(జిల్లెళ్ళమూడి లోని వరసిద్ధి వినాయకాలయం కోసం వాడుక భాషలో వినాయకుని కథని మీకు అందించాలన్న మా చిన్న ప్రయత్నం.)

 

శుక్లాంబరధరం విష్ణుం- శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే!

 

ఓ రోజు నైమిశారణ్యంలో శౌనకుడు- ఇతర మహర్షులని ‘సూత మహర్షి’ కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం వినాయకుడి పుట్టుక, చంద్రుణ్ణి దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి ఆయన అందరికి యీవిధంగా చెప్పాడు.

 

పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుని అడిగాడు.

 

"రాక్షసా! ఏమి నీ కోరిక?"

 

గజాసురుడు శివుణ్ణి భక్తితో అనేక రకాలుగా స్తుతించాక తన కోరికనిలా చెప్పాడు.

 

“స్వామీ! నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులో నివాసం ఉండాలని నా కోరిక"

 

భక్తులకు తేలికగా ప్రత్యక్షమై, వారి కోరికలని ఇట్టే తీర్చి తన మీదికి తెచ్చుకొనే స్వభావం గల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివశించసాగాడు.

 

అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాడ తెలీక ఆయన కోసం అన్వేషిస్తూ , ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దాంతో పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది.

 

"ఓ మహానుభావా! పూర్వం భస్మారుడినించి నువ్వు నాభర్తని రక్షించావు. అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి భారినుంచి కూడా ఆయన్ని విడిపించి రక్షించాలి".

 

"శ్రీ హరి ఆమెను ఊరడించి చెప్పాడు.

 

"శివుడి వాహనమైన నందిని నా దగ్గరకు పంపు. నీకోరిక తీరుస్తాను. గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే తగినది".

 

బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావాల్సిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకు తలో వాయిద్యం ఇచ్చి, తనూ చిరుగంటల సన్నాయిని అందుకుని, వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్ళాడు.

 

ఆ ఊళ్ళో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్నీ గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీ హరితో చెప్పాడు.

 

"నరుడా! నీకేం కావాలో కోరుకో,"

 

అయ్యా! ఇది శివుడి వాహనం నంది. శివుని కోసం వచ్చింది. కాబట్టి దానికి ఆయన్ని చూపించు. తర్వాత మా దారిన మేం వెళతాం."

 

అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పొట్టని చీల్చుకుని కానీ శివుడు బయటకి రాలేడు. వస్తే తనకు మరణం తప్పదు. దివ్య దృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీ హరి అని తెలుసుకుని, ఇక తనకు చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు.

 

"స్వామీ! నేను మరణించాక నా తలను మూడు లోకాలు పూజించేలా చేయి. నా చర్మాన్ని నువ్వు ధరించు."

 

శివుడు అందుకు అంగీకరించగానే, శ్రీ హరి నందికి సైగ చేసాడు. నంది తనకోమ్ములతో గజాసురిని పొట్ట చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయట పడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు.

 

"పరమశివా! దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయటంతో సమానం సుమా!"

 

బ్రహ్మనీ, ఇతర దేవతలనీ, వారి వారి లోకాలకి పంపించేసిన శ్రీ హరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.

 

వినాయకుని జననం

 

అతి త్వరలో తన భర్త కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయింది. తన ఒంటిమీది సున్నిపిండిని నలిపి తీసి, ఆ నలుగు పిండితో ఓ చిన్న పిల్లవాడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది.

“కుమారా! నువ్వు కాపలా ఉండి, లోపలి ఎవరినీ రానీయక"

 

ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకు వెళ్ళాడు. పార్వతి స్నానం ముగుంచుకుని, అనేక నగలని ధరించి భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది.

కైలాసం చేరుకున్న శివుడు లోపలకి వెళ్ళబోతుంటే, పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని తెగ్గోసి లోపలికి వెళ్ళాడు.

పార్వతి శివుడికి ఎదురెళ్ళి,ఆహ్వానించి ఆయనికి కాళ్ళు కడుక్కోవడానికి తాగడానికి నీళ్ళిచ్చి పతివ్రతాధర్మం ప్రకారం పూజించింది.

చాలా కాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు.

 

"అయ్యో! వాడి తలను నరికేసానే-?"

ఇద్దరు కాసేపు బాధపడ్డాక, శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తుకొచ్చి , ఆ గజాసురుడి తలని తెచ్చి, మరణించిన ఆ బాలుడికి అతికించి, ప్రాణం పోసి- చెప్పాడు;

“వత్సా! నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను"

పార్వతి గజాననుడ్ని ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లి తండ్రులతో ప్రేమగా మెలగసాగాడు. అనింద్యుడనే ఎలుకని తన వాహనంగా చేసుకుని దానిమీద తిరగ సాగాడు.

మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకి ఓ కొడుకు పుట్టాడు. అతడికి 'కుమారస్వామి' అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు.

 

విఘ్నాలకి అధిపతి ఎవరు?

 

ఓ రోజు అనేక మంది దేవతలు, మునులు మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి పూజించి చెప్పారు.;

"స్వామీ! విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఆ విఘ్నాలని శాసించేందుకు గాను మాకో అధిపతిని ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాము. "

తన పిల్లలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు;

"నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యము నాకివ్వండి నాన్నగారు!"

కుమారస్వామి తండ్రితో " నాన్నగారు! అన్నయ్య మరుగుజ్జు, అందుచేత అసమర్ధుడు, అనఃర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి." అన్నాడు.

వారి వాదాలని విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు.

"పిల్లలారా! మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్ని స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి, వారికా ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి."

ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమిలినెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు.

" నాన్నగారు! ఎలుక నెక్కి వెళ్ళి నేను తమ్ముడికన్నా ముందుగా అన్ని నదులలో స్నానం చేసి రాలేను. నేను ఈ పోటిలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి.''

అప్పుడు శివుడు కొడుకు తో చెప్పాడు.

" కుమారా! ఎవరు నారాయణ మంత్రాన్ని జపిస్తూ, తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారో వారు మూడు వందల కల్పాల కాలం, పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు."

"అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారు!" ఉత్సాహంగా అడిగాడు గజాననుడు.

తండ్రి నారాయణ మంత్రోపదేశం చేయగానే, గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రాన్ని స్మరిస్తూ శివపార్వతుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు.

మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా, అప్పటికే గంగలో స్నానం ముగించి ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురు పడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది.

కుమారస్వామి మూడుకోట్ల ఏబై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళినా మంత్రం మహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తి చేసి, ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో చెప్పాడు.

"నాన్నగారు! అన్నగారి మహిమ తెలీక ఇందాక ఏదేదో మాట్లాడాను నాకన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్థుడు, కనుక, గజాననుడినే విఘ్నాలకి అధిపతిని చేయండి."

ఆ ప్రకారం భాద్రపదశుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటినుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలవబడే గజాననుడిని ఆ రోజు పూజించి,వడపప్పు పానకం అరటిపండ్లు తేనే పాలు కొబ్బరి అతని కిష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఇతర పిండి వంటలని నైవేద్యంగా పెట్టసాగారు.

ఆ భాద్రపద శుద్ధ చవితినాడు భూలోకంలో తనకి నైవేద్యం పెట్టిన వాటన్నిటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకు కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు.

తల్లిదండ్రుల దగ్గరకెళ్ళి వంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే తిన్నవాటితో కడుపుబ్బిన వినాయకుడు నేలమీద బోర్లా పడుకున్నాడు. పొట్ట మీద నిలిచినా చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతులని భూమికి ఆనిస్తే, కాళ్ళు పైకి లేవసాగాయి.

అలా సాష్టాంగ నమస్కరం చేయడానికి అవస్థ పడే విఘేశ్వరుడిని చూసిన, శివుడి తలలోని’ చంద్రుడికి’ వినోదం కలిగి ఫక్కున నవ్వాడు . రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా పిండవుతాయంటారు. ఆ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి నేలమీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు.

తక్షణం గర్భాశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది.

"దుర్మార్గుడా! నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి, నిన్ను చూసిన వారంతా నీలాపనిందాలతో బాధపడుగాక!"

 

ఋషుల భార్యలకి ఆ శాపం తగులుట

 

సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్ని ప్రదక్షిణం చేస్తుండగా, అగ్ని దేవుడు ఆ ఏడుగురి భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు. కాని వారిని ఏమిచేయలేనివాడై క్షీణించసాగాడు. ఆ సంగతి గ్రహించిన అగ్ని దేవుని భార్య అయిన స్వాహా దేవి భర్త కోరికని తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప, మిగిలిన ఆరుగురి రూపాలని తన మహాత్తుతో ధరించి అగ్నిదేవుడి కోరికను తీర్చింది. ఆ ఆరుగురు మునులు అదిచూసి, తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్ళని వదిలేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ణి చూసిన ఆ ఆరుగురు భార్యలమీద, తాము చేయని నేరం వచ్చి పడింది.

ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన దివ్య దృష్టితో జరింగింది గ్రహించి, ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు.

పార్వతి దేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుకోగలిగారు. మరి నా సహయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలిగదా! పదండి,".

శ్రీహరి అందరిని వెంట తీసుకుని కైలాసానికి వెళ్ళాడు . శ్రీహరి విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంటవచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు

“తల్లీ! పార్వతీ! నువ్వు చంద్రుడికిచ్చిన శాపం వల్ల లోకాలకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరిని కాపాడు."

విఘ్నేశ్వరుని ముద్దు పెట్టుకుని పార్వతి చెప్పింది.

"సరే! ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసిన ఏం కాదు."

అందరు అది విని సంతోషించి, తమ తమ స్థానాలకి వెళ్ళారు. అప్పటి నుంచి భాద్రపద మాస శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా ప్రజలు జాగ్రత్తపడుతూ, అంతా జీవించసాగారు. ఇలా కొంత కాలం గడించింది.

 

శమంతకోపాఖ్యనం

 

ద్వాపర యుగం

ఓ రోజు శ్రీ కృష్ణుడు ద్వారకకి తనని చూడవచ్చిన నారదుణ్ణి భక్తిగా పూజించాడు. ఇద్దరు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయం సంధ్య సమయంలో నారదుడు లేచి శెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో చెప్పాడు.

“స్వామీ! ఇవాళ భాద్రపద శుద్ధ చవితి. వినాయకుడి కారణంగా పార్వతి శాపం వల్ల చంద్రుణ్ణి చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి శెలవు ఇప్పించండి"

శ్రీకృష్ణుడికి శాపవివరాలన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరు చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు ఆ రాత్రి ఆకాశం వంక చూడకుండా పాలు త్రాగ బోతుంటే చంద్రుడి ప్రతిబింబం పాల గిన్నెలో కనిపించింది, 'నాకే నీలాపనిందలు రానున్నాయో గదా! ' అని శ్రీ కృష్ణుడు అనుకున్నాడు.

సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి పూజించి, శమంతకమణిని సంపాదించాడు. అతనో రోజు శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకి వచ్చాడు. శ్రీ కృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేసి, శమంతకమణిని తనకు ఇమ్మని సూచించాడు. అందుకు సత్రాజిత్తు తిరస్కరించాడు. "సరే! నీఇష్టం" అన్నాడు శ్రీ కృష్ణుడు.

కొంత కాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతక మణిని మెళ్ళో ధరించి, వేటాడటానికి వెళ్ళాడు. ఓ సింహం ప్రసేనుడిని వధించి శమంతకమణిని తీసుకుని వెళ్తుంటే జాంబవంతుడు ఆ సింహాన్నీ సంహరించి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఇచ్చాడు.

శమంతకమణి కోసం శ్రీ కృష్ణుడే తన తమ్ముణ్ణి చంపాడని సత్రాజిత్తు నగరమంతా చాటింపు వేయించాడు. భాద్రపద శుద్ధ చవితినాడు పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడటం వలనే నీలాపనింద వచ్చిందని తెలిసిన శ్రీ కృష్ణుడు కాలి గుర్తుల ద్వారా జాంబవంతుని గుహకు చేరుకున్నాడు. జాంబవంతునితో శమంతకమణి కోసం 28 రోజులు యుద్ధం జరిగింది. క్రమేపి జాంబవంతుని బలం క్షీణించినది. శ్రీ రాముడే శ్రీకృష్ణుడు అని గ్రహించిన జాంబవంతుడు "దేవాదిదేవా! నీతో యుద్ద్ధం చేయాలనీ త్రేతా యుగంలో నే కోరిన కోరికను ఈ విధంగా తీర్చవా! ధన్యుడను.. ఈ శమంతక మణితో బాటు నా కుమార్తె జాంబవతిని నీకు సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించు అన్నాడు. జరిగిన విషయం తెలుసు కున్న సత్రాజిత్తు పశ్చాతాపముతో కృష్ణుణ్ణి మన్నించమని కోరాడు. శమంతకమణితో బాటు తన కుమార్తె సత్యభామను స్వీకరించమని కోరాడు. కృష్ణుడు శమంతకమణిని తిరస్కరించాడు. కానీ సత్యభామని స్వీకరీంచ టానికి ఒప్పుకున్నాడు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు తన మీద వచ్చిన నీలాపనిందలు తొలగించుకొని జాంబవతిని సత్యభామను వివాహమాడాడు. అప్పుడు దేవతలు ఋషులు భక్తులు వచ్చి శ్రీ కృష్ణునితో మోర పెట్టుకున్నారు. శ్రీ కృష్ణా! నీవు దేవాదిదేవుడవు నీకు వచ్చిన నీలాపనిందలు నీవు తొలగించకో గలవు. సామాన్యులైన మేము ఎలా పోగుట్టుకోగలము.? కావున మాకు నీవే మార్గమును చూపించగలవు.

శ్రీ కృష్ణుడు ప్రసన్నుడై "మీరు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో పవిత్రంగా పూజించి గణపతి పుట్టుక నుంచి శమంతకోపాఖ్యనం వరకు కథ విని లేక చదివితే ఆ రాత్రి చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలూ కలుగవు." అని చెప్పగానే అందరు సంతోషించారు.

సూత మహాముని ఆ కథని శౌనకుడు ఇతర మునులకి చెప్పాక, వారి దగ్గర శెలవు తీసుకుని తన నివాస స్థానానికి వెళ్ళాడు.

ఆ విధంగా ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితినాడు మనమందరము వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాము.

‘లోకంలోని సమస్త ప్రాణులకి శుభం కలుగుగాక!’

 

Author: 
శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి
Source: 
హాస్యం. కాం సౌజన్యంతో- 7 సెప్టెంబర్ 2005