పూజా సమయంలో, మరికొన్ని వేళల్లో మినహా మిగతాకాలం అమ్మ అతి సామాన్యంగా ఉంటుంది. ఒక సాధారణ కుటుంబం లోని పెద్ద లాగా అందరినీ పలకరిస్తూ,అందరు చెప్పినవి వింటూ, అనవసరమైన సలహాలు యిస్తూ, సలహా అడిగితే నవ్వేసి తప్పుకుంటూ, కాసేపు పిల్లలతో కబుర్లు చెప్తూ, నవ్విస్తూ, ఆడుకుంటూ, అల్లరి చేస్తూ ఉంటుంది.

 

అమ్మ మనవలె సామాన్య మానవాంగనయేనని మనం భావించి, మాయనూ- ముసుగునూ కప్పుకున్న సమయంలో ఒక్క మాటతో -ఒక్క క్రియతో అమ్మకూ మనకూ గల భేదాన్ని సుస్పష్టం చేస్తూంది. ఎక్కడో మనం దాటలేని మహాసాగరం ఆవలి తీరంలో అమ్మ ఉన్నదనిపిస్తుంది. మన దృష్టికి అందని శిఖరాగ్రాన అమ్మ నవ్వుతున్నట్లుంది.

 

ఒకనాడు సాయంకాలం నాలుగు గంటలయింది. అమ్మ స్నానం చేస్తున్నది. అమ్మ మామూలుగా దర్శనం యిచ్చే గదిలో మేము కూర్చుని ఉన్నాము. క్రొత్తగా యిద్దరు వచ్చారు. వారు ఏదోదో అడుగుతున్నారు. చెప్తున్నాను. గంటా గంటన్నర గడించింది.

 

అమ్మ వచ్చింది. మంచం మీద ఆసీనురాలైంది. వారు నమస్కరించి, పూజ చేసుకోవటానికి వారు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు సర్దుకోబోతున్నారు.

 

“అన్నం తిన్నారా నాన్నా?" అని అమ్మ పలకరించింది.

 

వారు "లేదమ్మా!-" అన్నారు.

 

“ముందు భోజనం చేసిరండి, తర్వాత పూజ చేసుకుందురుగాని" అన్నది అమ్మ.

 

నపూజ చేసుకొని భోజనం చేయటం సాంప్రదాయమయినా అమ్మ ఆజ్ఞ అయినది, కనుక, వారు లేచి వెళదామనుకునీ వేళ కాని వేళ కదా! అని ఆలోచిస్తున్నట్లు ఉంటే , అమ్మ అది గమనించి అన్నది;

 

"ఎవరి అన్నం వారికి ఎప్పుడు వచ్చినా ఉంటుంది నాన్నా! సందేహించక లేచి వెళ్లి భోజనం చేసి రండి"

 

వారు లేచి అమ్మకు నమస్కారం చేసి వెళ్ళారు.

 

అమ్మ నా వంక చూచింది. నేను తలవంచుకున్నాను.

 

అమ్మ ఎపుడూ చెప్తుంది --క్రొత్తగా వచ్చినవారిని వారు అన్నం తిన్నది లేనిదీ, ఏమయినా అవరమయినదీ కనుక్కోమని.

 

కానీ, ఆ సమయంలో వారు అన్నం తినకుండా వస్తారని నేనూహించలేదు. గంటన్నర మాట్లాడాను, కానీ, వారి భోజన విషయం ప్రస్తావించలేదు. అమ్మ వచ్చిన నిమిషం లోనే వారిని భోజానానికి పంపింది.

 

ఎప్పుడు అన్నం తినని అమ్మ కు మన ఆకలి గురించీ, మన అన్నం గురించి ఎంతటి శ్రద్ధా!- అనిపించింది;

 

కన్నులశ్రుపూరితమయినాయి. ఆ వాత్సల్యానికి----

 

తల ఎత్తి అమ్మ వంక చూశాను.

కొండ కొమ్మున కోటి దీపకాంతులు వెలార్చుతూ అమ్మా..........!

 

కొండ అడుగున నలుసులా నేనూ............!

 

చేతులు ముకుళించాను.

 

జయహో! మాతా!

 

Author: 
శ్రీమతి యామిని
Source: 
మాతృశ్రీ మాస పత్రిక జూన్ -1966 ( సంపుటి 1సంచిక 1)