తీసుకు వెళతారు. నాన్నగారు భారతమ్మ గారిని చూడటానికి గుంటూరు వెళతారు.(భారతమ్మ గారు నాన్నగారికి పెదతల్లి కూతురు ). తననే చేసుకుంటానని అమ్మ అన్నది. ఎంత వరకు నిజమని తెలుసుకోవటానికి అమ్మను అడుగుతారు నాన్నగారు. అమ్మ "అనలేదు" అంటుంది. "అసలు పెళ్లి చేసుకోవాలని వున్నదా" అని అడిగారు. "ఇంతకు ముందు దానిని గురించి నా మనస్సులో ఏ ఆలోచన లేదు. " మా నాన్న(తాతగారు) సుభలేఖ కొట్టించిన తరువాత పెళ్లి అయిపోయిందేమో అనిపించింది" అన్నది అమ్మ.
"నీకు మనస్పూర్తిగా ఇష్టముంటే ఒక పూట మంగళగిరి పోయి పెళ్లి చేసుకుందాము వస్తావా ? తరువాత ఎవరు ఏమి చేస్తారు ?"
"అట్లా రాను ఎప్పటికైనా నాన్నే ఇష్టపడి చేయాలి , అది నా విశ్వాసం " అన్నది అమ్మ. నేను ఏమి లేనివాడిని. ఏమి ఆస్థి లేదు. నిన్ను సుఖపెట్టలేను, ఇష్టమేనా ? ని అడిగారు నాన్నగారు. అందుకు అమ్మ" చేసుకుండేది ఆస్థి ని కాదు. మనస్సును" నాకు శరీరం తో కూడా సంభందం లేదు " అన్నది.