"నాకే కాదు - చెట్లకు చేమలకు, యీ ప్రకృతికి - మీ పాదాలే శరణ్యం. ఈ సమస్త చరాచారంలో ఒకటయి; చరాచరానికే ఆధారమయినయి . మీ పాదాలు - యుగయుగాలుగా చెప్పే పాదాలున్నాయే - ఆ పాదాల్లోని ప్రధమ పాదమే మీ పాదాలు. ఈనాడు అందరూ (వారి వారి పూజా ) సంకల్పంలో ప్రధమ పాదే అంటారే - ఆ పాదమే యీ పాదాలు , యీ పాదాలే ఆ పాదం " అని జగత్తుగా ముర్తీభవించిన అంఆ, ముగురమ్మల మూలపుటమ్మ మన అమ్మ - నాన్నగారి(శ్రీ నాగేశ్వరరావు గారి ) స్థానాన్ని నిర్దేశించినది కనుకనే ఇప్పటి ఈ నాగేశ్వరాలయం .
అన్ని సాకారనిరాకారాలకు మూలమైన ఆ పరతత్వము తనకు తాను అనసూయ (సాకారం)గా అవతరించాలి అని సంకల్పించుకున్ననాడే ,తనకి ఆధారంగా శ్రీ నాగేశ్వరరావు గారిని ఎంచుకున్నది . ఆ విషయము అమ్మ జీవిత చరిత్రలోని అనేక సంఘటనల ద్వారా మనకు అవగతమవుతుంది.
ఒక సందర్భంలో, అమ్మ పదమూడవ యేటన మౌలాలి (అమ్మ చిన్నతనంలోనే అమ్మను దైవంగా గుర్తించి వీలు కుదిరనపుడల్లా, అమ్మ సాన్నిధ్యంలో గడిపే ఋషితుల్యుడైన ఓ అనాధ వయోవృద్ధుడు) "అమ్మా ! నీకు పెళ్ళి లేకపోతే ఏం? నాకు కలుగుతున్న దర్శనాల ద్వారా ఆ నీ దారి కత్తుల మార్గంలా, నిప్పుల సుడిగుండంలా అనిపిస్తోంది. ఆ భయంకర దృశ్యాలు గుర్తుకు వచ్చినపుడల్లా భయంతో నా మనస్సు , శరీరము వణికిపోతున్నాయి.. అదీ కాక, ఈ మద్య నల్లని నాగేంద్రుడు నీ కంఠానికి చుట్టుకుని నీ వైపు విషము జిమ్ముతున్నట్లు.." అని అంటుంటే - "నాన్నా, నాగేంద్రుడిలో విషతత్వం పోయి అమృతతత్వం కలిగినట్లు నీకు కనబడలేదా !" అని మౌలాలి ని అమ్మ సవరిస్తుంది.
మరొక సందర్భంలో నాగేశ్వరరావుగారికి, అమ్మకి వివాహమని పెద్దలందరూ కలిసి నిశ్చయించి, శుభలేఖలు కూడా అచ్చువేసిన తరుణంలో, కుటుంబాలలోని మనః స్పర్ధల వల్ల ఆ కళ్యాణము ఆగిపోతుంది. ఒక రోజున, అమ్మ నాగేశ్వరరావుగార్లు, తెనాలి బంధువుల ఇంట్లో ఒకరికొకరు తారసపడితే, అమ్మ నమస్కరించుకునేందుకు వారి పాదాలు పట్టుకుంటుంది. "నా పాదాలు పట్టుకున్నావెందుకు! " అని ఆశ్చర్యపడుతున్న నాగేశ్వరరావు (నాన్నగారు) గారి తో - " మనో వాక్కాయ కర్మలతో అంటున్న మాట, ఈ మాట - మీ పాద సేవ సర్వార్ధ సాధకం " అంటూ చెమర్చిన కళ్ళతో నాగేశ్వరరావు (నాన్నగారు) గారి పాదాలను తడిపి ఆ కన్నీటి బిందువులలో నాన్నగారి మోమును చూస్తూ "కన్నీటిబోట్లలో చుసిన ఈ మూర్తి ని సర్వత్రా చూడాలి " అని అమ్మ తనకు తాను తీర్మానించు కుంటుంది.
ఈ సంఘటన జరిగే నాటికి అమ్మ వయస్సు ఆరు సం॥ లు. లక్ష్మ ణాచార్యులనే అరవై సంవత్సరాల గొప్ప నృసింహోపాసకులు అమ్మతోకలిసి చిదంబర రావు గారినికి వస్తుండగా, దారి మద్యలో ఓ పెద్ద త్రాచు లక్ష్మణాచార్యులవారి ఎత్తున లేచి, వారినే సూటిగా చూస్తుంటుంది . ఆయన భయంతో బిగుసుకుపోయి , కొంతసేపటికి స్పృహలోకి వచ్చి, ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి మరింత నిర్ఘాంతపోతారు. ఆయన్ని భయపెట్టిన ఆ పెద్ద త్రాచు ఇప్పుడు అమ్మని చుట్టుకుని ఉంటుంది .చుస్తున్న ఆ దృశ్యము కరిగిపోయి మాములు స్థితికి వచ్చిన తరువాత -"అమ్మా! పాము నిన్ను చుట్టుకోవటమేమిటి ?" అని ఆశ్చర్యపడితే -"పాము కాదు నాయనా , నాగేంద్రుడు. అ నాగేంద్రుడే నన్ను చుట్టుకుని ఉన్నాడు. నేనే నాగేంద్రుడి తో చుట్టించుకున్నాను . ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు. వాడే నా కాధారం.వాడి ఆకారమే నేను " అని అమ్మ విశదపరుస్తుంది.
"వాడే నా కాధారం " అనే మాట ఆచార్యుల వారికి రుచించదు. అమ్మా,అమ్మా, అమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మా ! అంటూ పెద్దగా కేకలు వేస్తూ - "నీ కాధార మేమిటమ్మా! నువ్వే ఆధారం" అని అయోమయంగా ప్రశ్నిస్తే "ముగ్గురమ్మల మూలపుటమ్మా అంటే - ఆదియై; అనాదియై ; యీనాటికిది అయ్యింది. ముగ్గురు మూర్తులకు తల్లి మూలపుటమ్మ- మూడు భాగాలై, అన్ని అవస్థల్ని మూడుగా జేసి; తను త్రిపుటియై; బాలై;బాలాత్రిపురసుందరి అయి ; మూడు గుణములు; మూడు కాలములు; మూడు పుటలు; మూడు అవస్థలు;మూడు శరీరభాగాలు;మూడు మూర్తులై; ఆ మూడు మూర్తులకు ముగ్గురు భార్యలై; ప్రపంచమై; ఒక భుతములో నుండే అనేకంగా మారి ప్రపంచముగా పంచబడ్డది. అందుకే నాకాధారం కావలసివచ్చింది" అంటూ - ఆది అంతు లేకుండా, భూమిని ఆకాశాన్ని తాకుతూ, వారి ఇష్టదైవము నారసింహుడై దర్శనభాగ్యాన్ని కల్పిస్తుంది. మన అమ్మ - ముగ్గురమ్మల మూలపుటమ్మను తపస్సు లో దర్శించే కాబోలు ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో " మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మారుత్సారథి రసి.. నీవు మనస్సువు, నీవు ఆకాశానివి, వాయువువి, అగ్నివి నీవే, నీవే నీటివి నీవే భుమివి. ఈ విశ్వం నీ పరిణామమే.(మనః స్థానమైన ఆజ్ఞాచక్రం నుండి భుతత్వమైన ములాధారం వరకు ఆరు చక్రాలు నీ పరిణామ రూపాలే ) నీవు కానిది ఏది లేదు. విశ్వశరీరంగా పరిణమించడానికి నీ చిదనందకారాన్నే శివ, శక్తి అనే దంపతీ రూపంగా ధరించుతున్నావు తల్లీ !" అలా అన్ని తానైన ఆ బ్రహ్మాన్ని వర్ణించారు.
విశ్వ చైతన్యం మహాచైతన్యంగా ఉన్నపుడు రూపం లేదు. ఆ శక్తి పరిపూర్ణంగా ఉన్నపుడు ఏ రూపము లేదు . రూపంతో రావాలనే సంకల్పము కలిగింది కనుకనే ఆ శక్తి రెండుగా - నాగేశ్వరుడితో kudina అనసూయగా ఆవిర్భవించింది. అన్ని ధర్మాలకు, సంప్రదాయాలకు అతీతమైన ఆ అనంతం, సాకారం ( శరీరము) తో రెండుగా రావాలని నిర్ణయించుకున్నానాడే తన జీవనధర్మంగా - పాతివ్రత్యాధర్మన్ని ఎంచుకున్నది. ఆ ధర్మంతో నాన్నగారికి అన్ని సేవలూ చేస్తూ, ఆయన మనస్సులో కలిగే ఆలోచనలకు కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తూ,ప్రతిక్షణము తన మనస్సుతో నాన్నగారిని వెన్నంటే ఉంటూ, ఆయనని శాంతిలో , అమృతస్థితిలో నిలిపి, తనకి ఆధారమైన వాడిని నాగేశ్వరాలయం ద్వారా పరమపూజనియుడిని జేసింది.
నాగేశ్వరాలయంలోని మూలవిరాట్ ఇద్దరు మూర్తులు సంగమంగా కనిపిస్తుంది. అలా ఎందుకంటే - అమ్మ లేని అయ్యా లేడు, అలాగే అయ్య లేని అమ్మా లేదు. ఉన్న ఆ ఒక్క శక్తే రెండుగా వచ్చింది. కాబట్టే ఆ మూలవిరాట్ ఇద్దరు మూర్తులుగా, అమ్మానాన్నగారిలా దర్శనమవుతుంది.
అమ్మ(అం ఆ ) అంటే 'ఆది, అంతు లేనిది; అన్నింటికీ ఆధారమైనది ' ఈ అం ఆ తత్వాన్ని - ఆది మద్యాంతములు లేని బ్రహ్మాండాన్ని- గోళాకారంగా భావించి దానికి లింగం అని నామకరణం జేసాయి పురాణాలు. మరి లింగం అంటే (పురాణాల నిర్వచన ప్రకారము)- "సర్వజగత్తు దేని యందు లీనమై ఉన్నదో అది - లిం , సర్వజగత్తు దేనిని చేరుతున్నదో అది - గం. విశ్వమును నడిపించే లీనతత్త్వము, గమనతత్వము, గంయతత్వము- లింగం ". ఈ లింగ రూపియైన పరమేశ్వరుని పరిణామం 'ఆపాతాళ నభః స్థలాంత భువనం '- పాతాళం నుండి ఆకాశం వరకు ఉండే సమస్తమైన భువనము అయి ఉన్నది. నిరాకార, నిర్గుణ, నిరంజనమైన జ్యోతి స్వరూపానికి భక్తానుగ్రహ రూపమే లింగరూపము. అవయవరహితమై,ఆద్యంతములు లేనిదై అంఆ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నందువల్లే ఆలయంలోఅమ్మ లింగరూపంగా కనిపించీ కనిపించకుండా ఉంటే , అమ్మ (లింగారూపాన్ని) ని చుట్టుకుని నాన్నగారు నాగేంద్ర రూపంతో ప్రముఖంగా, గంభీరంగా దర్శనమిస్తున్నారు.
యోగపరంగా చూస్తే సర్పము అంటే నడుచునది - అంటే చైతన్యానికి సంకేతము. నాగములు అంటే జీవి దేహము నందు నాడుల ద్వారా సంచరించే ప్రాణశక్తులు. నాగేశ్వరాలయంలో సర్పరూపం(పరిమితిగా ఉన్న చైతన్యము - అంటే ప్రతి జీవి)- విశ్వమహచైతన్యానికి సంకేతమైన లింగరూపాన్ని ఆధారంగా చేసుకుని, చుట్టలు చుట్టుకుని ఉండడము గమనిస్తే - విశ్వంలో ప్రతి జీవికి ఆధారమై, వాడిలో ప్రాణశక్తులుగా జ్వలిస్తూ, ప్రాణనాధుడుగా , ప్రాణేశ్వరుడిగా , వాడే నాగేశ్వరుడిగా ఉన్నాడనిపిస్తుంది. ఆలయంలో లింగరూపంగా ఉన్న అమ్మని నాగేశ్వరుడని పిలవడానికి కారణము - ఆది , అంతు లేకుండా అన్నింటికి(సర్వచైతన్యా లకీ ) ఆధారమవుతున్నాడు గనుకనే.
నాగేశ్వరాలయంలోని మూర్తిని జూడగానే అమ్మ జీవితములోని ఓ మహోన్నత సంఘటన -
ఋషితుల్యులు మౌలాలికి కలిగిన దివ్య దర్శనం జ్ఞప్తికి వస్తుంది. ఆ దివ్య దర్శన తత్వము రూపముగా మారితే నాగేశ్వరాలయంలోని మూలవిరాట్ ల ఉంటుంది.
అమ్మ తన జీవితంలోని అసలు స్థితి (పరతత్వ స్థితి) ని మరుగున పరచి, అందరికీ అతి సామాన్యంగా కనిపిస్తూ, ఏ కొందరికో(బహుశా వారి వారి ప్రరబ్దాన్ని బట్టి కాబోలు?) అప్పుడప్పుడు తన మూలప్రకృతిని ఎఱుకపరుస్తుండేది. అలా ఎవరికైనా, ఎప్పుడైనా ఓ తత్వ దర్శనాన్ని ఇవ్వదలుచుకున్నపుడు - ఆ స్థితి తానై - ఆ స్థితి తత్వదర్శన భాగ్యాన్ని ప్రత్యక్షంగా వారికి కల్పించి , సందేహ నివృత్తి జేసేది. అలంటి సంఘటనలలోఒక మహా సంఘటనను ఇప్పుడు చుద్దాము. అమ్మకు అప్పుడు పన్నెండు సంవత్సరాల వయస్సు. అమ్మ తోటలోకి వచ్చి, అక్కడ ఉన్న చింతచెట్టు క్రింద కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. దాదాపు ఇరవై ఎనిమిది రోజులు అలా గడిచిపోతాయి. మొదటి రోజున ధరించి వచ్చిన ఆ పరికిణి చొక్కతోనే , తిండి తిప్పలు లేక,ఎండనక ,వాననక,రాత్రి పగలు అక్కడే అలా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది . మౌలాలి మధ్య మధ్యలో తోట నుండి ఉళ్లోకి వెళ్ళి, తిరిగి వస్తుండేవాడు. మౌలాలి అమ్మను చూస్తూ, రకరకాల అనుభవాలను పొందుతుండేవాడు, తాను పొందిన, పొందుతున్న అనుభవాలను అమ్మ కి చెబుతుండేవాడు. అమ్మ కళ్ళు మూసుకుని అలానే కుర్చుని ఉండేది. చివరి రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో మౌలాలి కి - ఓ మహా సర్పము అమ్మ చుట్టూ చుట్టుకుని , అమ్మ తలపై గొడుగులా - లెక్కలేనన్ని శిరస్సులతో , అనేక రంగులతో, పౌర్ణమి వెన్నెల కాంతిలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది. భ్రమేమో అనుకుంటూ, బాగా దగ్గరకి వెళ్ళి చూస్తే, యింకా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మ తెల్లవారుఝామున నాలుగు గంటలకు లేచి, మౌలలికి చెప్పి, యింటికి వెళుతుంది.
ఇక్కడ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం - పన్నెండు సంవత్సరాల బాల - ఇరవై ఎనిమిది రోజుల పాటు ఏకబిగిన అత్యంత కఠినతర పరిస్థితులలో- పగలు రాత్రి ఎండకి, వానకి, తడిసి , ఆహారము నీళ్ళు లేక, కళ్ళు మూసుకుని కూర్చొని అంత కఠోర యోగము జేయాడమెందుకు? యోగము, యోగవిద్య, యోగ లక్ష్యం తానే గదా!
మౌలాలి ఒక యోగి. తనకి ఎవరు కనబడ్డా అమ్మలా అనిపించేదిట. స్త్రీలు, పిల్లలు,పురుషులు, వృద్ధులు ఎవరైనా - ఎవరు కనిపించినా అమ్మలా అనిపించేదిట. అమ్మే అన్నిగా; అనంతంగా ఉన్నదని విశ్వసించి జీవించిన వాడు మౌలాలి . అందుకేనేమో ! యోగావిద్యను గురించి చెప్పేటప్పుడు ఆ స్థితి తానై ఆ తత్వదర్శనాన్ని మౌలలికి ప్రసాదించడమే కాకుండా, ఆయన సందేహాలు సవివరంగా వాక్కుల రూపంలో తీర్చింది.