జిల్లెళ్ళమూడి లో అవతరించి సర్వసామాన్యమైన నామరూపాల్ని ధరించిన అమ్మను సాక్షాత్తు రాజరాజేశ్వరిగా గుర్తించి ఆరాధించుకుంటూ అమ్మబాటలో ప్రయాణం చేస్తున్న సాధకులలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారొకరు. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు 26-08-1984 తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగ సారాంశాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము.

 

జిల్లెళ్ళమూడి లో అవతరించి సర్వసామాన్యమైన నామరూపాల్ని ధరించిన అమ్మను సాక్షాత్తు రాజరాజేశ్వరిగా గుర్తించి ఆరాధించుకుంటూ అమ్మబాటలో ప్రయాణం చేస్తున్న సాధకులలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారొకరు. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు 26-08-1984 తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగ సారాంశాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము.

 

బాల్యం లోనే

 

"ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై?

యెవ్వని యందు డిందు? పరమేశ్వరు డెవ్వడు? మూలకారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానయైన వా

డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్!"

 

అనే పద్యాన్ని కంఠస్థీకరించి ప్రతిపదార్థాన్ని తెలుసుకున్నప్పటికీ, ఆ పద్యములో చెప్పబడిన పరమేశ్వరుడెవ్వడో? తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం నాకు చాలాకాలంగానే మిగిలిపోయింది. నిరంతరం నా పరిశ్రమ- ఆ ప్రశ్నకు సమాధానం ‘వెతకటమే’ అయింది.

 

బాల్యం నుండి ఎందుకో నాకు పూజలంటే సరిపడేది కాదు. రాముడు, కృష్ణుడు, రాజరాజేశ్వరి వంటి ఏ దేవతామూర్తి నా హృదయంలో చోటు చేసుకోలేదు. అయితే సూర్యనమస్కారాలు మాత్రం చేస్తుండేవాడిని.

 

నాలోని జిజ్ఞాసను శాంతింపచేసే ప్రయత్నంలో రామాయణం దేవిభాగవతం , భాగవతం వంటి వాటి అనువాదాల్ని చదివినప్పుడు కూడా నా ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఏ పురాణం లో చూసిన ఆ పురాణంలో చెప్పబడే దేవతే సృష్టి స్థితి లయలకు కారణంగా వర్ణించబడి ఉండేది. పరమేశ్వరుడంటే రాజరాజేశ్వరేనా? కృష్ణుడా? మరొకరా? సందేహం ద్విగుణీ కృతమైందే తప్ప తీరలేదు. 1959 లో నేను యాదృఛ్చికంగా "జిల్లేళ్ళమూడి" రావడం జరిగింది. అమ్మ ప్రేమామృత వర్షంలో తడిసి ముద్దగా తయారైన నాకు, -"జిల్లేళ్ళమూడి" రావడం అమ్మను దర్శించటం జీవితంలో విడదీయరానిదిగా తయారయ్యింది. ఒకరోజు నా సందేహాన్ని అమ్మముందుంచాను. సందేహం ఒకటే అయినా సమాధానం చెప్పటంలో అమ్మ అనుసరించే పద్ధతి ఎంతో విలక్షణంగా ఉంటుంది. అడిగినివారిని గమనించి వారికర్థమయ్యే రీతిలో సూటిగా అమ్మ సమాధానాలను అమ్మ చెపుతుంది. బహుశా మన ప్రశ్న ఎలా ఉన్నా మన భావాన్ని అమ్మ స్వయంగానే గ్రహించ గల్గటం వలననే మనకర్థమయ్యే సమాధానాలను అమ్మ ప్రసాదించ గల్గుతుంది. సృష్టి స్థితి లయలకు కారణం ఒకరున్నారని నమ్మినా, ఆయన ఒక్కరే కావాలి! కాని, రాముడు, కృష్ణుడు, రాజరాజేశ్వరిదేవి ఇలా ఎంతోమంది కావడమేమిటి? వారు భిన్నులుకదా! అనేది నా ప్రశ్నలో అంతరార్థం. "రామునిలోని ఉన్న 'నేను', కృష్ణుని లోని ఉన్న 'నేను', దేవిలో ఉన్న 'నేను' , అమ్మలో ఉన్న 'నేను' - సృష్టికి కారణము" అని అమ్మ ప్రవచిస్తూ నా సందేహాలను పటాపంచలు చేసింది. రాముడు, కృష్ణుడు, దేవి వేరువేరుగా ఉన్నారనే అపోహ తొలగిపోయి, వారిలో ఉన్న 'నేను' గా ఉన్న తత్త్వమే ‘ఎవ్వనిచే జనించు’ పద్యంలో చెప్పిన పరమేశ్వరునిగా గుర్తించగలిగాను. "నేను నేనైన నేను" అనే అమ్మ మాటలో ఉండే పరమార్థం బోధపడి పరవశుడనయ్యాను.

 

‘అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరే’ ననటానికి సందేహం లేదు. అలాంటి నిశ్చయానికి రావటానికి తగినంత అనుభవాల్ని అమ్మే ప్రసాదించింది. మా నాయనమ్మగారే మమ్మల్ని చిన్నప్పటినుండీ పెంచి పోషించింది. ఆవిడకు ఆలయాలు దర్శించటం అలవాటు. కొన్ని సందర్భాలలో నేనూ వెళ్ళేవాడిని. ఒక రోజు నాకు కల వచ్చింది. ఆ కలలో - దేవాలయంలో చూసిన రాజరాజేశ్వరి విగ్రహం ముందు నేను మోకరిల్లటం, నా కంటి నుంచి అప్రయత్నంగా వెలువడిన కన్నీరు రాజరాజేశ్వరిదేవి కుడిపాదం మీద పడటం జరిగింది. తరువాత కాలంలో ఆ సంఘటనను దాదాపు మర్చిపోయాను. నేను అమ్మను మొదటిసారిగా దర్శించటానికి 5,6 ఏళ్ళకు పూర్వమే ఆ సంఘటన జరిగింది. ఆ తరువాత అమ్మను దర్శించిన మొదటిరోజుల్లోకూడా పై సన్నివేశం నాకు గుర్తుకు రాలేదు. పూర్వం అమ్మ , హైమాలయం వెనుక అలంకారహైమ ఉండే గదిలో ఉండేది. ఎక్కడెక్కడనుంచో వచ్చిన సోదరీ సోదరులు తమ కష్టాల్ని చెప్పుకోవటం కన్నీళ్ళు పెట్టుకోవటం చూసేవాడిని. నేనెప్పుడు అమ్మ ముందు కన్నీళ్ళు విడువలేదు. అంతే కాక నాకు కన్నీళ్ళు రావనే గర్వం కూడా కొంత ఉండేది. ఆరోజు వచ్చిన సోదరీ సోదరులంతా వెళ్ళిపోయారు. నేను కూడా ఉద్యోగరీత్యా గుంటూరు నుండి చాలాదూరానికి వెళ్ళవలసి వచ్చిన సమయమది. ఇది వరకటిలా అమ్మను తరుచు దర్శించటం కుదరదుకదా! అనే భావంతో మనసు విలవిలలాడింది. ఎప్పుడు రాని కన్నీళ్ళు ఆ రోజు ధారగా కురవడం ప్రారంభించింది. అమ్మకు ముందు మోకరిల్లిన నా కన్నీరు అమ్మ కుడి పాదం మీద పడుతుంది. అమ్మ నా కన్నీళ్ళు తుడిచి "నేనుండగా నీకు జీవితంలో కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు. నాన్నా!" అని హామీ ఇచ్చింది. అలాంటి హామీని ఎవరివ్వగలరు? ఎవరు దానిని నెరవేర్చగలరు? అమ్మ తప్ప.తిరిగి ప్రయాణమయి ఏడోమైలుకు నడుస్తున్నాను. సరిగ్గా 7 వ మైలు కొచ్చేసరికి, ఎన్నో ఏళ్ళ క్రితం నాకు కలలో రాజరాజేశ్వరి కనబడిన సంఘటన మనస్సులో మెదిలింది. చాలా ఆశ్చర్యపోయాను. ఆ కలలో నేను దర్శించిన సన్నివేశం ఏ మాత్రం తేడా లేకుండా అచ్చుగుద్దినట్లుగా ఎట్టఎదుట ప్రత్యక్షం కావటం - అమ్మ ‘రాజరాజేశ్వరి’ అనటానికి నిదర్శనమే కదా!

 

దేనిని తెలుసుకోవటానికైన ప్రత్యక్షానుభనం కంటే పరమ ప్రమాణం లేదు. అయితే ఒకరి అనుభవం మరొకరి అనుభవం కాదు. నామీద మా అబ్బాయికి (కుమారునికి) విశ్వాసం ఉండొచ్చు. అయినా నా అనుభవాలు వాడి అనుభవాలు కావు. మావాడి నడిగితే -అమ్మ "ఎంతో మంది విద్యార్థులకు యాత్రికులకు అన్నదానం చేస్తోంది. చదువుకొనే అవకాశం కల్పిస్తుంది. అది చాలా గొప్ప విషయం. మిగిలినవి నాకు తెలియవు" అంటాడు. మరోతరం మారితే ఇదంతా నిజమేనా? అనే సందేహం ఏర్పడవచ్చు. చివరకు అంతా బూటకమే అనే భావమూ బలపడవచ్చు.రామాయణ మహాభారతాలు నిజంగా జరిగాయా? అనే సందేహం కూడా ఇలాంటేదే. కనుకనే "అవి జరిగాయా లేదా అనేది ప్రధానం గాదు. అసలలాంటి భావం మనస్సులోకి రావటమే విశేషం. లోకంలో ఎవరైనా సమస్త గుణాలు కలిగిన వాడున్నాడా? అనే వాల్మీకి ప్రశ్నే అద్భుతమైనది." అంటుంది అమ్మ.

 

జనమేజయుడు తన తాతగారైన వ్యాసభగవానుణ్ణి కలుసుకోవటం జరిగింది. "మిమ్మల్ని ఎదుట చూస్తూ ఉన్నాను. మీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అయితే మీరు వ్రాసిన మహాభారతములోని శ్రీ కృష్ణ పరమాత్ముని విషయం మాత్రం నాకు సందేహంగానే ఉంది. ఎందుకంటే కళ్ళులేని దృతరాష్ట్రునికి దివ్యమైన నేత్రాల్ని ప్రసాదించి విశ్వరూపం చూపించిన తరువాత కూడా దృతరాష్ట్రునికి విశ్వాసం కలగక పోవటం, తన కుమారుల్ని నివారించకపోవటం నమ్మశక్యం కావటం లేదు.” అన్నాడు జనమేజయుడు వ్యాసునితో. వ్యాసుడు చిరునవ్వు నవ్వి “దానికేముంది కాని , నేను ఒక విషయం చెబుతాను. దానిని నీవు తు. చ. తప్పకుండా చెయ్యాలి. – నీవు ఎప్పుడు దక్షిణం వైపు వేటకు వెళ్ళకు. -వెళ్ళినా, ఎదుబందిని వేటాడకు. - వేటాడినా, స్త్రీ రూపం దాల్చిన ఆమెను పెండ్లాడకు. - పెండ్లాడినా, ఆమెతో కలసి యజ్ఞం చేయకు. -యజ్ఞం చేసినా జుట్టుముడి వేయకుండా ఉన్న ఆమెతో కూర్చోకు " అని జనమేజయుడుకి చెప్పి వెళ్ళిపోతాడు. అయితే జనమేజయుడు అన్నింటినీ ఆచరిద్దామని అనుకొంటూనే చివరకు అన్నీ ఉల్లంఘిస్తాడు. తప్పనిసరిగా చెయ్యవలసిన వచ్చిన యజ్ఞం లో సౌందర్యరాశియైన తన భార్య కేశ పాశం విడిపోయి ఎగురుతూ ఉండగా ఆశ్చర్యచకితుడై జనమేజయుడు ఆమెను చూడటం, ఋత్విక్కులందరూ వీరిద్దరిని చూస్తుండటం, పరాకుగా చేసిన హోమాలతో అగ్ని ప్రజ్వరిల్లి యజ్ఞశాల అంతా తగలబడటం, జనమేజయుడు శరీరమంతా కాలిపోవటం జరుగుతుంది. వ్యాసుడు మళ్ళీ వచ్చినప్పుడు వ్యాసుని మీదే కాక మహాభారతం మీద ,శ్రీకృష్ణుని మీద కూడా విశ్వాసం ప్రకటిస్తాడు. వ్యాసుని అనుజ్ఞతో మంటలవల్ల ఏర్పడిన గాయాలను తొలగించుకోవటానికి 18 గొంగళ్ళు కప్పుకొని భక్తి విశ్వాసాలతో మహాభారతములో ఒక్కొక్క పర్వం చదువుతూ ఒక్కొక్క గొంగళి తీసివేస్తాడు. ఆ విధంగా 17 పర్వాలు పారాయణం చేసిన తరువాత నిజంగా గాయాలు మానాయా- అనే సందేహంతో 18 వ పర్వం కూడా చదివి 18 వ గొంగళి తీసివేస్తాడు. అయితే గాయాలన్నీ మానిపోయినా చిన్న మచ్చ మాత్రం మిగిలిపొతుంది. అది జనమేజేయునికి ఏర్పడిన సందేహానికి ఫలితం. కనుకనే అమ్మ అంటుంది "విశ్వాసమే భగవంతుడు" అని. సారాంశమేమిటంటే మరొకిరికి సందేహం కలిగినంత మా త్రమున అనుభవం అనుభవం కాకపోదు. అమ్మ - 'రాజరాజేశ్వరి' కాకపోదు.

 

అమ్మ సృష్టి కర్త్రి. నా సోదరుడు శ్రీ రామ్మూర్తికి వివాహమైన 5,6 సంవత్సరాలు పిల్లలు లేరు. పెద్ద పెద్ద డాక్టర్స్ ను సంప్రదిస్తే గర్భకోశం చాలా చిన్నదిగా ఉంది. కనుక వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ధ్వంద్వంగా ప్రకటించారు. వ్యథార్త హృదయంతో ఆ దంపతులు అమ్మను దర్శించారు. అమ్మ అనుజ్ఞతో హైమాలయంలో 40 రోజులు ప్రదిక్షణాలు చేశారు. ఆశ్చర్యం! వరుసగా నలుగురు పిల్లలు కలిగారు. చివరికి ఫామిలీప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయుంచుకున్నారు. డాక్టర్లు నిర్ధ్వంద్వంగా హేతుబద్ధంగా చెప్పినదానికి పూర్తిగా విరుద్ధంగా జరిగినదంటే, అమ్మ అనుగ్రహం. సృష్టికర్త అమ్మే కావటం కాక మరేమవుతుంది?

 

అమ్మ స్థితికారిణి. తాను ఆహారం తీసుకోకుండా, అందుబాటులో ఉన్న అందరికీ పశు పక్ష్యాదులతో సహా దివ్యప్రేమను తిండీ గుడ్డను ప్రసాదిస్తూ, అనిర్వచనీయమైన శాంతి సౌభాగ్యాలను అందిస్తున్న అమ్మ ‘స్థితి కారిణి’ అని కాదనగలమా? పరిమితమైన రూపంతో ఎంత చెయ్యటానికి వీలూన్నదొ అంతా అందరికి అందిస్తూ ఉండటం స్థితి కారిత్వానికి ప్రతీకే కదా? అందుకే అదే రూపంతో కాకపోయినా ఏదో ఒక రూపంలో సృష్టి పాలన చేసే రాజరాజేశ్వరియే 'అమ్మ' అనటానికి సందేహం లేదు.

 

అమ్మ లయకారిణి. ఈ విషయంలో ఎందరికో ఎన్నో అనుభవాలున్నాయి. అన్నీ అపురూపమైనవే. అన్నీ అసాధాణమైనవే. అన్నీ అమ్మ అసామాన్యశక్తీకి ప్రతీకలే. అయినా నా అనుభవములొఉన్న దాన్నే ప్రస్తావిస్తాను. తల్లి లేని మాకు చిన్నతనం నుంచి అమ్మలా పెంచి పోషించింది మా నాయనమ్మ.ఆమె ఏనాడు క్షణం కూడా తీరిక లేకుండా పరిశ్రమిస్తూనే ఉండేది. ఒకరికి చెయ్యడమే కాని ఒకరిచేత చేయించుకోవడం ఆమె యెరుగదు. ఆమెకు అమ్మపై కల విశ్వాసాలకు అవధులు లేవు. అకస్మాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చింది. మంచం నుండి కదలలేని స్థితి ఏర్పడింది. 5, 6 రోజులు మాత్రమే అయినా చేయించుకోవటం ఆమెకు చాతకానిది, భరించలేనిది. నేను జిల్లెళ్లమూడి వస్తుంటే "నన్ను త్వరగా తీసుకెళ్ళమని అమ్మతో చెప్పరా"అని ఆవిడ అమ్మకు విన్నవించమన్నది. నేను జిల్లెళ్లమూడి వచ్చినా అమ్మ సాన్నిధ్యంలో ఆ విషయాన్ని మర్చిపోయాను. అమ్మ ఎప్పుడూ ఆమె ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నించలేదు. చిత్రం! ఆ రోజు మాత్రం అమ్మ " మీ నాయనమ్మకు ఎట్లా ఉంది?" అంటూ పలకరించింది. విషయం చెప్పాను. నేను వెడతానంటుటే అమ్మ ఎప్పుడూ 'ఉండరా' అని బలవంతం చేసేది. శివరాత్రి రోజు, "ఈ రోజు మీనాయనమ్మను పంపిద్దమా?" అన్నది అమ్మ. వద్దులే అమ్మా! నాన్న కూడా ఇంట్లో ఉండరు. - అన్నాను. మర్నాడు ఉదయం ఈ రోజు మీ నాన్న యింట్లోలోనే ఉంటాడు కదా? అన్నది., నేను పట్టించుకోలేదు. ఎప్పుడూ ఉండమనే అమ్మ వెంటనే వెళ్ళమని బలవంతం చేసింది. అయిష్టంగానే బయలుదేరి ఇంటికి వెళ్ళాను. మా నాయనమ్మ పోయింది. నాకు కబురు పంపిద్దామని ఇంటి దగ్గరవాళ్ళు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాని సరిగ్గా సమయానికి నేను అక్కడ ఉన్నాను. అమ్మ లయకారిణి అనడానికి ఇంకా ప్రమాణం ఏమి కావలి? తరంగాలలోని 'సంహారకారిణి' అనే అధ్యాయంలోని సంఘటనలు ఇలాంటివే.

 

అమ్మ శక్తి స్వరూపిణి, పంచభూతాలు ఆమె ఆజ్ఞానువర్తులైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక పౌర్ణమి వెన్నెల రోజున అమ్మ చుట్టూ నేను, మరికొంతమందిమి కూర్చొని ఉన్నాము. భోజనాలకు రమ్మని మమ్మలందరినీ పిలిచారు. ఆ కాలంలో భోజనాలకు బెల్ కొట్టడం లేదు. చాలామంది భోజనానికి వెళ్ళారు. ఒక పది మంది మాత్రం మిగిలాము. అమ్మ- భోజనం చెయ్యరా? అన్నది. 'చెయ్యము' అన్నాము. ఏ అర్ధరాత్రో ఆకలితో బాధపడతారని అమ్మకు తెలయందికాదు. వెంటనే భోజన పళ్ళాలను అక్కడికే తెప్పించింది. అన్నం కలపబోతూ "వర్షం వస్తుందేమోరా లోపలి పోదాం!" అన్నది అమ్మ- ‘ఆకాశం’ వేపు చూశాము. ఎక్కడ మేఘాలు లేవు. బ్రహ్మండమైన వెన్నెల -వర్షం రావాలంటే కనీసం ఏవో మేఘాలైన ఉండాలికదమ్మా! అంటూ వర్షం రాదనీ గట్టిగా వాదించాము. ఆకాశం వైపు చూస్తూ "రా రా నాన్నా!" అంటూ వానను ఆహ్వానించింది. క్షణంలో ధారాపాతంగా వర్షం పడింది. అమ్మ తడిసిపోతుందనే ఆలోచనకాని, భోజన పళ్ళాలు తీసుకురావాలని జ్ఞానం లేకుండా మేమంతా ఇంట్లోకి పరిగెత్తాము. అన్నం పళ్ళాలను తీసుకోని అమ్మ తరువాత వచ్చింది. వరుణునిపై అమ్మ ఆధిపత్యాన్ని కాదనగలమా?

 

మరొకసారి అమ్మ అన్నపూర్ణాలయం చూడటానికి వెళ్ళింది. అప్పుడు శేషయ్య గారు వంట చేస్తుండేవారు. గాడిపొయ్యి మీద సాంబారు కాగుతుంది. టమేటో ముక్కలు పై నుంచి క్రిందకూ, క్రిందనుంచి పైకి తెర్లుతున్నాయి. అమ్మ సాంబారు రుచి చూద్దామనుకొంది. శేషయ్య గారు గరిట తీసుకురావటానికి పరిగెత్తారు. అమ్మ గంగాళములో చెయ్యి పెట్టి పూర్తిగా ముంచి ఒక ముక్కను తీసి తాను రుచి చూచి అందరికి చూపించింది. అప్పుడు సాంబారు మరుగుతున్న వేడిలో ఎంతటి వారికైనా చేతుల్లో చర్మం ఊడిపోవటం నిర్వివాదం. అమ్మ చెయ్యి మాత్రం అతి సుకుమారమే అయిన కనీసం కందలేదు. అగ్నిహోత్రునిమీద అమ్మకు అధికారం లేకపోతే అలా ఎలా జరుగుతుంది. అమ్మ జీవితమొక మహాసముద్రం. అది రత్నాకరమే. కొందరికి కొన్ని రత్నాలు మాత్రం దొరుకుతాయి. కొన్ని మాత్రమే దొరికినవారు ఎందరో ఉన్నారు. దొరికన వాటి గురించైనా వారికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులకు తెలియదు. ఇన్ని అనుభవాలను ఇందరికి ప్రసాదించే అమ్మ ’రాజరాజేశ్వరి’యే కదా! 

 

Author: 
శ్రీ కీII శేII శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ
Source: 
మాతృశ్రీ మాసపత్రిక సంపుటి 19 సంచిక 5 | సెప్టెంబర్ - 1984